యాక్ట్ ఫైబర్‌నెట్ కస్టమర్లకు ఉచిత వైఫై | act fibernet free Free Wi-Fi | Sakshi
Sakshi News home page

యాక్ట్ ఫైబర్‌నెట్ కస్టమర్లకు ఉచిత వైఫై

Published Thu, Oct 29 2015 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 11:38 AM

యాక్ట్ ఫైబర్‌నెట్ కస్టమర్లకు ఉచిత వైఫై

యాక్ట్ ఫైబర్‌నెట్ కస్టమర్లకు ఉచిత వైఫై

హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు..
* త్వరలో వైజాగ్, బెంగళూరుకు విస్తరణ
* గ్రూప్ సీఈవో బాల మల్లాది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యాక్ట్ ఫైబర్‌నెట్ కస్టమర్లకు శుభవార్త. వినియోగదార్లు ఇక నుంచి వారి ఫైబర్‌నెట్ కనెక్షన్ కలిగిన ఇల్లు, కార్యాలయం వెలుపల కూడా ఉచితంగా, అపరిమిత వైఫై ఎంజాయ్ చేయొచ్చు. అదనంగా ఎటువంటి చెల్లింపులు చేయనవసరం లేదు. ఇంటర్నెట్ సర్వీసుల రంగంలో ఉన్న యాక్ట్ ఫైబర్‌నెట్ వైఫై యాక్సెస్ పాయింట్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది.

ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులకు ఉచిత వైఫైని అందిస్తోంది కూడా. ఒకట్రెండు నెలల్లో అధికారికంగా సర్వీసులను ప్రకటిస్తామని గ్రూప్ సీఈవో బాల మల్లాది సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. 10 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్‌ను అందిస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం నూతనతరం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్టు చెప్పారు. కొత్త సర్వీసులతో మార్కెట్లో సంచలనం సృష్టించడం ఖాయమన్నారు.
 
ఇలా పనిచేస్తుంది..
కంపెనీకి చెందిన బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్‌కు వినియోగదారులైన వారు వైఫై జోన్‌లో అపరిమితంగా, ఫ్రీగా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. కస్టమర్ ఒక్కసారి లాగిన్ అయితే చాలు. వైఫై జోన్‌లోకి వెళ్లగానే నెట్ కనెక్ట్ అవుతుంది. కస్టమర్ ఎంత డేటా వాడితే ఆ మేరకు బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్‌లో భాగంగా ఇచ్చే ఉచిత డేటా నుంచి తగ్గిస్తారు. ఉదాహరణకు ఏ-మ్యాక్స్ 650 ప్యాక్‌లో ఉన్న కస్టమర్‌కు 50 జీబీ డేటా ఉచితం. వైఫై జోన్‌లో ఉన్నప్పుడు 1 జీబీ డేటా వాడితే, కస్టమర్ బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్ నుంచి 1 జీబీని తగ్గిస్తారు. బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్ పరిమితి దాటినా కొంతమేర ఇంటర్నెట్ వాడుకునే సౌకర్యం ఉంది.

ఇక కంపెనీ కస్టమర్లు కానివారికి మాత్రం వైఫై జోన్‌లో 30 నుంచి 60 నిమిషాల వరకు మాత్రమే నెట్ ఉచితం. చాలా మంది బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ఇల్లు, కార్యాలయం దాటగానే ఆయా టెలికం ప్రొవైడర్ అందించే మొబైల్ ఇంటర్నెట్‌ను చార్జీలు చెల్లించి వాడుతున్నారు. ఇటువంటి వారికి యాక్ట్ వైఫై సర్వీసు పెద్ద ఉపశమనమే. వారు ఇకనుంచి మొబైల్‌లో యాక్ట్ ఫైబర్‌నెట్ వైఫై జోన్‌లో ఉచితంగా ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు.
 
ఇతర నగరాలకూ విస్తరణ..
హైదరాబాద్‌లో ప్రస్తుతం 40 యాక్సెస్ పాయింట్లు ఏర్పాటయ్యాయి. వీటి సంఖ్యను ఏడాదిలో 200, రెండేళ్లలో 500లకు చేరుస్తామని బాల మల్లాది తెలిపారు. వైఫై జోన్ల ఏర్పాటు విషయంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చొరవ అభినందనీయమని అన్నారు. ‘200ల హాట్‌స్పాట్ లొకేషన్లకుగాను రూ.15 కోట్ల వరకు వెచ్చిస్తున్నాం. మూడు నెలల్లో వైజాగ్, బెంగళూరులో ఇటువంటి సేవలు తీసుకురావాలని యోచిస్తున్నాం.

డేటా చార్జీలు పెంచడం లేదు. ఉచిత డేటా పరిమితిని పెంచుతూ కస్టమర్లకు దగ్గరయ్యాం’ అని బాల తెలిపారు. వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లలో దేశంలో 7.7 లక్షల మంది కస్టమర్లతో యాక్ట్ (అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్) నాల్గవ స్థానంలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో యాక్ట్ ఫైబర్‌నెట్ కస్టమర్ల సంఖ్య 5 లక్షలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement