సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు సూపర్ లగ్జరీ బస్సు చార్జి రూ.280. బస్సులో ఈ మొత్తానికే టికెట్ జారీ అవుతోంది. అదే బస్టాండులోని కౌంటర్‌లో టికెట్ కొంటే మాత్రం రూ.310 చార్జి అవుతోంది. అన్నిచోట్లా ఇలాగే జరుగుతోంది. ఒకే ప్రాంతానికి వెళ్లే, ఒకే కేటగిరీ బస్సు అయినా.. బస్సులో కండక్టర్/డ్రైవర్ జారీ చేసే టికెట్ ధరకూ, బస్టాండ్లలోని కౌంటర్లలో తీసుకునే టికెట్ ధరకూ పొంతన ఉండటం లేదు. ఇలా బస్సులో ఒకలా, కౌంటర్‌లో మరోలా జారీ అవుతున్న టికెట్లు ప్రయాణికులను అయోమయానికి గురి చేస్తున్నాయి. దీంతో కొన్నిసార్లు సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగుతున్నారు.
ఎందుకీ గందరగోళం..
ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండ్లలో అక్కడి నుంచే ప్రారంభమయ్యే బస్సు ప్లాట్‌ఫామ్ మీదకు రావటానికి కొన్ని నిమిషాల ముందు నుంచి అక్కడి కౌంటర్లలో నిర్ణీత ప్రాంతానికి/నగరానికి టికెట్లు జారీ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో డ్రైవర్లే టిమ్ (టికెట్ జారీ యంత్రం) ద్వారా టికెట్ జారీ చేస్తున్నారు. అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి అదే ప్రాంతం లేదా నగరానికి వెళ్లే బస్సుల్లో కూడా టిమ్‌లతో టికెట్లు జారీ చేస్తున్నారు. అయితే బస్సుల్లో టిమ్స్‌తో జారీ చేసే టికెట్ ధర కంటే కౌంటర్లలో ఇచ్చే టికెట్ చార్జి అధికంగా ఉంటోంది. గత కొంతకాలంగా ఈ వ్యత్యాసం కనిపిస్తోంది.
ఆన్‌లైన్ రిజర్వేషన్ సిస్టమే కారణం
గతంలో కౌంటర్లలో ఇచ్చే టికెట్, బస్సుల్లో ఇచ్చే టికెట్ ఒకే సాఫ్ట్‌వేర్ ద్వారా జరిగేది. అదే అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్ అయితే మరో పద్ధతి ఉండేది. ప్రయాణానికి చాలా ముందుగా సీటు రిజర్వ్ చేసుకునేందుకు టికెట్ కొంటే అదనంగా చార్జి చేసే పద్ధతి ఎప్పట్నుంచో ఉంది. కచ్చితంగా సీటు రిజర్వ్ చేసే వెసులుబాటు ఉన్నందున, ఆ సేవకు గాను రూ.30 చార్జి చేస్తారు.
గతంలో రూ.10గా ఉన్న ఈ చార్జిని ఇటీవల డీజిల్ సెస్ పెంచిన సమయంలో సవరించి రూ.30కి పెంచారు. ఇలా ముందస్తుగా సీట్లు రిజర్వ్ చేసేందుకు వినియోగించే సాఫ్ట్‌వేర్‌నే ఇప్పుడు కామన్‌గా వాడుతున్నారు. ఆర్టీసీ అధీకృత ప్రైవేటు ఏజెంట్లు, ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లు, ఆర్టీసీ స్పాట్ టికెట్ జారీ చేసే కౌంటర్లు.. ఇలా అన్నింటా ఒకటే వాడుతున్నారు.
బస్టాండ్లలో సాధారణ టికెట్లు జారీ చేసే చోట కూడా ఇదే సాఫ్ట్‌వేర్ ఉండటంతో, బస్సు బయలు దేరటానికి కొన్ని నిమిషాల ముందు టికెట్ కొన్నా.. అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్ చార్జి పడుతోంది. ఫలితంగా బస్సులో సాధారణ టిమ్ ద్వారా జారీ చేసే టికెట్‌కు, కౌంటర్‌లో ఉండే ఓపీఆర్‌ఎస్ (ఆన్‌లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్) టికెట్‌కు ఈ తేడా కనిపిస్తోంది. అప్పటికప్పుడు ప్రయాణం కోసం వచ్చే వారు, కౌంటర్‌లో టికెట్ కొని ఈ రిజర్వేషన్ చార్జి చూసి కంగుతింటున్నారు.
ఇదేంటని సిబ్బందిని నిలదీస్తే, ఇందులో తమ ప్రమేయమేమీ ఉండదని, సిస్టంలో లోడ్ చేసిన మేరకు ఆటోమేటిక్‌గా టికెట్ చార్జి వస్తుందని చెబుతున్నారు. దీంతో ప్రయాణికులు తమకు కౌంటర్‌లో కాకుండా, బస్సు లో టిమ్ ద్వారా టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో అలా ఇవ్వలేమని, కౌంటర్‌లోనే తీసుకోవాల్సి ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. అలాగే కొన్ని సర్వీసులకు టిమ్ ద్వారా టికెట్ జారీ ఉండదని, అందువల్ల కచ్చితంగా కౌంటర్‌లోనే తీసుకోవాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. దీంతో ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ కాకున్నా రూ.30 అదనంగా సమర్పించుకోవాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment