న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల వరాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఉచిత ఇంటర్నెట్‌తో ఢిల్లీ వాసులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. దేశ రాజధానిలో 11 వేల ఉచిత వై-ఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేయనున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు. హాట్‌స్పాట్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా 200 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ప్రతి నెలా 15 జీబీ డేటాను ఉచితంగా వాడుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు గురువారం మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు.
ఉచిత వై-ఫైలను ఏర్పాటు చేస్తామని 2015 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ హామీయిచ్చింది. ఈ నాలుగేళ్లలో అమలు చేయడానికి మూడు విభాగాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇచ్చే ఏడాది మొదట్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టును కేజ్రీవాల్ సర్కారు ఎట్టకేలకు పట్టాకెక్కించింది. దీని కోసం బడ్జెట్‌లో రూ. 100 కోట్లు కేటాయించామని, మరో నాలుగు నెలల్లో ప్రజలకు ఉచిత వై-ఫై అందుబాటులోకి రానుందని కేజ్రీవాల్ వెల్లడించారు.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని నిర్వహిస్తామన్నారు. వై-ఫై ఏర్పాటు చేయడానికి అవసరమైన రౌటర్లు ప్రైవేటు సంస్థలు సమకూరుస్తాయని, వీటి నిర్వహణ మాత్రం ప్రభుత్వం చేతిలో ఉంటుందని వివరించారు. ఒక హాట్‌స్పాట్ నుంచి రౌటర్ సేవలు 50 మీటర్ల వరకు అందుతాయని, ఒకేసారి 200 మంది ఉచిత వై-ఫై సేవలను వినియోగించుకోవచ్చన్నారు. ఢిల్లీలో మరో 14 లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో గతవారం ఉచిత విద్యుత్ వరాన్ని కేజ్రీవాల్ ప్రకటించారు. ఫిక్స్‌డ్ చార్జీలను 84 శాతం తగ్గించడమే కాక 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితం చేసి ప్రతిపక్షాలను ఊహించని దెబ్బతీశారు. (చదవండి: ప్రతిపక్షాలను ఊహించని దెబ్బతీశారు..)
Comments
Please login to add a commentAdd a comment