
దొండపర్తి(విశాఖ దక్షిణ): యూకే రాయల్ నేవీకి చెందిన ఆఫ్‌షోర్ పెట్రోలింగ్ నౌక హెచ్‌ఎంఎస్ తమర్ విశాఖ పోర్టుకు శనివారం చేరుకుంది. ఈ నౌకకు చెందిన 17 మంది సిబ్బంది విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొత్త కొప్పెర్లలోని విభిన్న ప్రతిభావంతుల ఎన్టీఓ క్యాంపస్‌ను సందర్శించారు. అక్కడ దివ్యాంగ పిల్లలు, యువతతో ముచ్చటించారు. వారితో క్రికెట్, బాస్కెట్‌బాల్ వంటి క్రీడలు ఆడారు. మొక్కలు నాటి వసతి గృహాలకు రంగులు వేశారు.
ఇండో–పసిఫిక్‌లో పూర్తి స్థాయి పెట్రోలింగ్ విధులు నిర్వర్తించే రాయల్ నేవీ నౌకల్లో హెచ్‌ఎంఎస్ తమర్ ఒకటి. ఇరుదేశాల నావికాదళ సంబంధాలు మరింత బలోపేతమయ్యేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని నావికాదళ వర్గాలు పేర్కొంటున్నాయి. హెచ్‌ఎంఎస్ తమర్ విశాఖ పర్యటన భారత్‌లో రక్షణ, భద్రతా సంబంధానికి తమ దేశం ఇస్తున్న ప్రాముఖ్యతకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ పేర్కొన్నారు.