హాట్..హాట్‌స్పాట్!
ఫ్రీ వై–ఫైకి జై కొడుతున్న హైదరాబాదీలు
- సినిమాలు, అశ్లీల సైట్లు చూసేవారే ఎక్కువ..!
- సగటున రోజుకు 300 ఎంబీ డేటా వినియోగం
- ప్రస్తుతం 43 చోట్ల ఏర్పాటు.. త్వరలో మరో 240 హాట్‌స్పాట్‌లు
హాట్‌స్పాట్.. ఉచిత వై–ఫై.. ప్రస్తుతం హైదరాబాదీలను ఆకర్షిస్తున్న విషయాలివీ. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ గ్రేటర్ మహానగరంలోని 43 ప్రాంతాల్లో 113 వై–ఫై హాట్‌స్పాట్ పరికరాలను ఏర్పాటు చేసింది. ఈ 43 చోట్ల హైదరాబాదీలు ఇప్పుడు ఉచితంగా వై–ఫై సేవలను పొందుతున్నారు. తొలి 15 నిమిషాల పాటు ఈ వై–ఫై సేవలు ఉచితంగా అందుతాయి. ఆ తర్వాత వై–ఫై సేవలను వినియోగించేందుకు ప్రతి అరగంటకు రూ.30 చార్జీ అవుతుంది.
– సాక్షి, హైదరాబాద్
సినిమాలు.. అశ్లీల సైట్లే అధికం..
ప్రస్తుతం ఉచిత వై–ఫై వినియోగానికి గ్రేటర్ సిటిజన్లు జై కొడుతున్నారు. 43 ఫ్రీ వై–ఫై హాట్‌స్పాట్స్ వద్ద ఎక్కవ మంది సినిమాలు, పాటలు వంటి వినోదాన్ని పంచే కార్యక్రమా లను వీక్షించేందుకు యూట్యూబ్ లాంటి సైట్లను ఆశ్రయిస్తున్నారట. ఇక కొంతమంది కుర్రకారు ఉచిత వై–ఫై లభిస్తున్న తొలి 15 నిమిషాల్లో అశ్లీల, పోర్న్‌సైట్లను వీక్షించేందుకు మక్కువ చూపుతున్నారట. మరికొందరు బస్సు, రైళ్ల వేళలు, రిజర్వేషన్ల వివరాలను ఆన్‌లైన్‌లో తెలుసుకుంటున్నారట. ఇక ఉచిత డేటా వినియోగంలో గ్రేటర్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, బస్‌స్టేషన్లు అగ్రభాగాన నిలిచాయి. డేటా వినియోగంలో ట్యాంక్‌బండ్, నక్లెస్‌రోడ్, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, లుంబినీపార్క్, జూబ్లీ బస్‌స్టేషన్ ప్రాంతాలు తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. ఇక గోల్కొండ కోట, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, జూపార్క్ వంటి పర్యాటక స్థలాల్లో ఉచిత వై–ఫై హాట్‌స్పాట్స్‌కు మాంచి డిమాండ్ ఉంది. ఆయా ప్రాంతాల్లో ఒక్కోక్కరు సగటున నిత్యం సుమారు 300 ఎంబీ డేటాను వినియోగించుకుంటున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్ వర్గాలు తెలిపాయి.
త్వరలో మరిన్ని ప్రాంతాల్లో..
నగరంలో ఇప్పటికే 43 చోట్ల హాట్‌స్పాట్ పరికరాలు ఏర్పాటు చేయగా.. మూడు నెలల్లో మరో 240 ప్రాంతాల్లో హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేయాలని బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ నిర్ణయించింది. కాగా, నగరవ్యాప్తంగా వై–ఫై సేవల విస్తరణకు ప్రభుత్వం నుంచి అనుమతుల జారీ ఆలస్యమవుతుండడం, వాణిజ్య ప్రకటనలు, ఉచిత విద్యుత్ కనెక్షన్, రోడ్ కటింగ్ అనుమతులను మంజూరు చేస్తూ జీవో జారీ చేయడంలో మీనమేషాలు లెక్కిస్తుండడంతో ఈ పనులు ఆలస్యమవుతున్నాయి. కాగా, ఒకేసారి వందలాది మంది వై–ఫై సేవలు పొందేందుకు ప్రయత్నిస్తుండటంతో వారికి నిరాశే ఎదురవుతోంది. స్పీడ్ తగ్గుతోందని, ఒక్కోసారి వై–ఫై కనెక్ట్‌కావడం లేదని నక్లెస్‌రోడ్ వద్ద వై–ఫై సేవలు వినియోగిస్తున్న పలువురు ‘సాక్షి’కి తెలిపారు. హాట్‌స్పాట్ పరికరాల సామర్థ్యాన్ని పెంచాలని కోరుతున్నారు.