మహారాణిపేట పోలీస్ స్టేషన్‌లో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ
మహారాణిపేట/అల్లిపురం/గాజువాక : మహారాణిపేట పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో పోలీసు సిబ్బందిలో, ఆమె నివసిస్తున్న కొబ్బరితోటలో ఆదివారం కలకలం రేగింది. ఆమె కాక, దండు బజార్‌లో మరో మహిళకు, గాజువాక ప్రియదర్శిని కాలనీలో ఓ వ్యక్తికి కూడా కరోనా సోకింది. దాంతో ఆదివారం విశాఖలో ముగ్గురు వ్యాధి బారిన పడినట్టయింది. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 66కు చేరింది. 23 మంది డిశ్చార్జ్ అయ్యారు.
కొబ్బరితోట ప్రాంతంలో ఇప్పటి వరకు కరోనా వ్యాధి బారినపడిన వారు ఎవరూ లేరు. ఈ కారణంగా కొబ్బరితోట రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా మారాయి. మనోరమా థియేటర్ వద్ద, కొబ్బరితోటలోని అన్ని వీధుల మొదట్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. 32,33, 34 వార్డులలో రహదారులు మూసివేశారు.
టూటౌన్‌లో అలజడి
మహారాణిపేట పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న హోంగార్డుకు కరోనా పాజిటివ్ రావడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. బాధితురాలు పదిరోజులుగా కొబ్బరితోటలో ఉంటున్నారు. ఈనెల 6న దండుబజారు ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కరోనా టెస్టులు చేయడంతో ఆమె కూడా పరీక్ష చేయించుకున్నారు. రిపోర్టులలో ఆమెకు పాజిటివ్ రావడంతో పోలీసులు కలవరపడుతున్నారు. బాధితురాలిని గీతం ఆస్పత్రికి, ఆమె తండ్రి, సోదరిలను క్వారంటైన్‌కు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment