సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అమలు ద్వారా అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని రక్షణశాఖ సైంటిఫిక్ అడ్వైజర్ డాక్టర్ సతీశ్‌రెడ్డి చెప్పారు. ఈ కారణంగానే రక్షణరంగ ఎగుమతులు గతేడాది రూ.16 వేల కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో ‘రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో స్వదేశీ పరిజ్ఞానం, ఆవిష్కరణలు’ అనే అంశంపై విశాఖలో నిర్వహించిన సదస్సులో సతీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపారమైన అవకాశాలున్న విశాఖ రక్షణ రంగానికి వెన్నెముకగా ఉందని చెప్పారు.
తూర్పు నౌకాదళం, డాక్‌యార్డ్, షిప్‌యార్డు, ఎన్‌ఎస్‌టీఎల్ తదితర రక్షణ రంగం, అనుబంధ సంస్థలు ఉన్న విశాఖ భవిష్యత్తులో రక్షణ రంగం, ఏరోసిస్టమ్‌కు కేంద్రంగా మారనుందని చెప్పారు. రక్షణ రంగ పరికరాల తయారీ పరిశ్రమలు ఇప్పుడిప్పుడే విశాఖలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా డీఆర్‌డీవో నుంచి సాంకేతికత బదలాయింపుని ప్రోత్సహించడం ద్వారా.. డిఫెన్స్ మెటీరియల్ ఉత్పత్తులు పెరిగాయని తెలిపారు. దేశీయ తయారీరంగానికి ఉత్తేజం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు రక్షణ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేసిందని చెప్పారు.
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారవుతున్న ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతిచేసే స్థాయికి చేరుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. 2014–15 నాటికి రూ.2 వేల కోట్ల కంటే తక్కువగా ఉన్న డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ గతేడాది రూ.16 వేల కోట్లకు చేరుకున్నాయని, భవిష్యత్తులో రూ.25 వేల కోట్ల మార్క్‌ని అధిగమించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. టార్పెడోలు, క్షిపణులు, పరికరాలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. ఒకప్పుడు రక్షణరంగ పరికరాల దిగుమతుల్లో అగ్రభాగంలో ఉన్న భారత్.. ఇప్పుడు ఎగుమతుల్లో అగ్రస్థానం దిశగా పరుగులు పెడుతుండటం శుభపరిణామమని పేర్కొన్నారు.
రక్షణ రంగంలో ఒకప్పుడు సప్‌లై చైన్‌గా ఉన్న ప్రైవేటు కంపెనీలు డెవలప్‌మెంట్ ప్రొడక్షన్ సెక్టార్‌గా మారాయని, క్రమంగా డెవలప్‌మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్టనర్స్ (డీసీపీపీ)గా అభివృద్ధి చెందాయని చెప్పారు. ఇప్పటికే ప్రైవేట్ తయారీ సంస్థలు ఏడు మిసైళ్లను తయారు చేశాయన్నారు. రక్షణ రంగానికి అవసరమైన ఇన్నోవేషన్స్‌ని సృష్టించే అంకుర పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.
డిఫెన్స్ ఇన్నోవేషన్ స్టార్టప్ చాలెంజ్ ద్వారా సాంకేతికత బదలాయింపు జరుగుతోందన్నారు. రక్షణ రంగం వైపుగా ఎక్కువ స్టార్టప్స్ అడుగులు వేస్తున్నా యని చెప్పారు. దేశంలో 2016 నాటికి 400 స్టార్టప్‌లుండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య లక్షకు చేరుకోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)లోను మార్పులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సులో సీఐఐ ఎస్‌ఐడీఎం చైర్మన్ జె.శ్రీనివాసరాజు, సీఐఐ ఏపీ చైర్మన్ డాక్టర్ ఎం.లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment