Ticket fare
-
స్పెషల్ బస్సు పేరుతో టీజీ ఆర్టీసీ నిలువు దోపిడీ
నల్గొండ, సాక్షి: ప్రత్యేక బస్సుల పేరుతో టీజీ ఆర్టీసీ నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. దసరా పండుగ ముగిసిన తర్వాత కూడా స్పెషల్ బస్సులు అంటూ రేట్లు పెంచి నేటికి అమలు చేస్తున్నారు. మామూలు రోజుల్లో మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు రూ. 290 చార్జ్ ఉండగా.. దసరా సందర్భంగా స్పెషల్ బస్సుల పేరుతో అదనంగా రూ. 70లను ఆర్టీసీ వసూలు చేసింది. ప్రస్తుతం మరో రూ. 40 పెంచి రూ. 110లు అదనంగా వసూలు చేస్తోంది. ప్రస్తుతం మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు టికెట్ ధర రూ. 400 వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రయాణికులు ప్రశ్నిస్తే.. ఉన్నతాధికారులే అమలు చేయమన్నారని కండక్టర్లు సమాధానం ఇస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: రైతుల ద్రోహి కాంగ్రెస్: కేటీఆర్ -
ప్రయాణికులకు అలెర్ట్, పెరిగిన ఇండిగో విమాన సీట్ల ధరలు
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వినియోగదారులకు భారీ షాకిచ్చింది. విమానంలోని ఆయా సీట్ల ధరల్ని భారీగా పెంచింది. దీంతో ఫ్రంట్ రో విండో సీటుకు రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది. ఇండిగో సీట్ల ఎంపిక ఛార్జ్ ఇండిగో అదనపు స్థలాన్ని అందించే ‘ఎక్స్ఎల్’ సీట్లు లెగ్‌రూమ్ ఆధారంగా వివిధ సీట్ల కేటగిరీల కింద ప్రయాణికులకు సీట్లను అందిస్తుంది. దీంతో పెంచిన మొదటి వరుస ఎక్స్ఎల్ సీట్ల ఛార్జీలు ఇప్పుడు రూ .1400 నుండి రూ .2000 వరకు పెరిగాయి. మిడిల్ సీట్లకు రూ.150 నుంచి రూ.2000 వరకు ధరల్ని సవరించింది. కాగా, గతంలో ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న ఇంధన ఛార్జీని ఉపసంహరించుకున్నట్లు ఇండిగో ఇటీవల ప్రకటించింది. దీంతో టికెట్ ధరలు కనిష్టంగా రూ.300 మేర తగ్గగా.. దూర ప్రాంతాల్ని బట్టి ధర రూ.1000కి పెరిగాయి. అయితే ఇటీవల ఇంధన ధరలు తగ్గడంతో ఇంధన ఛార్జీలను ఉపసంహరించుకుంది. -
వైజాగ్–సింగపూర్ రూ. 6,300కే విమాన టికెట్
ముంబై: సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో భాగమైన బడ్జెట్ విమానయాన సంస్థ స్కూట్ తాజాగా ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. వైజాగ్ తదితర నగరాల నుంచి సింగపూర్‌కు అత్యంత తక్కువ రేటు రూ. 6,300 నుంచి (వన్–వే) ఫ్లయిట్ టికెట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఆగస్టు 28న ప్రారంభమైన ఈ సేల్ సెపె్టంబర్ 1 వరకు అయిదు రోజుల పాటు ఉంటుందని వివరించింది. ప్రయాణాలకు సంబంధించి ప్రాంతాన్ని బట్టి డిసెంబర్ 14 వరకు ఈ టికెట్లను వినియోగించుకోవచ్చు. -
Vande Bharat: తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తగ్గేదేలే!
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ రైళ్ల సక్సెస్ మాటేమోగానీ.. అధిక టికెట్ ధరలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. అయితే దూర ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉండడంతో నెమ్మదిగా సాధారణ ప్యాసింజర్ రైళ్లకు ప్రయాణికులు దూరమైపోతున్నారు. అయినప్పటికీ వందే భారత్ రైళ్లనే ప్రమోట్ చేసేందుకే భారతీయ రైల్వేస్ మొగ్గు చూపిస్తోంది. ఈ క్రమంలో.. వందే భారత్ రైళ్లలో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచడానికి టికెట్ ధరల్ని తగ్గించాలని నిర్ణయించింది. అయితే.. ఇక్కడే ఓ మెలిక ఉంది. తక్కువ దూరం ఉండే మార్గాల్లో నడిచే రైళ్లలో టికెట్ ధరలు తగ్గించాలని భారతీయ రైల్వేస్ భావిస్తోంది. పైగా తెలుగు రాష్ట్రాల రూట్లకు ఇది వర్తించబోదని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు ఇండోర్-భోపాల్ వందే భారత్ రైలు ప్రయాణ సమయం మూడు గంటలు. జూన్ నెలలో 29 శాతం ఆక్యుపెన్సీతోనే నడిచింది ఈ రైలు. అలాగే.. భోపాల్-ఇండోర్ రూట్లో 21 శాతం ఆక్యుపెన్సీతో నడిచింది. అందుకే ఈ తరహా తక్కువ దూరం ఉన్న రూట్లో టికెట్ ధరల్ని తగ్గించాలని.. తద్వారా ఆక్యుపెన్సీ పెంచుకోవాలని భావిస్తోంది రైల్వేస్. ఇక ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లల్లో మాత్రం టికెట్ ధరలు యథాతధంగా కొనసాగించాలనుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నడుస్తున్న సికింద్రాబాద్ - విశాఖ, సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందేభారత్ రైళ్లకు ఆదరణ బాగుందని అధికారులు చెబుతున్నారు. దీంతో, టికెట్ ధరల తగ్గింపు ప్రతిపాదనలు ఈ రైళ్లకు లేవని స్పష్టత ఇచ్చేశారు. ఇదిగాక.. త్వరలోనే విజయవాడ - చెన్నై వందేభారత్ రైలు ప్రారంభం కానుంది. వచ్చే నెలలో మరో వందేభారత్ సికింద్రాబాద్ - పూణే మధ్య ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. ఆయా రూట్లలోనూ టికెట్ ధరలు అధికంగానే ఉండొచ్చని ఇప్పటికే అధికారులు సంకేతాలు కూడా ఇచ్చేశారు. ఇదీ చదవండి: ఇంతకీ కట్టప్ప ఎవరు? బాహుబలి ఎవరు? -
విమాన టికెట్ ధరలు చాలా తక్కువేనంటూ.. కేంద్రంపై చిదంబరం సెటైర్లు!
విమాన టికెట్ ధరలపై కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో వ్యంగంగా ట్వీట్ చేశారు. రెండు విమాన సంస్థలకు చెందిన ఢిల్లీ - చెన్నై బిజినెస్ క్లాస్ టికెట్ ధరలు రూ.63,000, రూ.57,000 చాలా తక్కువేనని అన్నారు. ‘ఢిల్లీ- చెన్నై విస్తారా, ఎయిరిండియా బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. రూ.6300, రూ.5700 చాలా తక్కువ.‘అయ్యో, క్షమించండి టికెట్ ధరలు తక్కువగానే ఉన్నాయి. ఒక విమాన టికెట్ ధర రూ.63,000, మరో విమాన టికెట్ ధర రూ.57,000 ఉన్నాయని ట్వీట్ చేశారు. భారత్ స్వేచ్ఛా మార్కెట్. డిమాండ్ పెరిగినప్పుడు సరఫరా పెరుగుతుంది, ”అని ట్వీట్లో పేర్కొన్నారు. Delhi-Chennai Business Class air tickets on Vistara and Air India have been set at a 'reasonable' price of Rs 6300 and Rs 5700 respectively Oops, sorry, they are set at a 'very reasonable' Rs 63,000 and Rs 57,000 respectively In free markets, when demand increases, supply will… — P. Chidambaram (@PChidambaram_IN) June 18, 2023 ‘భారత్ ఫ్రీ మార్కెట్. డిమాండ్ పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయి. విమానయాన సంస్థలు తమ మార్గాలను విస్తరిస్తాయి. పాత మార్గాల్లో విమానాలను తగ్గించి వాటి ధరల్ని పెంచుతాయి. గుత్తాధిపత్య పెట్టుబడిదారీ విధానంలో భారతదేశం ప్రపంచానికి విశ్వగురువు అవుతుంది’అని వ్యంగంగా ట్వీట్లో తెలిపారు. I am waiting for @JM_Scindia reply , which is most likely to why do you travel by business class? why not economy class?. I am sure mr @PChidambaram_IN as strewed politician and professional would have checked economy fare also from Chennai to Delhi ,which is around 30000 these… — Pravesh Jain (@PRAVESHPARAS) June 18, 2023 చిదంబరానికి పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎలా స్పందిస్తారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. మీరు బిజినెస్ క్లాస్‌లో ఎందుకు ప్రయాణం చేస్తారు? ఎకానమీ క్లాస్‌లో ఎందుకు ప్రయాణించరు? చిదంబరం ఒక తెలివిగల రాజకీయవేత్త. ప్రొఫెషనల్‌గా చెన్నై-ఢిల్లీ నుండి ఎకానమీ ఛార్జీలను కూడా తనిఖీ చేసి ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇదీ చదవండి : రూ.88,000 కోట్ల విలువైన రూ.500 నోట్ల మిస్సింగ్.. స్పందించిన ఆర్బీఐ! -
సికింద్రాబాద్-తిరుపతి ‘వందే భారత్’ రైలు ప్రత్యేకతలు, టికెట్ ధరలివే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ స్టేషన్లో శనివారం ఉదయం సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య తొలి వందే భారత్ రైలు నడుస్తుండగా.. ఇది రెండోది కానుంది. ఈ సెమీ హైస్పీడ్ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగనుంది. మంగళవారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు సేవలందిస్తుంది. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిచే (20701) రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉదయం 6గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.30గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే, తిరుపతి - సికింద్రాబాద్ (20702) రైలు తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. తాజాగా ఈ మార్గంలో టికెట్ల ధరల వివరాలను ఐఆర్సీటీసీ వెల్లడించింది. సికింద్రాబాద్ - తిరుపతి, తిరుపతి - సికింద్రాబాద్ రూట్లలో టికెట్ల రేట్లలో స్వల్ప వ్యత్యాసం ఉంది. సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రత్యేకతలు ► నిత్యం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఆరు సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ►సికింద్రాబాద్ నుంచి తిరుపతికి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ లో 12 గంటల ప్రయాణం ►వందే భారత్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 8.30 గంటల ప్రయాణం ►దేశంలో ఇది 13వ వందే భారత్ ట్రైన్.. ఇందులో 8 కోచ్ లు 530 సీటింగ్ కెపాసిటీ. ►1 ఎగ్జిక్యూటివ్, 7 చైర్ కార్ కోచ్‌లు ►ప్రయాణికుల ఆదరణ దృష్ట్యా కోచ్‌లను పెంచే అవకాశం ►శనివారం ఉదయం 11.30 నుంచి 12.05 లోపు సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్ ప్రారంభం ►ఈనెల 9 నుంచి ఉదయం 6 గంటలకు ప్రయాణికులకు అందుబాటులో వందే భారత్ ట్రైన్ ►ఈ వందే భారత్ ట్రైన్ స్పీడ్ గంటకు 77 కిలోమీటర్లు ►సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ చార్జీ 1680, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3080 రూపాయలు ►తిరుపతి నుంచి సికింద్రాబాద్ చైర్ కార్ ఛార్జీ 1625, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3030 రూపాయలు ►వారానికి 6 రోజులు మాత్రమే సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్ రాకపోక సికింద్రాబాద్ నుంచి ఒక్కో స్టేషన్‌కు ఛార్జీలు ఇలా.. ఛైర్ కార్ ►సికింద్రాబాద్ నుంచి నల్గొండ - రూ.470 ►సికింద్రాబాద్ నుంచి గుంటూరు - రూ.865 ►సికింద్రాబాద్ నుంచి ఒంగోలు - రూ.1075 ►సికింద్రాబాద్ నుంచి నెల్లూరు - రూ.1270 ►సికింద్రాబాద్ నుంచి తిరుపతి - రూ.1680 ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ ►సికింద్రాబాద్ నుంచి నల్గొండ - రూ.900 ►సికింద్రాబాద్ నుంచి గుంటూరు - రూ.1620 ►సికింద్రాబాద్ నుంచి ఒంగోలు - రూ.2045 ►సికింద్రాబాద్ నుంచి నెల్లూరు - రూ.2455, ►సికింద్రాబాద్ నుంచి తిరుపతి - రూ.3080 చదవండి: ప్రధాని పర్యటనకు కేసీఆర్ వస్తే సన్మానం చేస్తాం: బండి సంజయ్ -
HYD Metro: మెట్రో ఛార్జీలు పెంపు!
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో ప్రాజెక్టులో రైళ్లు, స్టేషన్లు, డిపోలు, కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థ నిర్వహణ, భద్రత.. ఇలా అతి కీలకమైన విధులన్నీ ప్రైవేటు ఔట్సోర్సింగ్ ఏజెన్సీల చేతుల్లోనే ఉన్నాయి. ఈ విధానం తప్పు కాకపోయినా.. మెట్రో నిర్వహణ బాధ్యతలు దక్కించుకున్న అతిపెద్ద కియోలిస్ సంస్థ ప్రతీ పనిని తిరిగి పలు ప్రైవేటు ఏజెన్సీలకు సబ్‌కాంట్రాక్టు పేరిట అప్పజెప్పింది. సుమారు పదికిపైగా ప్రైవేటు ఏజెన్సీలు మెట్రో జర్నీలో పాలుపంచుకున్నాయి. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. ఈ ఏజెన్సీలు చేపట్టే ఉద్యోగుల నియామకాలు, వారికి నెలవారీగా ఇచ్చే జీత భత్యాలు, కారి్మకులు, ఉద్యోగుల భద్రతకు తీసుకుంటున్న చర్యలు.. చివరకు ఏ ఏజెన్సీ.. ఏ విధులు నిర్వహిస్తోందన్న విషయాల్లోనూ అంతులేని గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. టికెటింగ్ సిబ్బంది సమ్మెతో.. తాజాగా స్టేషన్లలో టికెటింగ్ విధులు నిర్వహించే సిబ్బంది అమీర్‌పేట్ స్టేషన్ వద్ద మెరుపు సమ్మెకు దిగడంతో ఆయా ఏజెన్సీల నిర్వాకం వెలుగుచూసింది. ప్రైవేటు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉప్పల్ మెట్రో డిపోలో జరిపిన చర్చలు, అరకొరగా పెంచిన వేతనాలు ఉద్యోగుల అసంతృప్తిని పూర్తిస్థాయిలో చల్లార్చకపోవడం గమనార్హం. మూడు కారిడార్లలో పని చేస్తున్న ఉద్యోగుల వేతనాల్లో వ్యత్యాసం ఉండడం, పని గంటలు, ఇతర భత్యాల విషయంలో తాము శ్రమదోపిడీకి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. నగర ప్రజారవాణా వ్యవస్థలో కొత్త శకం ఆవిష్కరించిన మెట్రో ప్రాజెక్టులో ఇలాంటి విపరిణామాలు చోటు చేసుకోవడం ఆక్షేపణీయమని ప్రజారవాణా రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ విషయంలో పారదర్శకత ఉండాలని, ఉద్యోగులకు కనీస వేతనాలు మంజూరు చేయాలని స్పష్టంచేస్తున్నారు. - ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్– ఎంజీబీఎస్, నాగోల్– రాయదుర్గం మూడు రూట్లలో నిత్యం 4 నుంచి 4.5 లక్షల మంది జర్నీ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రయాణీకుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నప్పటికీ నష్టాల నుంచి ఇప్పట్లో గట్టెక్కే పరిస్థితులు దరిదాపుల్లో కనిపించడంలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో తీసుకున్న రుణాలు, వాటిపై వడ్డీ చెల్లింపులు, రైళ్లు, స్టేషన్లు, డిపోల నిర్వహణ భారంగా పరిణమించింది. ప్రభుత్వ పరంగా అందాల్సిన సాఫ్ట్‌లోన్ అందకపోవడం మెట్రోకు శాపంగా మారింది. - ఈ నేపథ్యంలో తాజాగా చార్జీల పెంపునకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ప్రస్తుతం ఉన్న కనీస చార్జీని రూ.10 నుంచి రూ.20కి.. గరిష్ట చార్జీని రూ.60 నుంచి రూ.80 లేదా రూ.100 వరకు పెంచే అవకాశాలున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. చార్జీల పెంపుతో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉండవన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. నగరంలో అన్ని మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు రవాణా సదుపాయం కలి్పంచకపోవడం, అన్ని స్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్ వసతుల లేమి కారణంగా ఆశించిన స్థాయిలో ప్రయాణికుల సంఖ్య పెరగడం లేదన్నది సుస్పష్టం. -
బంఫర్ ఆఫర్: రూ.1497కే ఎంచక్కా గాల్లో ఎగిరిపోండి.. త్వరపడాలి!
దేశంలో అతి పెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా(AirAsia) న్యూ ఇయర్ సందర్భంగా తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రాబోతున్న కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని 'న్యూ ఇయర్, న్యూ డీల్స్' పేరిట తమ ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను కేవలం రూ.1,497గా నిర్ణయించింది. ఈ ఆఫర్ డిసెంబర్ 25 వరకు అమలులో ఉంటుందని, దీని కింద బుకింగ్ చేసుకున్న ప్యాసింజర్లు వచ్చే ఏడాది(2023) జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 లోపు ప్రయాణించవచ్చని తెలిపింది. ఈ ప్రత్యేక ఆఫర్ ధర బెంగళూరు-కొచ్చి వంటి రూట్లతో పాటు, దాని నెట్వర్క్ అంతటా ఇదే విధమైన తగ్గింపు విక్రయ ఛార్జీలు ఉన్నట్లు తెలిపింది. కంపెనీ వెబ్సైట్, కంపెనీ మొబైల్ యాప్, ఇతర ప్రధాన బుకింగ్ ఛానెల్‌ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని సూచించింది. కొనసాగుతున్న లాయల్టీ ప్రయోజనాలలో భాగంగా, వెబ్సైట్, యాప్‌లో బుకింగ్ చేసే (నియో పాస్) NeuPass సభ్యులు కాంప్లిమెంటరీ ఫ్రూట్ ప్లాటర్, ప్రాధాన్యత చెక్-ఇన్, బ్యాగేజీ, బోర్డింగ్‌తో పాటు 8 శాతం నియో కాయిన్స్ (NeuCoins) వరకు కూడా పొందుతారు. మరోవైపు, ప్రముఖ సంస్థ ఇండిగో కూడా రూ.2,023కే విమాన టిక్కెట్‌ను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. Bank your new year resolutions now! Ring in 2023 with our #NewYearNewDeals sale, with fares starting ₹1,497! Book till 25 Dec for travel till 15 Apr 2023 on https://t.co/QiptjwMRjT or the AirAsia India mobile app. pic.twitter.com/bEwWXFlcLY — AirAsia India (@AirAsiaIndia) December 23, 2022 -
దసరా సీజన్: ఇదో రకం దోపిడి, కానీ తప్పట్లేదు!
బెంగళూరు: దసరా పండుగ కావడంతో బెంగళూరు నుంచి వేలాది మంది సొంతూళ్లకు పయనమయ్యారు. వరుస సెలవులు రాగా ఐటీ బీటీ, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు విరామం కోసం బయటి ప్రాంతాలకు వెళ్లడానికి ఉరుకులు పరుగుల మీద ఉన్నారు. ఇదే చాన్సని ప్రైవేటు బస్సులు ప్రయాణికుల నుంచి దోపిడీకీ పాల్పడుతున్నాయి. బెంగళూరు నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు బస్సులు టికెట్ రేట్లు విపరీతంగా పెంచేశారు. గౌరీ–గణేశ్ పండుగ సమయంలో అధిక చార్జీలను వసూలు చేయరాదని, చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో రవాణా శాఖ హెచ్చరించింది. అధికారులు దాడులు చేసి అధిక టికెట్ వసూలు చేస్తున్న వారికి జరిమానా విధించారు. కానీ ఏమాత్రం మార్పులేని బస్సుల యజమానులు దసరాకు కూడా అదే దందాను అమలు చేశాయి. టికెట్లు అందుబాటు ధరల్లోనే ఉంటాయనుకున్న ప్రయాణికుల ఆశలు నీరుకారాయి. పండుగ, సెలవులతో ఊళ్లకు అక్టోబరు 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు వరుసగా సెలవులు ఉండటంతో శుక్రవారం సాయంత్రం నుంచి టెక్కీలు తదితరులు పెద్దసంఖ్యలో బెంగళూరు నుంచి ఊళ్లకు పయనమయ్యారు. ప్రైవేటు బస్సుల వెబ్సైట్, బస్‌బుకింగ్ యాప్ సమాచారం ప్రకారం మంగళవారం రాత్రి వరకు బెంగళూరు నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సంచరించే ప్రైవేటు బస్సులు చార్జీలు మామూలు కంటే మూడు రెట్లు పెరిగాయి. తాజా టికెట్ ధరలు ఎంతంటే ► బెంగళూరు నుంచి ఉడుపికి సాధారణ రోజుల్లో ఏసీ స్లీపర్, క్లబ్క్లాస్ టికెట్ ధర రూ.700 –750 ఉంటుంది. కానీ గత నెల 30 తేదీ నుంచి అక్టోబరు 04 తేదీ వరకు రూ.1,400 నుంచి రూ.1,800 కు ఎగబాకింది. ► బెళగావికి రూ.800– 900 ఉంటే ఇప్పుడు రూ.1,100– 1,500 కి రేటు పెరిగింది. ► హుబ్లీకి రూ.750–800 ఉండగా ప్రస్తుతం రూ.1,200 నుంచి 1,500 టికెట్ ధర పెరిగింది. ► కలబుర్గికి రూ.800–900 ఉండగా రూ.1,200 –1,500 ధర పెంచేశారు. ► ప్రైవేటు బస్సుల టికెట్లు బుకింగ్ అయిపోయిందని సమాచారం. డిమాండ్‌ను సొమ్ము చేసుకోవడానికి అదనపు బస్సులను ఆరంభించారు. మెజెస్టిక్ బస్టాండు రద్దీ బెంగళూరులోని ప్రధాన మెజెస్టిక్ బస్టాండు శనివారం రాత్రి నుంచి ప్రయాణికులతో కాలు అడుగుపెట్టలేనంతగా కిక్కిరిసిపోయింది. వేలాది మంది తరలివచ్చారు. ఎటుచూసినా బస్సులు, జనంతో బస్టాండు ప్రాంగణం జాతరను తలపించింది. -
RTC Buses: బస్సులో ఓ చార్జి .. కౌంటర్లో మరో చార్జి.. ఎందుకీ గందరగోళం?
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు సూపర్ లగ్జరీ బస్సు చార్జి రూ.280. బస్సులో ఈ మొత్తానికే టికెట్ జారీ అవుతోంది. అదే బస్టాండులోని కౌంటర్లో టికెట్ కొంటే మాత్రం రూ.310 చార్జి అవుతోంది. అన్నిచోట్లా ఇలాగే జరుగుతోంది. ఒకే ప్రాంతానికి వెళ్లే, ఒకే కేటగిరీ బస్సు అయినా.. బస్సులో కండక్టర్/డ్రైవర్ జారీ చేసే టికెట్ ధరకూ, బస్టాండ్లలోని కౌంటర్లలో తీసుకునే టికెట్ ధరకూ పొంతన ఉండటం లేదు. ఇలా బస్సులో ఒకలా, కౌంటర్లో మరోలా జారీ అవుతున్న టికెట్లు ప్రయాణికులను అయోమయానికి గురి చేస్తున్నాయి. దీంతో కొన్నిసార్లు సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగుతున్నారు. ఎందుకీ గందరగోళం.. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండ్లలో అక్కడి నుంచే ప్రారంభమయ్యే బస్సు ప్లాట్‌ఫామ్ మీదకు రావటానికి కొన్ని నిమిషాల ముందు నుంచి అక్కడి కౌంటర్లలో నిర్ణీత ప్రాంతానికి/నగరానికి టికెట్లు జారీ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో డ్రైవర్లే టిమ్ (టికెట్ జారీ యంత్రం) ద్వారా టికెట్ జారీ చేస్తున్నారు. అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి అదే ప్రాంతం లేదా నగరానికి వెళ్లే బస్సుల్లో కూడా టిమ్‌లతో టికెట్లు జారీ చేస్తున్నారు. అయితే బస్సుల్లో టిమ్స్‌తో జారీ చేసే టికెట్ ధర కంటే కౌంటర్లలో ఇచ్చే టికెట్ చార్జి అధికంగా ఉంటోంది. గత కొంతకాలంగా ఈ వ్యత్యాసం కనిపిస్తోంది. ఆన్లైన్ రిజర్వేషన్ సిస్టమే కారణం గతంలో కౌంటర్లలో ఇచ్చే టికెట్, బస్సుల్లో ఇచ్చే టికెట్ ఒకే సాఫ్ట్వేర్ ద్వారా జరిగేది. అదే అడ్వాన్స్డ్ రిజర్వేషన్ అయితే మరో పద్ధతి ఉండేది. ప్రయాణానికి చాలా ముందుగా సీటు రిజర్వ్ చేసుకునేందుకు టికెట్ కొంటే అదనంగా చార్జి చేసే పద్ధతి ఎప్పట్నుంచో ఉంది. కచ్చితంగా సీటు రిజర్వ్ చేసే వెసులుబాటు ఉన్నందున, ఆ సేవకు గాను రూ.30 చార్జి చేస్తారు. గతంలో రూ.10గా ఉన్న ఈ చార్జిని ఇటీవల డీజిల్ సెస్ పెంచిన సమయంలో సవరించి రూ.30కి పెంచారు. ఇలా ముందస్తుగా సీట్లు రిజర్వ్ చేసేందుకు వినియోగించే సాఫ్ట్‌వేర్‌నే ఇప్పుడు కామన్‌గా వాడుతున్నారు. ఆర్టీసీ అధీకృత ప్రైవేటు ఏజెంట్లు, ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లు, ఆర్టీసీ స్పాట్ టికెట్ జారీ చేసే కౌంటర్లు.. ఇలా అన్నింటా ఒకటే వాడుతున్నారు. బస్టాండ్లలో సాధారణ టికెట్లు జారీ చేసే చోట కూడా ఇదే సాఫ్ట్వేర్ ఉండటంతో, బస్సు బయలు దేరటానికి కొన్ని నిమిషాల ముందు టికెట్ కొన్నా.. అడ్వాన్స్డ్ రిజర్వేషన్ చార్జి పడుతోంది. ఫలితంగా బస్సులో సాధారణ టిమ్ ద్వారా జారీ చేసే టికెట్‌కు, కౌంటర్లో ఉండే ఓపీఆర్ఎస్ (ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్) టికెట్‌కు ఈ తేడా కనిపిస్తోంది. అప్పటికప్పుడు ప్రయాణం కోసం వచ్చే వారు, కౌంటర్లో టికెట్ కొని ఈ రిజర్వేషన్ చార్జి చూసి కంగుతింటున్నారు. ఇదేంటని సిబ్బందిని నిలదీస్తే, ఇందులో తమ ప్రమేయమేమీ ఉండదని, సిస్టంలో లోడ్ చేసిన మేరకు ఆటోమేటిక్‌గా టికెట్ చార్జి వస్తుందని చెబుతున్నారు. దీంతో ప్రయాణికులు తమకు కౌంటర్లో కాకుండా, బస్సు లో టిమ్ ద్వారా టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో అలా ఇవ్వలేమని, కౌంటర్లోనే తీసుకోవాల్సి ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. అలాగే కొన్ని సర్వీసులకు టిమ్ ద్వారా టికెట్ జారీ ఉండదని, అందువల్ల కచ్చితంగా కౌంటర్లోనే తీసుకోవాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. దీంతో ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ కాకున్నా రూ.30 అదనంగా సమర్పించుకోవాల్సి వస్తోంది. -
విమాన ప్రయాణికులపై 'క్యూట్ ఫీ'.. చిత్రాలు వైరలవటంతో..
దిల్లీ: విమాన టికెట్లోనే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఫీ, యూజర్ డెవలప్మెంట్ ఫీ అంటూ వివిధ రకాల ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే.. ఇటీవల ఇండిగో విమానంలో ప్రయాణించిన వారు తమ టికెట్లో 'క్యూట్ ఛార్జ్' అంటూ కనిపించటంపై ఆశ్చర్యానికి గురయ్యారు. అందంపై రుసుము వసూలు చేయటమేంటని తికమకపడ్డారు. శాంతాను అనే వ్యక్తి తన టికెట్ వివరాలను ట్విట్టర్లో షేర్ చేశారు. 'క్యూట్ ఛార్జ్' వివరాలతో కూడిన ఆ టికెట్ వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు దీనిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇండిగో సంస్థపై విమర్శలు గుప్పించారు. 'నా వయసుతో నేను చాలా అందంగా కనిపిస్తానని తెలుసు. కానీ దానికి నాపై ఇండిగో ఇలా ఛార్జ్ వసూలు చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు' అని పేర్కొన్నారు. I know I’m getting cuter with age but never thought @IndiGo6E would start charging me for it. pic.twitter.com/L7p9I3VfKX — Shantanu (@shantanub) July 10, 2022 శాంతాను షేర్ చేసిన చిత్రంలో టికెట్ ధరకు సంబంధించిన వివరాలను ఉంచారు. అందులో ఎయిర్‌ఫేర్ ఛార్జీలు, సీట్ ఫీ, సెక్యూరిటీ, కన్వీనియన్స్ ఫీజులతో పాటు క్యూట్ ఛార్జ్ అంటూ రూ.100 వసూలు చేశారు. ఇలాంటి ఫోటోనే మరో వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 'ఈ కొత్త ఛార్జీల కారణంగానే నేను ఇండిగోలో ప్రయాణించాలనుకోవట్లేదు. ఆ ఛార్జీలు నాకు రూ.20వేలు అవుతుంది. విమానం టికెట్ ధర కన్నా అది చాలా ఎక్కువ' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. క్యూట్ ఫీ అంటే ఏమిటి? క్యూట్ అంటే 'కామన్ యూజర్ టెర్మినల్ ఈక్వీప్మెంట్' అని అర్థం. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఛార్జీలు వసూలు చేస్తుంది. ఎంపిక చేసిన విమానాశ్రయాల్లో మెటల్ డిటెక్టింగ్ మిషన్లు, ఎస్కలేటర్లు, ఇతర సామగ్రిని ఉపయోగిస్తున్నందుకు దీనిని వసూలు చేస్తారు. ట్విట్టర్లో క్యూట్ ఫీపై వైరల్‌గా మారిన క్రమంలో ఇండిగో సమాధానమిచ్చింది.'ఎంపిక చేసిన విమానాశ్రయాల్లో కామన్ యూజర్ టెర్మినల్ ఈక్వీప్మెంట్(క్యూట్) సేవలను ఉపయోగిస్తున్నందుకు ఈ ఛార్జీలను వసూలు చేస్తారని తెలుసుకోండి. మీకు సేవ చేసేందుకే మేము ఉన్నాం' అని ఓ నెటిజన్‌కు సమాధానమిచ్చింది. Ms. Waliya, please know that the CUTE charges are levied at select airports for the usage of Common User Terminal Equipment (CUTE) services. You may visit https://t.co/anjh8jarWV to know more. (1/2) — IndiGo (@IndiGo6E) July 10, 2022 ఇదీ చదవండి: 10 నెలలు.. 9 దేశాలు.. 6,500 కిలోమీటర్లు నడిచి 'హజ్' యాత్ర -
ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: అతి తక్కువ చార్జీలతో ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లలో మరో సదుపాయాన్ని కల్పించారు. ఫస్ట్‌క్లాస్ చార్జీలను 50 శాతం తగ్గించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఇవి ఈ నెల 5 నుంచి అమల్లోకి రానున్నాయి. గ్రేటర్లో సబర్బన్ రైలు సర్వీసుగా సేవలందజేస్తున్న ఎంఎంటీఎస్‌లో ఫస్ట్ క్లాస్‌లో ప్రతి సింగిల్ రూట్ ప్రయాణంలో ఈ రాయితీ వర్తిస్తుందని ద.మ.రైల్వే ఇన్చార్జి జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. ఈ మేరకు గ్రేటర్‌లోని సికింద్రాబాద్– లింగంపల్లి, ఫలక్‌నుమా– సికింద్రాబాద్– లింంగంపల్లి–రామచంద్రాపురం, నాంపల్లి– లింగంపల్లి– రామచంద్రాపురం, ఫలక్‌నుమా– నాంపల్లి– లింగంపల్లి– రామచంద్రాపురం నుంచి తెల్లాపూర్ వరకు 29 స్టేషన్ల మీదుగా ప్రస్తుతం 86 సర్వీసులు నడుస్తున్నాయి. (క్లిక్: పక్కాగా ప్లాన్.. కథ మొత్తం కారు నుంచే..) 50 కిలోమీటర్లకుపైగా ఎంఎంటీఎస్ సదుపాయం ఉంది. రోజుకు సుమారు లక్ష మంది రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు, తదితర సుమారు 30 శాతం రెగ్యులర్ ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుంది. కొంతకాలంగా ఎంఎంటీఎస్ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని, ఫస్ట్‌క్లాస్ ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ( ఏదీ నిఘా.. ఉత్తుత్తి చర్యగా మారిన లైసెన్స్ రద్దు) -
రైలు ప్రయాణం: అదనంగా మరో రూ. 35!
న్యూఢిల్లీ: ప్రయాణీకులపై భారం పెంచాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఒక్కో టికెట్‌పై యూజర్ ఫీ రూపంలో రూ. 10 నుంచి రూ. 35 వరకు అదనంగా వసూలు చేయాలన్న ప్రతిపాదన ఉందని సంబంధిత వర్గాలు సోమవారం వెల్లడించాయి. స్టేషన్లను ఆధునీకరించి, ప్రయాణీకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఈ నిధులను వినియోగించాలని భావిస్తున్నట్లు తెలిపాయి. త్వరలో ఈ ప్రతిపాదన కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళ్లనుందని పేర్కొన్నాయి. కాగా నవీకరిస్తున్న, రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో రైల్ టికెట్ ధరతో కలిపి యూజర్ చార్జీలు వసూలు చేస్తామని భారతీయ రైల్వే ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. (చదవండి: సివిల్స్ పరీక్షకు ప్రత్యేక రైళ్లు..) ఇందులో భాగంగా దేశంలోని 7 వేల రైల్వే స్టేషన్లలో 10–15 శాతం స్టేషన్లలో వీటిని అమలు చేస్తామని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతేగాక ఒకసారి స్టేషన్ ఆధునీకరణ పూర్తయ్యాక యూజర్ చార్జీ సొమ్మును రాయితీలకు మళ్లిస్తామని, అప్పటివరకు ఈ సొమ్మును స్టేషన్ అభివృద్దికి వినియోగిస్తామని వివరించారు. ఇక ప్రస్తుతం దాదాపు 50 స్టేషన్లను ఆధునీకరించాలని రైల్వే భావిస్తోంది. ఆయా స్టేషన్ల కింద ఉన్న భూములను 60 ఏళ్లపాటు వాణిజ్య అవసరాలకు లీజుకు ఇవ్వాలనే యోచనలో ఉంది. ఈ విధంగా అభివృద్ధి చేసిన స్టేషన్ హబ్స్‌ను రైలోపోలిస్‌గా పిలుస్తారు. (రైల్వే ఛార్జీల పెంపు ప్రైవేట్ సంస్థలకే..!) -
రైల్వే ఛార్జీల పెంపు ప్రైవేట్ సంస్థలకే..!
న్యూఢిల్లీ: ప్రైవేట్ సంస్థలు దేశంలో రైల్వే సేవలను ప్రారంభించిన తర్వాత ప్రయాణీకులను ఛార్జీలను నిర్ణయించడానికి ప్రైవేట్ వ్యక్తులకే పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. అయితే అదే మార్గాల్లో ఎయిర్ కండిషన్డ్ బస్సులు, విమానాలు ఆయా మార్గాల్లో నడుస్తాయి. ఛార్జీలను నిర్ణయించే ముందు వారు వీటన్నింటినీ గుర్తుంచుకోవాలి. భారతదేశంలో రాజకీయంగా రైల్వే ఛార్జీలు సున్నితమైన అంశంగా ఉంటాయి. ఇక్కడ రైళ్లు ప్రతిరోజూ ఆస్ట్రేలియా జనాభా కంటే ఎక్కువ మంది ప్రయాణీకులను తీసుకువెళుతున్నాయి. దేశంలో కొంత మంది రవాణా కోసం విస్తృతమైన నెట్వర్క్ మీద ఆధారపడి ఉంటారు. (2023లో మొదటి దశ ప్రైవేట్ రైళ్లు) దశాబ్దాల నిర్లక్ష్యం, అసమర్థ బ్యూరోక్రసీ ఈ నెట్‌వర్క్‌ను చుట్టుముట్టింది. పీఎం మోడీ పరిపాలన స్టేషన్లను ఆధునికీకరించడం నుంచి ఆపరేటింగ్ రైళ్ల వరకు ప్రతిదానిలో పాల్గొనమని ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించింది' అని వీకే యాదవ్ పేర్కొన్నారు. అయితే ఈ ప్రాజెక్టులపై ఆల్స్టోమ్ ఎస్ఐ, బొంబార్డియర్ ఇంక్, జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఆసక్తి చూపిస్తున్న సంస్థలలో ఉన్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టులపై 7.5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వస్తాయని అంచనా. 2023 నాటికి జపాన్ సాయంతో దేశంలో తొలి బుల్లెట్ రైలును పరుగులు పెట్టించాలని ధృడ సంకల్పంతో ఉన్న మోదీకి రైల్వేలను ఆధునికీకరించడం చాలా ముఖ్యం. అయితే.. దేశంలో ప్రైవేట్ రైళ్ల ఆగమనంలో భాగంలో మొదటి దశలో 12 రైళ్లను 2022–23లో ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ప్రణాళిక రూపొందించింది. 2023–24లో మరో 45 రైళ్లు, 2026–27 నాటికి 151 ప్రైవేట్ రైళ్లు పట్టాలపై పరుగులు తీయనున్నాయి. దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో 151 ఆధునిక ప్యాసింజర్ రైళ్లు నడపడానికి రైల్వే శాఖ ఇటీవలే ప్రైవేట్ కంపెనీల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. వచ్చే ఏడాది మార్చిలో టెండర్లను ఖరారు చేయనున్నారు. 2023 మార్చి నుంచి ప్రైవేట్ రైళ్ల కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. 151 ప్రైవేట్ రైళ్ల ద్వారా రైల్వే శాఖకు ఏడాదికి రూ.3,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. -
తెలంగాణకు బస్సులపై నేడు మరోసారి భేటీ
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులను నడపటంపై నెలకొన్న చిక్కుముడి వీడటం లేదు. కిలోమీటర్లు ప్రాతిపదికన బస్సులు తిప్పే అంశంపై ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఏపీఎస్ఆర్టీసీ తమ భూ భాగంలో బస్సులను తిప్పే కిలోమీటర్లు తగ్గించాలని టీఎస్ఆర్టీసీ డిమాండ్ చేస్తోంది. ఏకంగా 1.10 లక్షల కి.మీ.మేర ఏపీఎస్ఆర్టీసీ తగ్గించుకోవాలని పట్టుబడుతోంది. తాము 50 వేల కిలోమీటర్లు తగ్గిస్తామని, టీఎస్ఆర్టీసీని 50 వేల కిలోమీటర్లు పెంచుకోవచ్చని సూచిస్తూ ఏపీఎస్ఆర్టీసీ అధికారులు లేఖలు రాసినా స్పందించడంలేదు. ప్రైవేట్ దూకుడు.. అంతర్రాష్ట్ర ఒప్పందం కుదరకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు స్పీడ్ పెంచారు. ఏకంగా 750 ప్రైవేట్ బస్సులను ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు నడుపుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ గుత్తాధిపత్యం పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం మరోమారు తెలంగాణతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. మంగళవారం హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల రవాణా శాఖ ముఖ్య కార్యదర్శులు భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాల ఆర్టీసీలు ప్రాథమికంగా 72 వేల కి.మీ. తిప్పేలా చర్యలు తీసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ కోరనుంది. బస్సుల ప్రాతిపదికన మేలు.. రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం కిలోమీటర్ల ప్రాతిపదికన కాకుండా బస్సుల ప్రాతిపదికన అయితే మేలని రవాణా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కిలోమీటర్లు ప్రాతిపదికన అయితే ఏపీఎస్ఆర్టీసీకి నష్టం వస్తుంది. ఉదాహరణకు కర్నూలు నుంచి హైదరాబాద్ రూట్లో బస్సు తిప్పితే కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే ఏపీ భూ భాగంలో ప్రయాణం చేయాలి. మిగిలిన 200 కిలోమీటర్లు తెలంగాణ భూ భాగంలో ప్రయాణించాలి. అంటే రౌండ్ ట్రిప్‌లో 400 కి.మీ.ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తే టీఎస్ఆర్టీసీ కేవలం 20 కి.మీ. మాత్రమే ఏపీ భూ భాగంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అంతర్రాష్ట్ర ఒప్పందం చట్టం ప్రకారం బస్సుల ప్రాతిపదికగా కూడా ఒప్పందం చేసుకోవచ్చు. ఏపీఎస్ఆర్టీసీ తమిళనాడు, పాండిచ్చేరిలతో బస్సుల ప్రాతిపదికగానే ఒప్పందాలున్నాయి. రెండు రాష్ట్రాల అధికారుల చర్చల తర్వాత మంత్రుల భేటీ ఉంటుంది. అంతర్రాష్ట్ర ఒప్పందం అంశంపై ఇందులో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతర్రాష్ట్ర ఒప్పందం అంటే...? రెండు రాష్ట్రాల మధ్య రవాణా రంగంలో ఈ ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ చట్టం ప్రకారం ఎలాంటి పన్ను లేకుండా రాష్ట్రంలోకి వాహనాలు అనుమతించాలి. సాధారణంగా వాహనం రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు ట్యాక్స్ చెల్లించాలి. అంతర్రాష్ట్ర ఒప్పందం జరిగితే 2 రాష్ట్రాల్లో సమానంగా ట్యాక్స్ లేకుండా వాహనాలను తిప్పుకోవచ్చు. -
ఇదేమి బాదుడు దేవుడా?
విజయవాడకు చెందిన సురేష్ కార్తీక మాసంలో కుటుంబంతో కలిసి ఈ నెల 25న అన్నవరం దర్శనానికి వెళ్లాడు. రాజమండ్రికి చేరుకుని అక్కడి నుంచి అన్నవరం వెళ్లేందుకు రాజమండ్రి డిపోకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ అల్ట్రా డీలక్స్ బస్సు ఎక్కాడు. రాజమండ్రి నుంచి అన్నవరం వరకు 80 కిలోమీటర్ల దూరం. టోల్ చార్జీలు, ప్యాసింజర్ సెస్సు కలిపి టిక్కెట్టు ధర రూ.వంద వరకు ఉంది. కానీ రూ.150 వంతున వసూలు చేశారు. ఆరుగురు కుటుంబ సభ్యులకు రూ.900 సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇదేమిటని ప్రశ్నిస్తే ప్రభుత్వం నిర్ణయించిన ధర అంతేనని సమాధానమిచ్చారు. తిరుగు ప్రయాణంలో అన్నవరం నుంచి రాజమండ్రి వెళ్లేందుకు ఖమ్మం డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కారు. టోల్ చార్జీ, సెస్సుతో కలుపుకుని ఒక్కొక్కరికి రూ.79 చొప్పున రూ.395 మాత్రమే అయింది. తెలంగాణ ఆర్టీసీ కంటే ఏపీఎస్ ఆర్టీసీలో రెట్టింపు ధర కంటే ఎక్కువగా ఉండటంతో ఆశ్చర్యపోవడం సురేష్ వంతైంది. సాక్షి, అమరావతి : రద్దీ, పండగ సీజన్లలో ప్రయాణికులపై ఏపీఎస్ ఆర్టీసీ తీవ్ర భారం మోపుతోంది. కొత్త సినిమాకు బ్లాక్‌లో టికెట్లు అమ్మినట్లు 50 శాతం చార్జీలను అధికంగా వసూలు చేస్తోంది. డిపోల వారీగా ఇష్టానుసారం బాదేస్తోంది. పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ వదలకుండా వారి జేబులను ఖాళీ చేస్తోంది. డీజిల్ ధరలు పెరిగినా చార్జీలు పెంచడం లేదని పైకి చెబుతూ.. జిల్లా జిల్లాకో రీతిన టిక్కెట్ల ధర పెంచి డబ్బులు లాగేస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇప్పటికే ఆర్టీసీ రెండుసార్లు చార్జీలను పెంచింది. సవరణల పేరిట ప్రతి సీజన్లోనూ అదనపు చార్జీలను వడ్డిస్తూనే ఉంది. దీనికి తోడు ప్యాసింజర్ సెస్సు, సేఫ్టీ సెస్సు అంటూ ఏటా ప్రయాణికులపై రూ.500 కోట్ల అదనపు భారం మోపుతోంది. టోల్ చార్జీలు పెరిగినప్పుడల్లా ప్రయాణికులకు వాత తప్పడం లేదు. ఇక పండగ వేళల్లో అయితే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రత్యేక బస్సులంటూ 50 శాతం నుంచి వంద శాతం వరకు చార్జీలను పెంచుతూ ఏకంగా ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు దూరం చేస్తోందని పేదలు వాపోతున్నారు. ప్రత్యేక బస్సులతో జిల్లాకో రకంగా దోపిడీ ఆర్టీసీ రద్దీ వేళల్లో రెగ్యులర్ సర్వీసులు నిలిపేసి ప్రత్యేక బస్సులను ప్రవేశపెడుతోంది. ఈ బస్సుల్లో రెగ్యులర్ బస్ చార్జీల కంటే 50 శాతం అధికంగా టిక్కెట్లు వసూలు చేస్తోంది. అదేమంటే ప్రత్యేక బస్సులు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీగా రావాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు సాకు చెబుతున్నారు. రాజమండ్రి నుంచి అన్నవరం వెళ్లేందుకు అల్ట్రా డీలక్స్‌లో కిలోమీటరుకు రూపాయి పది పైసలు వంతున వసూలు చేయాలి. అంటే టిక్కెట్టు ధర 80 కిలోమీటర్లకు గాను టిక్కెట్టు ధర రూ.88 ఉండాలి. ప్యాసింజర్ సెస్సు, సేఫ్టీ సెస్సు కలిపి రూ.3, టోల్ చార్జీ రూ.5 కలిపి టిక్కెట్టు ధర రూ.96 వసూలు చేయాల్సి ఉండగా, రాజమండ్రి డిపో అధికారులు రూ.150 వసూలు చేయడం గమనార్హం. ‘రౌండింగ్ ఆఫ్’ పేరిట చార్జీల సవరణ ఆర్టీసీలో చిల్లర సమస్యను కారణంగా చూపుతూ ‘రౌండింగ్ ఆఫ్’ పేరిట టిక్కెట్‌పై రూపాయి నుంచి రూ.5 వరకు అదనంగా వడ్డిస్తూ ఈ ఏడాది జూన్‌లో చార్జీలను పెంచారు. తెలుగు వెలుగు, వెలుగు, సిటీ సర్వీసులు తప్ప మిగిలిన సర్వీసులలో ఈ చార్జీలను పెంచారు. టిక్కెట్లు రద్దు చేసుకుంటే తిరిగి డబ్బు చెల్లించే సమయంలోనూ ‘రౌండింగ్ ఆఫ్’ వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఏడాదికి ప్రయాణికులపై రూ.315 కోట్ల భారం మోపింది. -
మెట్రో-2 టిక్కెట్ల ధరలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్–అమీర్‌పేట్ (16 కి.మీ.) మార్గంలో మెట్రో రైలు సేవలు సోమవారం సాయంత్రం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ ఉదయం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ మార్గంలో మెట్రో రైలు సర్వీసును ప్రారంభించారు. మొదటి రోజు కావడంతో ఇందులో ప్రయాణించేందుకు భాగ్యనగర వాసులు అమితాసక్తి చూపారు. అయితే టిక్కెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. ఎల్బీనగర్ నుంచి బయలుదేరిన వ్యక్తి 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న మియాపూర్‌కు 52 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రతి ఐదు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. టిక్కెట్లు ధరలు ఇలా.. ఎల్బీనగర్-మియాపూర్ రూ. 60 ఎల్బీనగర్-అమీర్‌పేట రూ. 45 ఎల్బీనగర్- ఖైరతాబాద్, నాంపల్లి రూ. 40 ఎల్బీనగర్- గాంధీభవన్, ఎంజీబీఎస్ 35 ఎల్బీనగర్- మలక్‌పేట రూ. 30 ఎల్బీనగర్- దిల్‌షుఖ్‌నగర్ రూ. 25 -
ఊరిస్తున్న విమాన చార్జీలు!
♦ ఏడాదిలో సగటున 20 శాతం తగ్గిన టికెట్ చార్జీలు ♦ తొలిసారిగా బిజినెస్ క్లాస్‌కూ డిస్కౌంట్ ఆఫర్లు ♦ లాభాల బాట పట్టిన ఏవియేషన్ కంపెనీలు ♦ ఇంధన ధరలు ఏడాదిలో 45% తగ్గడమే కారణం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానం ఎంత పెకైగురుతుందో... చార్జీలు అంతలా దిగి వస్తున్నాయి. ఈ వేసవిలో గతేడాదికంటే 20 శాతం తక్కువ ధరకే టికెట్లు విక్రయించడానికి విమానయాన కంపెనీలు సిద్ధమయ్యాయి. గతంలో ఇవి డిమాండ్ లేని సమయంలో డిస్కౌంట్ ఆఫర్లిచ్చేవి. కానీ ప్రయాణికుల్ని ఆకట్టుకోవటానికిపుడు ఏడాది పొడవునా ఏదో ఒక పేరుతో ఆఫర్లు ఇస్తూనే ఉన్నాయి. రూ.500 నుంచి రూ.1,000కే విమానం ఎక్కే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. నిజానికి వేసవిలో డిమాండ్ ఎక్కువ.ఈ వేసవిలో డిమాండ్ 20% దాకా పెరుగుతుందని కూడా కంపెనీలు అంచనా వేస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఎయిర్కోస్టా, స్పైస్ జెట్ వంటి సంస్థలు మరిన్ని నగరాలకు ఎక్కువ సర్వీసులను నడపడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నాయి. ‘‘ఈ సారి డిమాండ్ పెరిగినా టికెట్ ధరలైతే పెరిగే అవకాశం లేదు. గత ఏడాదితో పోలిస్తే 15 నుంచి 20% తక్కువ ధరకే టికెట్లు లభిస్తున్నాయి’’ అని ఎయిర్కోస్టా ప్రతినిధి చెప్పారు. గతేడాదితో పోలిస్తే డిసెంబర్ నాటికి దేశీ విమాన టికెట్ ధరలు సగటున 18.3 శాతం తగ్గినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు ఇటీవల చెప్పారు. 2014 డిసెంబర్లో సగటు టికెట్ ధర 7,492గా ఉంటే అది డిసెంబర్, 2015 నాటికి రూ.5,734కి తగ్గినట్లు బోయింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దినేశ్ కేశ్కర్ తెలియజేశారు. అన్నింటికీ డిస్కౌంట్లే: ఇప్పటిదాకా ఎకానమీ క్లాస్‌కే పరిమితమైన డిస్కౌంట్ల యుద్ధం ఇప్పుడు బిజినెస్ క్లాస్‌లకూ పాకింది. తొలిసారిగా బిజినెస్ క్లాస్‌లో 30 నుంచి 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు జెట్, విస్తారా ఎయిర్‌లైన్స్ ప్రకటించాయి. నిత్యం డిమాండుండే ముంబై-ఢిల్లీ మార్గంలో రూ.21,000 ఉండే బిజినెస్ క్లాస్ టికెట్‌ను విస్తారా రూ. 15,000కే అందిస్తోంది. ఈ తగ్గింపు ధరలు అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ఇంకా ఎక్కువగా ఉంటున్నాయి. ఎయిర్ ఏషియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ వంటి సంస్థలు ఏకంగా 50 శాతంవరకూ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఎంత చౌకగా అంటే... చేతిలో మూడు నాలుగు వేలుంటే మలేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాలకు వెళ్లేలా. ఈ తగ్గింపుతో ప్రయాణికుల సంఖ్యలో భారీ వృద్ధి నమోదవుతున్నట్లు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) తెలియజేసింది. గతేడాదితో పోలిస్తే దేశీ విమాన ప్రయాణికుల సంఖ్యలో 23% వృద్ధి నమోదయిందని ఐఏటీఏ పేర్కొంది. దేశీ మధ్యతరగతి ప్రజల్లో పెరుగుతున్న వినిమయ శక్తి ఈ వృద్ధికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. 2024 నాటికి దేశీయ మధ్యతరగతి ప్రజల సంఖ్య 50% వృద్ధితో 60 కోట్లు దాటుతుందని ఎయిర్ బస్ అంచనా వేస్తోంది. వచ్చే ఇరవై ఏళ్లలో ప్రపంచ విమాన ప్రయాణికుల సంఖ్యలో 4.6% వృద్ధి ఉంటే ఇండియాలో ఈ వృద్ధి 8.4% ఉంటుందని అంచనా. చార్జీలు తగ్గుతున్నా, లాభాలు పెరుగుతున్నాయ్... ఒకపక్క విమాన టికెట్ ధరలు తగ్గుతున్నా విమానయాన కంపెనీల లాభాలు మాత్రం పెరుగుతుండటం విశేషం. మొన్నటి వరకు నష్టాల్లో ఉన్న ఎయిర్‌లైన్స్ సంస్థలిపుడు భారీ లాభాలను ప్రకటిస్తున్నాయి. స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్, ఇండిగో వంటి సంస్థలు మూడో త్రైమాసికంలో ప్రకటించిన లాభాలే దీనికి నిదర్శనం. భారీ నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా సైతం డిసెంబర్ నెల నుంచి నిర్వహణా లాభాల్లోకి అడుగుపెట్టింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2019 నాటికి ఎయిర్ ఇండియా లాభాల్లోకి వస్తుందని కేంద్ర పౌర విమానయాన కార్యదర్శి ఆర్.ఎన్ చౌబే చెప్పారు. గతంలో సగటున టికెట్‌కు రూ.256 నష్టం వస్తే ధరలు 20 శాతం పైగా తగ్గినా ఇప్పుడు సగటున రూ.632 లాభం వస్తోంది. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా విమాన ఇంధన ధరలు తగ్గడమే. గడిచిన ఏడాది కాలంలో విమాన ఇంధన ధరలు 45 శాతం తగ్గాయి. ఎయిర్‌లైన్స్ వ్యయంలో సింహ భాగం ఇంధనానిదే. గతంలో నిర్వహణ వ్యయంలో 49 శాతంగా ఉన్న ఇంధనం వాటా ఇప్పుడు 23 శాతానికి పడిపోవడంతో కంపెనీలు లాభాల బాట పట్టాయి.