
రైస్ పుల్లింగ్ యంత్రం దగ్గర పెట్టుకుంటే వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయంటూ రియల్టర్ వెంకట రమణ నుంచి రూ.24 లక్షలు కాజేసిన పబ్బతి వెంకటేశ్వర్లుపై హైదరాబాద్‌లోని పంజగుట్ట పోలీసులు ఈ నెల 1న కేసు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో ఏటా రూ.కోట్లు కొల్లగొడుతున్న ఇలాంటి ముఠాలు అనేకం ఉన్నాయి. కాయిన్, చెంబు, బిందె, యంత్రం... ఇలా వివిధ వస్తువులు చూపించే ఈ చీటర్స్ అవి బియ్యాన్ని తమవైపు ఆకర్షిస్తాయని, వాటిని దగ్గర పెట్టుకుంటే దశ తిరిగిపోతుందంటూ నమ్మబలుకుతారు. వీరి వలలో పడుతున్న అమాయకులు భారీ మొత్తాలు కోల్పోతున్నారు. తమిళనాడులోని వేలూరు జిల్లా రాణిపేట ఈ రైస్ పుల్లింగ్ గ్యాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉంది.
తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన అనేక మంది రైస్ పుల్లింగ్ పాత్రలు ఉన్నాయంటూ దేశవ్యాప్తంగా సంచరిస్తుంటారు. రైస్ పుల్లింగ్ అంటే బియ్యాన్ని ఆకర్షించి తన వైపునకు లాక్కోవడం అని అర్థం. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో వీటిని దక్కించుకుంటే అమోఘమైన ఫలితాలు ఉంటాయని నమ్మబలుకుతారు. వీళ్లు కస్టమర్లకు రైస్ పుల్లింగ్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలను మాత్రమే చూపిస్తుంటారు. అనేక సందర్భాల్లో ఈ పాత్రలను కొనేవారికి తాము విక్రయిస్తున్న వాటిని చూసే అవకాశం కూడా ఇవ్వరు. ఎవరైనా తమకు ఆ పాత్ర మహిమను ప్రత్యక్షంగా చూపించమని పట్టుబడితేనే చూపిస్తారు.
ఈ మోసగాళ్ళు ఎన్ని చెప్పినా, కొందరు కస్టమర్లు నమ్మరు. ఇలాంటి వాళ్లు ఆయా గ్యాంగ్స్‌తో తమ ముందు రైస్ పుల్లింగ్ చేసి చూపించమని కోరుతూ ఉంటారు. ఇలాంటి వారిని బుట్టలో వేసుకోవడానికి నేరగాళ్ళు పక్కా పథకం ప్రకారం వ్యవహరిస్తుంటారు. ఈ చీటర్స్ సాధారణ నాణెం/చెంబు/బిందె తదితరాలను ‘రైస్‌పుల్లర్’గా మార్చడానికి ‘వంట’ చేస్తుంటారు. బియ్యాన్ని తమదైన శైలిలో అన్నంగా వండటం ద్వారా రైస్ పుల్లింగ్ చేసేలా చేస్తారు. బియ్యంలో సన్నని ఇనుప రజను కలిపి బిరుసుగా ఉండేలా అన్నం వండుతారు. దీన్ని ఎండబెట్టడం ద్వారా మళ్ళీ బియ్యంలా కనిపించేలా చేస్తారు.
ఇలా బియ్యంలా కనిపించే ఎండిన అన్నంలో ఇనుప రజను కలిసి ఉంటుంది. మోసగాళ్ళు రైస్ పుల్లర్‌గా చెప్తున్న పాత్ర లోపలి భాగంలో ఎవరికీ కనిపిచకుండా అయస్కాంతం ఏర్పాటు చేస్తారు. దీంతో ఈ పాత్రకు దగ్గరగా ఇనుప రజనుతో తయారైన బియ్యం వస్తే అవి దానికి అతుక్కుంటాయి. ఇలాంటి షోలు చేసి కస్టమర్లకు చూపించే ఈ మోసగాళ్ళు వారిని బుట్టలో వేసుకుంటుంటారు. ఇలాంటి ముఠాలలో అనేక మంది తొలుత బాధితులుగా మారినవారే ఉంటున్నారని ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన పలు కేసులు స్పష్టం చేస్తున్నాయి. తాము నష్టపోయిన మొత్తాన్ని అదే మార్గంలో మళ్లీ సంపాదించాలనో, అసలు ఈ రైస్‌పుల్లర్లు ఉన్నాయా? లేవా? తేల్చుకోవడం కోసమో అలాంటి ముఠాలతో జట్టుకడుతున్నారు.
ఈ రైస్ పుల్లింగ్ ముఠాల్లో కొన్ని ప్రత్యేకంగా కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తుంటాయి. అక్కడ రైస్‌పుల్లర్స్‌ను పరీక్షించినట్టు నటిస్తూ, వాటికి సర్టిఫికెట్లు ఇచ్చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో చంద్రయాన్–3లో వినియోగించడానికి ఉపకరించే లోహమని, రూ.కోట్ల ఖరీదు ఉంటుందని సర్టిఫికెట్లలో ప్రచురిస్తుంటారు. ఇదంతా దాన్ని కొనేవాళ్ళ ఎదురుగానే∙జరుగుతుంది. ఈ కేటుగాళ్ల చేతిలో మోసపోయిన వారి సంఖ్య పదుల్లో ఉంటుంది. బాధితుల్లో వ్యాపారులు, విద్యాధికులు, ఉన్నత కుటుంబాలకు చెందిన వారూ ఉంటారు.
పరువు కోసం ఆలోచించే వీళ్ళు రైస్‌పుల్లర్స్ కొనడానికి ప్రయత్నించి మోసపోయినా, ఆ విషయం బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు.
ఈ కారణంగానే ఓ నేరగాడు లేదా ముఠా పది నేరాలు చేస్తే కేవలం నాలుగైదు మాత్రమే రికార్డుల్లోకి ఎక్కుతుంటాయి. ఇదే నేరగాళ్ళకు కలిసి వచ్చే అంశంగా మారుతోంది. ఓ ముఠా పోలీసులకు చిక్కినప్పుడు అనేక నేరాలు అంగీకరిస్తుంటుంది. అధికారులే స్వయంగా ఆయా బాధితులను సంప్రదించి, ఫిర్యాదు చేయాలని కోరిన సందర్భాలూ ఉంటున్నాయి. అయితే బయటపడటానికి ఇష్టపడని బాధితులే అత్యధికులు ఉంటున్నారు. కేవలం రైస్ పుల్లింగ్ పేరుతోనే కాదు, మరో పది రకాల వస్తువులు, పద్ధతుల పేర్లు చెప్పి మోసాలు చేసే ముఠాలు ఉన్నాయి. వీటి బారినపడి మోసపోయిన వాళ్లు వందలు, వేల సంఖ్యలో ఉన్నా, ఇప్పటికీ అనేక మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఆశతో ఇలాంటి మోసగాళ్ల వల్లో పడి భారీగా నష్టపోతున్నారు. ఇండియన్ శాండ్ బో జాతికి చెందిన పాము తల, తోక ఒకేలా ఉంటాయి.
దీన్ని రెండు తలల పాము అని, డబుల్ ఇంజన్ పేరుతో అది దగ్గర ఉంటే దశ తిరిగిపోతుందని విక్రయిస్తుంటారు. ప్రత్యేకంగా తయారైన ఓ అద్దం ఉంటుందని, దాని ముందు నుంచి ఎవరైనా వెళ్తే అవతలి వారికి వివస్త్రులుగా కనిపిస్తారని నమ్మిస్తారు. వీటితో పాటు వందేళ్లకు పైగా బతికిన త్రాచుపాము తలపై ఏర్పడే నాగమణి, రెండు వైపులా కళ్లు కలిగి ఉండే నెమలి ఈక, నల్లపసుపు, ఎర్ర కలబంద, నల్ల వావిలాకు, లిల్లీపుట్స్, ఇరీడియం తదితరాల పేర్లు చెప్పి మోసం చేసే ముఠాలు అనేకం ఉన్నాయి. అన్నింటికంటే ఎక్కువగా రైస్ పుల్లింగ్ కథలే నడుస్తుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment