స్వాధీనం చేసుకున్న బంగారాన్ని మీడియాకు చూపుతున్న బిబి ప్రసాద్
* ఈ కోణంలోనూ దర్యాప్తు: కస్టమ్స్ విభాగం
* శంషాబాద్‌లో ఇద్దరు మహిళల నుంచి 15.7 కిలోల బంగారం స్వాధీనం
* దిగుమతి సుంకం ఎగవేసేందుకే స్మగ్లింగ్ చేస్తున్నట్లు మహిళల అంగీకారం
* వ్యవస్థీకృత ముఠాల ప్రమేయం ఉండొచ్చన్న కస్టమ్స్ రేంజ్ చీఫ్ కమిషనర్
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు సమీకరణలో భాగంగానే విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా పెరిగిందని అనుమానిస్తున్నట్లు కస్టమ్స్ విభాగం హైదరాబాద్ రేంజ్ చీఫ్ కమిషనర్ బి.బి.ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కోణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఒక్క బుధవారమే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు మహిళల నుంచి 15.7 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ప్రసాద్ కథనం ప్రకారం.. బంగారం తదితరాలను అక్రమ రవాణా చేస్తున్న వారి కోసం కస్టమ్స్ విభాగంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ విమానాశ్రయంలో పటిష్ట నిఘా ఉంచింది. స్మగ్లర్ల వేషధారణతో పాటు ప్రవర్తనే అనుమానించడానికి కీలక ఆధారంగా మారుతుంది. కొన్నిసార్లు పాస్‌పోర్ట్‌లో ఉండే వివరాలూ సందేహాలను కలిగిస్తాయి. సాధారణంగానే మహిళా ప్రయాణికులు అనుమానితుల జాబితాలో తక్కువగా ఉంటారు. అయితే బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు దోహా నుంచి ఖతర్ ఎయిర్ వేస్ విమానంలో వచ్చిన ఫాతిమా అనే మహిళ కదలికల్ని అనుమానించిన కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తనిఖీల నేపథ్యంలో ఈమె బ్యాగేజ్, లగేజీల్లో రూ. 78 లక్షల విలువైన 2.7 కిలోల బంగారం బయటపడింది. దిగుమతి సుంకం ఎగవేత కోసమే అక్రమరవాణా చేస్తున్నామని అంగీకరించిన ఫాతిమాను అరెస్టు చేసిన కొన్ని గంటలకే మరో మహిళ పట్టుబడింది. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టస్‌గా పని చేస్తున్నారు. దుబాయ్‌లో విధులు ముగించుకున్న ఈమె ఆఫ్ డ్యూటీలో ఉండి ఎమిరేట్స్ ఫ్లైట్‌లోనే బుధవారం ఉదయం 10 గంటలకు శంషాబాద్ చేరుకున్నారు.
విమానాశ్రయంలో దిగినప్పటికి నుంచి అదో రకంగా ప్రవర్తిస్తున్న ఈమెను అనుమానించిన కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలోనే కేజీ బరువున్న 13 బంగారం కడ్డీలను తరలిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. వీటి విలువ రూ. 3.76 కోట్లుగా నిర్ధారించారు. ఈమె సైతం సుంకం ఎగవేత కోసమే అక్రమ రవాణా చేశానని చెప్తున్నప్పటికీ ఈ వ్యవహారాల వెనుక వ్యవస్థీకృత ముఠాల ప్రమేయాన్ని అనుమానిస్తున్న కస్ట మ్స్ అధికారులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు 16 నెలల్లో రూ. 20.12 కోట్ల విలువైన 67.758 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధిక శాతం స్మగ్లర్లు ఈ బంగారాన్ని బ్యాగుల అడుగున ఉండే తొడుగులు, లోదుస్తులు, రహస్య జేబులు, బూట్ల సోల్, మొబైల్ చార్జర్స్‌లో దాచి తీసుకు వస్తున్నారని గుర్తించారు. విదేశాల్లో 6 నెలలు ఉండి వచ్చే వారు నిర్ణీత పన్ను చెల్లించి కేజీ బంగారం వరకు తెచ్చుకునే అవకాశం ఉందని ప్రసాద్ తెలిపారు.
బరువుకు ఒంగిపోయి దొరికిపోయి...
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా చేస్తూ చిక్కిన ఇద్దరు మహిళల్లో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పని చేస్తున్న సదాఫ్‌ఖాన్ ఒకరు. ఈమె గతంలోనూ అనేకసార్లు హైదరాబాద్ వచ్చారు. ఈసారీ దుబాయ్ నుంచి వస్తూ తన హ్యాండ్ బ్యాగ్‌లో రహస్యంగా ఏర్పాటు చేసిన అరలో 13 కేజీల బరువున్న 13 బంగారం కడ్డీలను తీసుకువచ్చారు. వీటిపైన మెర్క్యూరీ పేపర్ చుట్టడంతో స్కానర్‌కు చిక్కకుండా బయటపడ్డారు. అయితే అంత బరువున్న బ్యాగ్‌ను మోస్తున్న కారణంగా సదాఫ్‌ఖాన్ ఒంగిపోయి భిన్నంగా నడవాల్సి వచ్చింది. ఈ శైలిని చూసి అనుమానించిన కస్టమ్స్ విభాగం అధికారులు ఆమెను తనిఖీ చేయటంతో విషయం బయటపడింది.