సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన పలువురు జ్యువెలరీ వ్యాపారులే అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ సూత్రధారులుగా ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. నిరుపేదల్ని పావులుగా మార్చుకుని ఈ వ్యవహారం సాగిస్తున్నారు. రెండ్రోజుల క్రితం దుబాయ్ నుంచి మూడు కిలోల బంగారం తీసుకువచ్చిన ముఠాను కస్టమ్స్ అధికారులు పట్టుకొని విచారించగా పలు కీలక విషయాలు వెల్లడైనట్లు కస్టమ్స్ విభాగం కమిషనర్ ఎంఆర్‌ఆర్ రెడ్డి తెలిపారు. అదనపు కమిషనర్ మంజుల హోస్మానీ, డిప్యూటీ కమిషనర్ కల్యాణ్ రేవెళ్లతో కలసి బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రెండు ప్రాంతాల్లోనూ ముఠాసభ్యులు..
హైదరాబాద్–దుబాయ్‌ల్లో బంగారం ధరల్లో భారీ వ్యత్యాసం ఉంది. నేరుగా దిగుమతి చేసు కుంటే 38.5% వరకు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి వస్తుందని స్మగ్లర్లు అక్రమంగా రవాణా చేస్తున్నారు. అయితే, ఈ వ్యాపారులు నేరుగా సీన్‌లోకి రావట్లేదు. పాతబస్తీకి చెందిన కొందరు నిరుపేద యువకులను కమీషన్ పేరుతో ఆకర్షించి స్మగ్లింగ్‌లోకి దించుతున్నారు. దుబాయ్ తదితర దేశాల్లో స్థిరపడిన వారితోనూ ఒప్పందాలు చేసుకుని ఈ రొంపిలోకి దింపుతున్నారు.
ట్రావెల్ ఏజెంట్ల నుంచి వివరాల సేకరణ
దుబాయ్‌లోని స్మగ్లింగ్ ముఠాసభ్యులు అక్కడి ట్రావెల్ ఏజెంట్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. వారి ద్వారా హైదరాబాద్‌కు వెళ్తున్న పేద, మధ్య తరగతివారిని సంప్రదించి వస్తువులను తీసుకువెళ్లేలా ఒప్పిస్తున్నారు. దీనికోసం కొందరికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు కమీషన్ ఇస్తుండగా మరికొందరికి టికెట్ కొని ఇస్తున్నారు. సాంకేతిక పరిభాషలో క్యారియర్లుగా పిలిచే వీరిలో అత్యధికులకు తాము పసిడి తీసుకువస్తున్నామనే విషయం తెలియదు. వీరికి తెలియకుండా బంగారాన్ని వివిధ రూపాల్లోకి మార్చేసి అప్పగిస్తున్నారు. బుధవారం 3 కిలోల బంగారంతో అధికారులకు చిక్కిన ఇద్దరు క్యారియర్లు దాన్ని ట్రాలీ బ్యాగ్స్‌కు ఫ్రేమ్‌లు తదితరాల రూపంలో తీసుకువచ్చారు
వాట్సాప్ ద్వారా ఫొటోలు పంపుతూ...
నాలుగు టాలీ బ్యాగ్స్‌తో బయలుదేరిన ఈ ఇద్దరి ఫొటోలను అక్కడి ఏజెంట్లు తమ ఫోన్లలో తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చాక వీరిని రిసీవ్ చేసుకునేది ఎవరో, వారి కాంటాక్ట్ నంబర్లు ఏమిటో చెప్పరు. అలా చేస్తే కస్టమ్స్ తనిఖీల్లో వీరు చిక్కితే ముఠా గుట్టురట్టవుతుందని ఇలా చేస్తున్నారు. వీరి ఫొటోలను మాత్రం వాట్సాప్ ద్వారా ఇక్కడ ఉంటున్న రిసీవర్లకు పంపుతున్నారు. దుబాయ్ నుంచి 3 కిలోల బంగారంతో వచ్చిన ఇద్దరూ కస్టమ్స్ ఏరియాను దాటి బయటకు వచ్చేశారు. అక్కడ వేచి ఉన్న ముగ్గురు రిసీవర్లు వీరిని గుర్తించి దగ్గరకు వెళ్లారు. అప్పటికే ఈ స్మగ్లింగ్స్‌పై ఉప్పందిన శంషాబాద్ విమానాశ్రయ కస్టమ్స్ అధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) అధికారులు ఐదుగురినీ అదుపులోకి తీసుకుని రూ.కోటి విలువైన పసిడిని స్వాధీనం చేసుకున్నారు. వీరి విచారణలో సూత్రధారి పేరు బయటకు రాగా అతడి కోసం గాలిస్తున్నారు. సూత్రధారులైన స్మగ్లర్లు ఇక్కడే పాస్‌పోర్ట్ ఉన్న కొందరు పేదల్ని గుర్తిస్తున్నారు. వీరికి టికెట్లు, వీసా ఇవ్వడం ద్వారా దుబాయ్‌కు పంపి, రెండు, మూడు రోజుల తర్వాత బంగారంతో రప్పిస్తున్నట్లు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment