సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో సరికొత్త, ఆధునిక బస్టాండ్ నిర్మితం కానుంది. ప్రస్తుతం పట్టణంలో ఉన్న పాత బస్టాండ్‌ను కూల్చివేసి, దానికి పక్కనే ఉన్న వరంగల్ నగరపాలక సంస్థ, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా)లకు చెందిన స్థలాలను కూడా కలిపి 2.32 ఎకరాల స్థలంలో, రూ.75 కోట్ల వ్యయంతో ఐదు అంతస్తుల్లో కొత్త బస్టాండ్ నిర్మించనున్నారు.
కేవలం బస్సులు ఆగే ప్రాంగణంగానే కాకుండా, భారీ వాణిజ్య సముదాయంగా, భవిష్యత్తులో వరంగల్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు సాకారమైతే దానితో అనుసంధానించేందుకు వీలుగా దీనిని నిర్మించాలని నిర్ణయించారు. శుక్రవారం బస్‌భవన్‌లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్, కుడా చైర్మన్ సుందర్‌రాజ్ యాదవ్‌లు దీని ప్రణాళికలపై అధికారులతో చర్చించారు.
పురపాలక శాఖ నిధులతో..
పురపాలక శాఖ నిధులతో ఈ బస్టాండ్‌ను నిర్మించనున్నారు. వాహనాల పార్కింగ్‌కు భారీ సెల్లార్, బస్సులు నిలిపేందుకు 32 ప్లాట్‌ఫామ్స్, సమీపంలో ఉన్న వరంగల్ రైల్వే స్టేషన్‌కు స్కైవాక్‌తో అనుసంధానం, ఎస్కలేటర్లు, వాణిజ్య సముదాయాలు, రెస్టారెంట్లతో ఈ భారీ భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. ఒకవేళ మెట్రోతో అనుసంధానిస్తే ఎలాంటి ఏర్పాట్లు అవసరమో, నాగ్‌పూర్ మెట్రో అధికారులతో సంప్రదించినట్టు బాజిరెడ్డి వెల్లడించారు.
అలాగే రైల్వేతో అనుసంధానంపై ఆ శాఖ అధికారులతో చర్చిస్తున్నామన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్‌తో చర్చల నేపథ్యంలో, పురపాలక శాఖ నిధుల విడుదలకు మార్గం సుగమమైనట్లు తెలిపారు. సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అజిత్‌రెడ్డి, ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్, వినోద్, చీఫ్ ఇంజనీర్ రామ్‌ప్రసాద్, వరంగల్ ఆర్‌ఎం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment