సాక్షి, అమరావతి: కరోనా విపత్తు సమయంలోనూ విశాఖపట్నం ప్రత్యేక ఆర్థిక మండలి(వీ సెజ్) దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచింది. ఎగుమతుల్లో 11.77 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 3 నాటికి రూ.64,399 కోట్ల విలువైన ఎగుమతులు జరిపినట్లు వీ సెజ్ డెవలప్‌మెంట్ కమిషనర్ ఎ.రామ్‌మోహన్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. గతేడాది ఇదే సమయానికి రూ.57,620 కోట్ల ఎగుమతులను వీ సెజ్ జరిపింది. దేశవ్యాప్తంగా మొత్తం 253 సెజ్‌లుండగా.. ఇందులో 61 వీ సెజ్ పరిధిలో ఉన్నాయి. ఇందులో 36 తెలంగాణలోనూ, 24 ఆంధ్రప్రదేశ్‌లో, ఒకటి ఛత్తీస్‌గఢ్ పరిధిలో ఉంది. వీటి ద్వారా మొత్తం 3,93,312 మందికి ఉపాధి లభిస్తోంది. లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగుల సంఖ్యలో ఒక శాతం క్షీణత నమోదైనప్పటికీ.. ఆ తర్వాత తీసుకున్న జాగ్రత్తలతో గతేడాదితో పోలిస్తే ఉద్యోగుల సంఖ్యలో 5.6 శాతం వృద్ధి నమోదైనట్లు రామ్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
దుమ్ము దులిపిన ఏపీ సెజ్..
వీ సెజ్ పరిధిలో ఉన్న అచ్యుతాపురం ఏపీ సెజ్, దువ్వాడ సెజ్‌లు ఈ ఏడాది దుమ్ముదులిపేశాయి. అచ్యుతాపురం ఏపీ సెజ్ ద్వారా ఈ ఏడాది 8 నెలల కాలంలోనే రూ.3,477 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. గతేడాది(రూ.2,815 కోట్లు)తో పోలిస్తే ఈసారి 24 శాతం వృద్ధి నమోదైంది. ఈ సెజ్‌లో ఫార్మా, ఫెర్రో అల్లాయిస్, కెమికల్స్, బల్క్‌డ్రగ్‌కు చెందిన 16కు పైగా కంపెనీలు రూ.4,000 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టాయి. వీటి ద్వారా 3,200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తోంది. ఇదే సమయంలో దువ్వాడ సెజ్ ఎగుమతుల్లో 14 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది రూ.954 కోట్లుగా ఉన్న ఎగుమతులు ఈ ఏడాది రూ.1,084 కోట్లకు చేరాయి.
కోవిడ్ కట్టడిలో కీలక పాత్ర
కోవిడ్ కట్టడిలో వీ సెజ్ కీలకపాత్ర పోషించింది. ఏపీ సెజ్‌లోని లారస్ ల్యాబ్ ద్వారా 11.47 మిలియన్ హెచ్‌సీక్యూ ట్యాబ్లెట్లను ఉత్పత్తి చేసి.. సింగపూర్, అమెరికా, దక్షిణాఫ్రికా దేశాలకు ఎగుమతి చేశారు. అలాగే 3.1 కోట్ల ఫేస్ మాస్కులు, 1.42 కోట్ల పీపీఈ కిట్లు, 90 లక్షల సర్జికల్ గౌన్స్, 6 కోట్ల శానిటరీ న్యాప్‌కిన్స్, కోటికిపైగా యాప్రాన్ కిట్స్‌ను వివిధ యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేసి అందించింది.
లాక్‌డౌన్ తర్వాత వేగంగా పునరుద్ధరించాం..
దేశంలో అనేక రోజులపాటు లాక్‌డౌన్ నడిచినప్పటికీ.. ఆ తర్వాత వేగంగా ముందుకెళ్లాం. సెజ్, ఎగుమతి ఆధారిత యూనిట్లలోని సంస్థలను ప్రత్యేక నిబంధనలతో నడపడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని కాపాడగలిగాం. వీ సెజ్ పరిధిలో కోవిడ్ నివారణకు సంబంధించిన ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి సారించాం. అందువల్లే విశాఖపట్నం ప్రత్యేక ఆర్థిక మండలి దేశంలోనే అత్యుత్తమ పనితీరును కనబరచగలిగింది.
– ఎ.రామ్‌మోహన్‌రెడ్డి, వీసెజ్ డెవలప్‌మెంట్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment