
ఇండియాలో బంగారానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో అందరికీ తెలిసిందే. శుభకార్యాల్లో బంగారు నగలను ధరిస్తుంటారు. ఆపదలో ఆర్థికంగా ఆదుకునే వనరుగా పసిడి తోడ్పడుతుంది. అక్షయ తృతీయ రోజున కాసింత బంగారం కొంటే ఏడాదంతా సంపద సొంతం అవుతుందని నమ్ముతుంటారు. కానీ ఇటీవల బంగారం తులం ధర రూ.లక్ష చేరువలో ఉంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇప్పటికీ కొన్ని దేశాల్లో భారత్ కంటే తక్కువకే పసిడి విక్రయిస్తున్నారు. అలాంటిది భారత్‌లో బంగారం అధిక ధరకు దోహదం చేసే కొన్ని కీలక అంశాలను తెలుసుకుందాం.
దిగుమతి సుంకాలు, పన్నులు
భారతదేశం బంగారంపై గణనీయమైన దిగుమతి సుంకాలు, పన్నులను విధిస్తుంది.ఈ సుంకాలు 12.5% వరకు ఉండవచ్చు. బంగారం కొనుగోళ్లపై అదనంగా 3% వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఉంటుంది. మేకింగ్ ఛార్జీలపై మరో 5 శాతం జీఎస్టీ వడ్డీస్తున్నారు.
కరెన్సీ మారకం రేట్లు
అంతర్జాతీయంగా బంగారం అమెరికా డాలర్లలో ట్రేడ్ అవుతుంది. అమెరికా డాలరుతో పోలిస్తే భారత రూపాయి (ఐఎన్ఆర్) బలహీనపడినప్పుడు బంగారం దిగుమతి ఖర్చు పెరుగుతుంది. మారకం రేట్లలో ఈ హెచ్చుతగ్గులు భారతదేశంలో బంగారం ధరను నేరుగా ప్రభావితం చేస్తాయి .
పండుగలు, పెళ్లిళ్లు
భారతదేశంలో బంగారానికి అధిక డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, దీపావళి, ధంతేరస్, అక్షయ తృతీయ వంటి పండుగల సమయంలో దీన్ని అధికంగా కొనుగోలు చేస్తారు.
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయంలో ఇన్వెస్టర్లు సురక్షిత సంపదగా బంగారాన్ని ఆశ్రయిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి పెరిగిన డిమాండ్ అధిక ధరలకు దారితీస్తుంది. ఇది భారత మార్కెట్లో ప్రతిబింబిస్తుంది.
ఇదీ చదవండి: తక్కువ ధరకే బంగారం కావాలా!
సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు
అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత రిజర్వ్ బ్యాంక్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుతున్నాయి. ఈ బల్క్ కొనుగోళ్లు ప్రపంచ డిమాండ్‌ను పెంచుతాయి.