సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విశాఖపట్నం పోర్టు అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. దేశంలోని మేజర్ పోర్టుల్లో 4వ స్థానానికి ఎగబాకిన విశాఖ పోర్టు అథారిటీ.. నంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు అవసరమైన ప్రణాళికలను అమలు చేస్తోంది. రూ.755 కోట్ల వ్యయంతో పోర్టు ఆధునికీకరణ పనులను చేపట్టింది. బెర్తుల ఆధునికీకరణ, సామర్థ్య విస్తరణతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది.
ప్రస్తుతం వివిధ జెట్టీల ద్వారా మాంగనీస్, బొగ్గు, జిప్సం, బాక్సైట్ తదితర ఖనిజాలు, ఇతర ప్రధాన ఉత్పత్తుల రవాణా జరుగుతోంది. భవిష్యత్‌లో వీటి రవాణా సామర్థ్యం పెరిగే అవకాశం ఉన్నందున జెట్టీల సామర్థ్యాన్ని విశాఖ పోర్టు అధికారులు పెంచుతున్నారు. అలాగే రైల్వేల ద్వారా కార్గో హ్యాండ్లింగ్‌ను వేగవంతం చేసేందుకు కూడా వివిధ పనులు చేపట్టారు. పోర్టులోని ఆర్‌అండ్‌డీ యార్డులో వ్యక్తిగత క్యాబిన్‌ల నిర్మాణం, ప్యానెల్ ఇంటర్‌లాకింగ్ ద్వారా యార్డును రైల్వే ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నారు. రాత్రి సమయంలో కూడా జనరల్ కార్గో బెర్త్ వద్ద కేప్ సైజ్ షిప్‌లను సైతం నిలుపుకునేలా ఏర్పాట్లు చేశారు.
ఇన్నర్ హార్బర్, ఔటర్ హార్బర్‌లో సింగిల్ బీమ్ ఎకో సౌండర్‌ను మల్టీబీమ్‌గా అప్‌గ్రేడ్ చేశారు. పోర్టులో మొత్తం 29 బెర్తులుండగా.. ఇందులో 8 బెర్తులు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో నడుస్తున్నాయి. త్వరలో మరో 3 బెర్తులను కూడా పీపీపీ కింద ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా అంతర్గత నౌకాశ్రయంలోని డబ్ల్యూక్యూ–7, డబ్ల్యూక్యూ–8, ఈక్యూ–7, ఈక్యూ–6 బెర్త్‌ల యాంత్రీకరణ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. చమురు రవాణాకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో చేపట్టిన ఇన్నర్ హార్బర్‌లోని ఓఆర్–1, 2 బెర్తుల అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. అలాగే వివిధ మౌలిక వసతులతో మూడు స్టోరేజీ షెడ్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment