వీ సెజ్ ప్రధాన పరిపాలనా కార్యాలయం
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్–19 ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక ఉత్పత్తులు, ఎగుమతుల రంగం కుదేలైంది. సేవల రంగంపైనా ప్రభావం పడింది. ఇలాంటి ఒడిదుడుకులనూ తట్టుకుని విశాఖపట్నం ప్రత్యేక ఆర్థిక మండలి (వీ సెజ్) సత్తా చాటింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచీ కరోనా కాలమైనా 11.20 శాతం వృద్ధి రేటు సాధించింది. కోవిడ్ సంబంధిత ఉత్పత్తులతో ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచింది. విశాఖను ప్రభుత్వం కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన తర్వాత ‘వీ సెజ్’లో పారిశ్రామిక స్థలాలకు డిమాండ్ పెరిగింది.
కార్యాచరణలోకి 60 సెజ్‌లు
► విశాఖపట్నం కేంద్రంగా వీ సెజ్ 1989లో ఏర్పాటైంది. దీని పరిధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు యానాం కేంద్ర పాలిత ప్రాంతంలో 60 సెజ్‌లు కార్యాచరణలోకి వచ్చాయి.
► వీ సెజ్ పరిధిలోని యూనిట్లలో 2018–19 నాటికి ఉద్యోగుల సంఖ్య 3.39 లక్షలు ఉండగా.. 2019–20లో 3.79 లక్షలకు చేరింది.
► లాక్‌డౌన్–1 కాలంలో ఆంక్షల నుంచి మినహాయింపు పొందిన 46 ఫార్మా యూనిట్లు, 2 ఆహార ఉత్పత్తి యూనిట్లు మూడో వంతు సిబ్బందితో షిఫ్ట్‌ల వారీగా పనిచేశాయి. 322 ఐటీ సంబంధిత యూనిట్లలో సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. తర్వాత లాక్‌డౌన్–2, 3, 4లో ఆంక్షలను సడలించడంతో ఇప్పుడు యూనిట్లన్నీ పనిచేస్తున్నాయి.
వీ సెజ్‌లో పీపీఈ కిట్లను తయారు చేస్తున్న సిబ్బంది
రూ.42,633 కోట్ల విలువైన ఎగుమతులు
► ఆర్థిక మాంద్యం, కోవిడ్–19 కష్టకాలంలోనూ ఈ ఆర్థిక సంవత్సరం (2020–21)లో ఈ నెల 15వ తేదీ వరకూ వీ సెజ్ నుంచి రూ.42,633 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి.
► గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 11.20 శాతం వృద్ధి సాధించడం విశేషం.
► కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ) టాబ్లెట్లకు డిమాండ్ పెరగ్గా.. సెజ్ పరిధిలో ఉన్న లారస్ ల్యాబ్స్ సంస్థ ఆ టాబ్లెట్లను అమెరికా, దక్షిణాఫ్రికా, సింగపూర్, బెల్జియం తదితర దేశాలకు ఎగుమతి చేస్తోంది.
► 5.59 కోట్ల సర్జికల్ ఫేస్ మాస్కులు, 90 లక్షల మెడికల్, సర్జికల్ గౌన్లు, 69 లక్షల ఫేస్ షీల్డ్‌లు, 1.42 కోట్ల మెడికల్ ఆప్రాన్ (పీపీఈ) కిట్లు, 9 లక్షల షూ కవర్లు ఇప్పటివరకూ తయారయ్యాయి.
డిమాండ్ పెరిగింది
విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన తర్వాత ఇక్కడి సెజ్‌లలో పారిశ్రామిక స్థలాలకు డిమాండ్ పెరిగింది. లాక్‌డౌన్ సమయంలోనూ 13 కొత్త యూనిట్లకు అనుమతులు ఇచ్చాం. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్ల విలువైన ఎగుమతులు సాధించాలనే లక్ష్యంతో ఉన్నాం.
Comments
Please login to add a commentAdd a comment