
బంగారం ధరల్లో డిస్కౌంట్
తయారీ చార్జీల్లోనూ రాయితీలు
అమ్మకాలు పెంచుకునే వ్యూహాలు
కోల్‌కతా: బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరిన తరుణంలో అక్షయ తృతీయ అమ్మకాలు తగ్గకుండా జ్యుయలర్లు మార్కెటింగ్ సన్నాహాలు మొదలుపెట్టారు. మరిన్ని అమ్మకాలు సాధించేందుకు వీలుగా డిస్కౌంట్‌లు, ఇతర ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఈ నెల 30న అక్షయ తృతీయ (వైశాఖ శుద్ధ తదియ) అన్న విషయం తెలిసిందే.
ఏటా ఆ రోజున బంగారం కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తుంటారు. ఈ ఏడాది అధిక ధరల నేపథ్యంలో అమ్మకాలపై మిశ్రమ అంచనాలు వ్యక్తమవుతుండడం గమనార్హం. దీంతో ప్రముఖ బ్రాండ్లు తనిష్క్, సెంకో గోల్డ్, ఎంపీ జ్యుయలర్స్, పీసీ చంద్ర జ్యుయలర్స్ ఇప్పటికే ఆఫర్లను ప్రకటించాయి.
→ టాటా బ్రాండ్ తనిష్క్ బంగారం ఆభరణాల తయారీ చార్జీల్లో 20 శాతం తగ్గింపు ఇస్తున్నట్టు ప్రకటించింది.
→ బంగారం ధరపై రూ.350 డిస్కౌంట్‌ను సెంకో గోల్డ్ ఆఫర్ చేస్తోంది. అలాగే తయారీ చార్జీల్లో 30 శాతం రాయితీ ఇస్తోంది. డైమండ్ ఆభరణాలపై తయారీ చార్జీల్లో 100 శాతం డిస్కౌంట్
ప్రకటించింది.
→ ఎంపీ జ్యుయలర్స్ గ్రాము బంగారంపై రూ.300 డిస్కౌంట్ ప్రకటించింది. తయారీ చార్జీల్లో 10 శాతం రాయితీ ఇస్తోంది.
→ పీసీ చంద్ర జ్యుయలర్స్ గ్రాము బంగారంపై రూ.200.. తయారీ చార్జీల్లో 15 శాతం తగ్గింపు ఇస్తున్నట్టు తెలిపింది. డైమండ్ జ్యుయలరీపై 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.
మంచి డిమాండ్ ఉంటుంది..
‘‘అక్షయ తృతీయ సందర్భంగా అమ్మకాలు మంచిగా ఉంటాయని అంచనా వేస్తున్నాం. ఎందుకంటే వినియోగదారుల్లో బంగారం పట్ల విశ్వాసం బలంగా ఉంది’’అని అంజలి జ్యుయలర్స్ డైరెక్టర్ అనర్గ ఉట్టియ చౌదరి తెలిపారు. దీంతో తయారీ చార్జీల్లో రాయితీలు ఇస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో బంగారాన్ని సురక్షిత సాధనంగా చూస్తున్నట్టు చెప్పారు. దీంతో బంగారంపై మరింత పెట్టుబడులకు కొనుగోలుదారులు మొగ్గు చూపించొచ్చన్నారు.
ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే బంగారం ధరలు స్వల్పకాలంలో మరో 5–7 శాతం వరకు పెరగొచ్చని.. సమీప కాలంలో దిద్దుబాటు అవకాశాలు కనిపించడం లేదన్నారు. ధరలు పెరగడంతో అమ్మకాల పరిమాణం తగ్గినట్టు సెంకో గోల్డ్ ఎండీ, సీఈవో సువాంకర్ సేన్ తెలిపారు. అయితే అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్ల డిమాండ్ బలంగా ఉండొచ్చన్న అంచనాతో ఉన్నారు. ముత్యాలు, రత్నాలను చేర్చడం ద్వారా వివాహ ఆభరణాల ధరలను 25–30 శాతం వరకు తగ్గించే చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
జియో ఫైనాన్స్ యూజర్లకు గోల్డెన్ ఆఫర్
ముంబై: అక్షయ తృతీయను పురస్కరించుకుని పసిడి కొనుగోళ్లకు సంబంధించి జియో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. జియోఫైనాన్స్, మైజియో యాప్ యూజర్లకు జియో గోల్డ్ 24కే డేస్ ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు రూ. 1,000 నుంచి రూ. 9,999 వరకు విలువ చేసే డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేసే వారు జియోగోల్డ్1 కోడ్‌ను ఉపయోగించి అదనంగా 1 శాతం పసిడిని ఉచితంగా దక్కించుకోవచ్చు. రూ. 10,000కు మించిన కొనుగోళ్లపై జియోగోల్డ్‌ఎట్100 ప్రోమో కోడ్‌తో 2 శాతం పసిడి అందుకోవచ్చు. ఆఫర్ వ్యవధిలో ఒక్కో యూజరు 10 లావాదేవీల వరకు, గరిష్టంగా రూ. 21,000 వరకు విలువ చేసే పసిడిని పొందవచ్చు. గోల్డ్ సిప్‌లు కాకుండా ఏకమొత్తంగా చేసే పసిడి కొనుగోళ్లకు ఇది వర్తిస్తుంది.