సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్ష రెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు సమన్లు పంపించారు. ఖరీదైన చేతి గడియారాల అక్రమ రవాణాకు సంబంధించి హర్ష రెడ్డికి కస్టమ్స్ అధికారులు సమన్లు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన ఏప్రిల్ 27వ తేదీన హాజరు కావడానికి అంగీకరించినట్టు సమాచారం.
వివరాల ప్రకారం.. ఫ్రిబవరి ఐదో తేదీన చెన్నై విమానాశ్రయంలో రెండు లగ్జరీ వాచీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాచీలను మహమ్మద్ ఫహెర్దీన్ ముబీన్ అనే వ్యక్తి హాంకాంగ్ నుంచి సింగపూర్ మీదుగా భారత్‌లోకి తీసుకొచ్చినట్టు గుర్తించారు. ఆ వాచీల్లో ఒకటి పాటెక్ ఫిలిప్ 5740, రెండోది బ్రెగ్యుట్ 2759 ఉన్నాయి. అయితే, పాటెక్ ఫిలిప్ వాచ్‌కు మన దేశంలో ఎక్కడా డీలర్లు లేరు. ఇక, బ్రెగ్యుట్ కంపెనీల వాచీలు ఇండియా మార్కెట్‌లో స్టాక్ లేకపోవటంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. వాచీలను పరిశీలించడంతో వాటి విలువ ఏకంగా రూ.1.70 కోట్లపైగా ఉండటం చూసి వారే ఖంగుతున్నారు. దీంతో ముబీన్‌ను అరెస్టు చేసి, కోర్టు అనుమతితో విచారణ చేయగా మధ్యవర్తి నవీన్‌కుమార్ పేరును వెల్లడించారు. ఇదే క్రమంలో మార్చి 12న అలోకం నవీన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా మరిన్ని ఆధారాలు లభించినట్టు సమాచారం.
స్పందించిన హర్ష..
ఈ సందర్భంగా రెండు వాచీలను పొంగులేటి కుమారుడు హర్షరెడ్డి కోసం కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ముబీన్‌ను లగ్జరీ వాచ్ డీలర్‌గా, నవీన్‌కుమార్ మధ్యవర్తిగా, హర్షరెడ్డి కొనుగోలుదారుడిగా అనుమానిస్తున్నారు. ఇక, ఈ వాచీల కొనుగోలుకు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ది ట్రెజరీ (యూఎస్‌డీటీ)కి చెందిన టెథర్ వంటి క్రిప్టో కరెన్సీ ఆధారంగా కొంత డబ్బు, మరికొంత హవాలా రూపంలో చెల్లించినట్టు తేలిందని కస్టమ్స్ వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే హర్షకు నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించాయి.
కాగా, చెన్నై కస్టమ్స్ అధికారులు హర్షకు గత నెల 28వ తేదీన నోటీసులు ఇచ్చి ఏప్రిల్ నాలుగో తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే, ఇటీవల హర్షకు డెంగ్యూ ఫీవర్ రావడంతో అతను ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నాడు. దీంతో, ఏప్రిల్ 27వ తేదీన హాజరవుతానని ఈనెల మూడో తేదీన సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ఇక, పరిమాణాలపై తాజాగా హర్ష స్పందిస్తూ వాచీల అక్రమ రవాణాలో తనకు ప్రమేయం లేదన్నారు. ఇవన్నీ నిరాధారమైనవని అన్నారు. అనారోగ్యం కారణంగా తాను విచారణకు హాజరుకాలేకపోయినట్టు తెలిపారు. మరోవైపు.. హర్షను విచారించే వరకు నవీన్ కుమార్‌కు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని మద్రాస్ కోర్టు స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment