
సాక్షి, శంషాబాద్ : దుబాయ్ నుంచి శంషాబాద్‌కు వచ్చిన ఇద్దరు వేర్వేరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్, డీఆర్‌ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు బంగా రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకవ్యక్తి వద్ద 405 గ్రాముల బంగారం పేస్ట్ బయటపడింది. శుక్రవారం అర్థరాత్రి ఇండిగో 6ఈ 025 విమానంలో వచ్చిన మహ్మద్ అన్షాద్ కదలికలను అనుమానించిన అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు. అతడిని అధికారులు విచారించగా బంగారాన్ని మలద్వారంలో దాచుకుని తీసుకొచ్చినట్లు వెల్లడించాడు. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి బంగారాన్ని బయటికి తీయించారు. దీని విలువ రూ.13,08,215 ఉంటుందని అధికారులు నిర్ధారించారు. అన్షాద్ తరచూ ఇదే విధంగా బంగారం తీసుకొస్తున్నట్లు విచారణలో బయటపడింది. మరోవైపు ముందస్తు సమాచారం మేరకు డీఆర్‌ఐ అధికారులు ఎయిర్‌పోర్టులో దుబాయ్ నుంచి వచ్చిన మరోవ్యక్తిని తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో ఎటువంటి బంగారం బయటపడలేదు. దీంతో అతడి ని టెర్మినల్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించి మలద్వారంలో దాచి తీసుకొచ్చిన నాలుగు బంగారు క్యాప్సుల్స్‌ను బయటికి తీశారు.