సీజ్ చేసిన బంగారం తక్కువ ధరకే ఇస్తామని..
♦ రూ.3 లక్షలు, 10 సెల్‌ఫోన్లు, సుమో స్వాధీనం
కోరుట్ల : కస్టమ్స్ అధికారులు సీజ్‌చేసిన బంగారం తక్కువ ధరకే ఇస్తామని చెప్పి సూట్‌కేసు మాయతో లక్షల్లో డబ్బులు తీసుకుని ఉడాయిస్తున్న దొంగలముఠా సభ్యులు ముగ్గురిని అరెస్టు చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టుపడినవారిలో ఒకరు డిస్మిస్ అయిన కానిస్టేబుల్ ఉండడం గమనార్హం. డీఎస్పీ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలుకు చెందిన వనమాల తిరుపతయ్య గతంలో కానిస్టేబుల్‌గా పనిచేసిన ఓ దొంగతనం కేసులో సస్పెండ్‌అయ్యాడు.
తర్వాత పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన చెక్క సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా వక్కలంకకు చెందిన బండితి శ్రీనివాస్ కలిసి 20 ఏళ్లుగా బంగారం ఎరగా వేసి మోసాలకు పాల్పడుతున్నారు. తిరుపతయ్య తాను కస్టమ్స్ ఆఫీసర్‌గా తప్పుడు ఐడెంటిటీ కార్డు తయారుచేయించి దాన్ని ఆధారంగా చేసుకుని తమ వద్ద సీజ్ చేసిన బంగారం ఉందని తక్కువ ధరకు అమ్ముతామని చెబుతూ ఫోన్‌లో సంప్రదిస్తాడు. మొదట స్విస్ దేశపు ముద్ర ఉన్న బంగారు బిళ్లను చూపుతాడు. అదే బంగారం కిలో వరకు ఉందని కేవలం రూ.15–20 లక్షలు ఇస్తే అమ్ముతామని నమ్మబలుకుతారు. వీరి మాటలు నమ్మి డబ్బులు ఇచ్చిన వారిని సూట్‌కేసుతో మాయ చేస్తారు. వారి డబ్బులు తీసుకుని దర్జాగా పారిపోతారు.
నెల క్రితం మెట్‌పల్లి మండలం చింతలపేటకు చెందిన తిరుపతిరెడ్డిని ఉచ్చులోకి లాగేందుకు యత్నించారు. వరంగల్‌కు చెందిన గంగినేని రాజేందర్‌తో వ్యాపార భాగస్వామిగా ఉన్న తిరుపతిరెడ్డి బంగారం విషయమై సలహా అడిగాడు. దీంతో రాజేందర్ తాను ఏడాది క్రితం మోసపోయిన విషయాన్ని వెల్లడించాడు. అప్రమత్తమైన తిరుపతిరెడ్డి వెంటనే కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజుకు సమాచారం ఇచ్చారు. జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ రాజశేఖర్‌రాజు చాకచక్యంగా వలపన్ని నిందితులను పట్టుకున్నారు. సోమవారం సాయంత్రం పోలీస్ బోర్డు పెట్టుకుని కోరుట్ల శివారు ప్రాంతంలో టాటా సుమోలో తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు తాము చేసిన మోసాలు ఒప్పుకున్నారు. వీరిని అరెస్టు చేసి రూ.3లక్షలు నగదు, 3 తులాల స్విస్ బంగారం బిళ్ల, 10 సెల్‌ఫోన్లు, సూట్‌కేసు, సుమో స్వా«ధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేయడంలో చొరవ చూపిన సీఐ రాజశేఖర్‌రాజు, ఎస్సై బాబురావు, ప్రొబేషనరీ ఎస్సై సూరి, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, నరేందర్, నరేష్‌రావును డీఎస్పీ రాజేంద్రప్రసాద్ అభినందించారు.