
న్యూఢిల్లీ: ప్రయాణీకులపై భారం పెంచాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఒక్కో టికెట్‌పై యూజర్ ఫీ రూపంలో రూ. 10 నుంచి రూ. 35 వరకు అదనంగా వసూలు చేయాలన్న ప్రతిపాదన ఉందని సంబంధిత వర్గాలు సోమవారం వెల్లడించాయి. స్టేషన్లను ఆధునీకరించి, ప్రయాణీకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఈ నిధులను వినియోగించాలని భావిస్తున్నట్లు తెలిపాయి. త్వరలో ఈ ప్రతిపాదన కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళ్లనుందని పేర్కొన్నాయి. కాగా నవీకరిస్తున్న, రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో రైల్ టికెట్ ధరతో కలిపి యూజర్ చార్జీలు వసూలు చేస్తామని భారతీయ రైల్వే ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. (చదవండి: సివిల్స్ పరీక్షకు ప్రత్యేక రైళ్లు..)
ఇందులో భాగంగా దేశంలోని 7 వేల రైల్వే స్టేషన్లలో 10–15 శాతం స్టేషన్లలో వీటిని అమలు చేస్తామని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతేగాక ఒకసారి స్టేషన్ ఆధునీకరణ పూర్తయ్యాక యూజర్ చార్జీ సొమ్మును రాయితీలకు మళ్లిస్తామని, అప్పటివరకు ఈ సొమ్మును స్టేషన్ అభివృద్దికి వినియోగిస్తామని వివరించారు. ఇక ప్రస్తుతం దాదాపు 50 స్టేషన్లను ఆధునీకరించాలని రైల్వే భావిస్తోంది. ఆయా స్టేషన్ల కింద ఉన్న భూములను 60 ఏళ్లపాటు వాణిజ్య అవసరాలకు లీజుకు ఇవ్వాలనే యోచనలో ఉంది. ఈ విధంగా అభివృద్ధి చేసిన స్టేషన్ హబ్స్‌ను రైలోపోలిస్‌గా పిలుస్తారు. (రైల్వే ఛార్జీల పెంపు ప్రైవేట్ సంస్థలకే..!)
Comments
Please login to add a commentAdd a comment