మరో11ఉచిత వైఫై స్పాట్లు!
నగరంలో దశలవారీగా సేవల విసర్తణ
ప్రతి రోజు 100 జీబీ వరకు డాటా డౌన్‌లోడ్
సోషల్ మీడియా సర్వేలో బీఎస్‌ఎన్‌ఎల్ సేవలకు బెస్ట్ రేటింగ్
హైదరాబాద్: దేశంలోనే తొలి పూర్తి స్థాయి వై ఫై నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా హైదరాబాద్ మహానగరంలోని మరో 11 పర్యాటక, జనరద్దీ గల ప్రాంతాల్లో ఉచిత వై ఫై సేవల విస్తరణకు బీఎస్‌ఎన్‌ఎల్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే 20 ప్రాంతాల్లో ఉచిత వై ఫై సేవలు అందిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్... డిసెంబర్ 31 లోగా పూర్తి స్థాయిలో ఉచిత వై ఫై సేవలను విస్తరించాలని నిర్ణయించింది. హాట్ స్పాట్స్ లో ఉచిత వై ఫై సేవల ద్వారా ప్రతి రోజు 80 నుంచి 100 జీబీ వరకు డాటా వినియోగమవుతోంది. చార్మినార్ వద్ద అత్యధికంగా వినియోగమవుతుండగా, ప్రతిరోజు సుమారు రెండు వేల మంది వరకు ఉచిత సేవలను వినియోగిస్తున్నట్లు అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
ఇటీవల ఒక సోషల్ మీడియా నిర్వహించిన సర్వేలో బీఎస్‌ఎన్‌ఎల్ సేవలకు బెస్ట్ రేటింగ్ లభించింది. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు మరింత ఉత్సాహంతో ఉచిత వై ఫై సేవల విస్తరణ పనులను వేగవంతం చేశారు. ప్రస్తుతం మూడు రకాలుగా హాట్ స్పాట్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న సౌలభ్యం మేరకు స్మాల్, మీడియం, లార్జ్ హాట్‌స్పాట్‌ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. ఒక్కో హాట్‌స్పాట్‌కు ఐదు వైఫై టవర్స్, ఒక్కో టవర్ ఐదు నుంచి పది కిలో మీటర్ల మేర సేవలు అందించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం పది కిలోమీటర్లకు ఒక జోన్‌గా పరిగణిస్తున్నారు.
వారంలోగా జూపార్క్‌లో సేవలు
పర్యాటక ప్రాంతామైన నెహ్రూ జూ పార్క్, గోల్కొండ ఖిల్లా, జనరద్దీ ప్రాంతాలైన కోఠి బస్ టర్మినల్, ఐటీ కారిడార్, హైటెక్ ఎగ్జిబిషన్, శిల్పారామం, శిల్పా కళా వేదిక, నిమ్స్ స్పెషాలిటీ బ్లాక్‌లలో ఉచిత వైఫై కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీఎస్‌ఎన్‌ఎల్ నిర్ణయించింది. ఇందులో హైటెక్ ఎగ్జిబిషన్‌లో రెండు, గోల్కొండ ఖిల్లాలో నాలుగు చొప్పున వైఫై కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కాగా, వారం రోజుల్లో జూపార్క్‌లో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి తెస్తామని సంబంధిత అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
నెలలో మూడుసార్లు ఉచితం..
బీఎస్‌ఎన్‌ఎల్ హాట్‌స్పాట్స్‌లో వైఫై సేవలను వినియోగదారులు ఒక మొబైల్ ద్వారా నెలకు మూడుసార్లు 30 నిమిషాల చొప్పున ఉచితంగా వినియోగించవచ్చు. ఆ తర్వాత ఓచర్ బేస్ట్ సర్వీసెస్, ఈ-ఓచర్ బేస్డ్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. ఈ ఓచర్స్ కోసం డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను వినియోగించవచ్చు. ఈ సర్వీసులను తక్కువ రేట్లలో బీఎస్‌ఎన్‌ఎల్ అందుబాటులో ఉంచింది. ఒక్క రోజు 4 జీబీ సేవలకు రూ. 140 మాత్రమే. ఒక బ్రాడ్‌బ్యాండ్ లో ఆయితే 4 జీబీలకు రూ. 500 వరకు వెచ్చించాల్సి ఉంటుంది. వోచర్ బేస్డ్ సర్వీసులు రూ. 30లకు 30 నిమిషాలు, రూ.60 లకు 60 నిమిషాలు, రూ.90లకు 120 నిమిషాలు, రూ. 150 లకు ఒక రోజు పూర్తిగా వినియోగించవచ్చు.