సాక్షి, న్యూఢిల్లీ: విదేశాల నుంచి అక్రమంగా విలువైన వస్తువులను తీసుకొస్తుంటే కస్టమ్స్ అధికారులు పసిగట్టి పట్టేస్తుంటారు. అలాంటి సంఘటనే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం జరిగింది. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా? పోలీసులు పట్టుకున్న చేతి గడియారాల విలువ తెలిస్తే.. ఆశ్చర్యపోవటం మీ వంతవుతుంది. మొత్తం ఏడు గడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో వజ్రాలు పొదిగిన వైట్ గోల్డ్ వాచ్ విలువ ఏకంగా రూ.27 కోట్లు ఉంటుందటా..
అత్యంత విలువైన ఏడు చేతి గడియారాలని అక్రమంగా తీసుకొస్తుండగా ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టేశారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద విలువైన గడియారాలతో పాటు వజ్రాలు పొదిగిన బ్రెస్‌లెట్, ఐఫోన్ 14ప్రోను సైతం సీజ్ చేశారు. లగ్జరీ వస్తువులకు పన్నులు, ఇతర సుంకాలు చెల్లించకుండానే దేశంలోకి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అమెరికా జువెలరీ, వాచ్ తయారీ సంస్థ జాకబ్ అండ్ కో.. తయారు చేసిన ఓ వాచ్‌లో విలువైన వజ్రాలు పొదిగారని, అది సంపన్నులు మాత్రమే ధరిస్తారని అధికారులు తెలిపారు. మొత్తం పట్టుబడిన వస్తువుల విలువ రూ.28 కోట్లకుపైగా ఉంటుందని, ఈ స్థాయిలో పట్టుకోవటం ఇదే తొలిసారిగా వెల్లడించారు. 60 కిలోల బంగారంతో సమానమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ‘ఎల్‌జీ సాబ్ జస్ట్ చిల్.. మీలా నా భార్య సైతం చేయలేదు’.. కేజ్రీవాల్ ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment