కంటైనర్ టెర్మినల్
సాక్షి, విశాఖపట్నం: ఎగుమతుల్లో విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ), గంగవరం పోర్టు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ఎగుమతులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, కేంద్ర ప్రభుత్వ సహకారం.. సరుకు రవాణా రంగంలో సత్ఫలితాలిస్తున్నాయి. వీపీఏలో 32 బెర్త్‌లు, గంగవరంలో 9 బెర్త్‌లున్నాయి. ఇందులో మొత్తం 23 బెర్త్‌ల ద్వారా కార్గో కంటైనర్ ఎక్స్‌పోర్ట్స్ జరుగుతుంటాయి.
విశాఖ నుంచి ఎక్కువగా అమెరికా, చైనా, యూఏఈ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇటలీ, వియత్నాం, జపాన్, కెనడా దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. ఇందులో అత్యధికంగా ప్రపంచ పెద్దన్న అమెరికాదే అగ్రస్థానం కావడం విశేషం. 2021–22 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు ఏకంగా రూ. 11,866 కోట్ల ఎగుమతులు జరిగాయి. తర్వాత స్థానంలో చైనా (రూ.8,307 కోట్లు), యూఏఈ (రూ.4,358 కోట్లు) ఉన్నాయి. ఎగుమతుల్లో సింహభాగం సముద్ర ఉత్పత్తులదే. అలాగే ఎగుమతుల్లో వృద్ధికి అవకాశమున్న అన్ని అంశాలనూ సద్వినియోగం చేసుకుంటూ.. విశాఖపట్నంలోని పోర్టులు తమ జోరును కొనసాగిస్తున్నాయి.
ఎగుమతులకు సిద్ధం చేస్తున్న సముద్ర ఉత్పత్తులు
ఇక్కడ లైసెన్స్ తీసుకుంటే..
దేశ విదేశీ ఎగుమతులకు కస్టమ్స్ శాఖ అనుమతులను సులభతరం చేయడంతో విశాఖ నుంచి సరుకు రవాణా మరింత వేగం పుంజుకుంటోంది. 24/7 కస్టమ్స్ అధికారులు పోర్టులో అందుబాటులో ఉంటూ.. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా వన్‌టైమ్ పర్మిషన్ విధానం అమలుచేస్తున్నారు. దీని ద్వారా డైరెక్ట్ పోర్ట్ ఎంట్రీ (డీపీఈ) కింద అనుమతులు వేగవంతమయ్యాయి. విశాఖ పోర్టుల్లో 29 శాతం వరకు ఈ తరహాలో ఎగుమతులు త్వరితగతిన పూర్తవుతున్నాయి.
ఈ విధానంవల్ల సమయంతో పాటు డబ్బులు కూడా ఆదా అవుతున్నాయి. ఈ–సంచిత్ సాంకేతికత ద్వారా పోర్టులోకి రాకముందే ఎగుమతికి సంబంధించిన సరుకు వివరాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ సౌకర్యం తీసుకురావడంతో దాదాపు 90 శాతం సంస్థలు దీనిపైనే ఆధారపడుతూ.. ఎగుమతులను వేగవంతం చేస్తున్నాయి. ఎగుమతులకు సంబంధించి కస్టమ్స్ లైసెన్స్‌ను విశాఖపట్నంలో తీసుకుంటే చాలు.. దేశంలోని ఏ పోర్టు నుంచైనా.. ఏ దేశానికైనా ఎగుమతి, దిగుమతులు చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది.
ఈపీసీజీతో ఎగుమతి సంస్థలకు వెసులుబాటు
దేశ విదేశాల ఎగుమతులకు విశాఖపట్నం స్వర్గధామంగా ఉంది. ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ (ఈపీసీజీ) పథకం ద్వారా ఐజీఎస్‌టీ, కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు లభిస్తుంది. షిప్పింగ్ బిల్స్ డ్రాబ్యాక్ క్లెయిమ్ చేసుకోవడం విషయంలోనూ వైజాగ్ కస్టమ్స్ ముందుంటుంది. ప్రతినెలా రూ.60 కోట్ల వరకు ఎగుమతిదారులు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఐజీఎస్‌టీ రిఫండ్ ప్రతినెలా రూ.45 కోట్లు జరుగుతోంది. ఆన్‌లైన్ పద్ధతుల ద్వారా ఎగుమతులను మరింత సులభతరం చేశాం. ఈ కారణంగా ఎగుమతుల విషయంలో వైజాగ్ దూసుకుపోతోంది.
– డా. జేన్ జేసుదాస్, కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment