
గ్రామ పంచాయతీ నిర్మాణం
గ్రామ పంచాయతీ.. మూడంచెల వ్యవస్థలో మొదటి అంచె. రాష్ట్రంలో ఉన్న జనాభా మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్, జిల్లా కలెక్టర్లు.. గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తారు. సాధారణంగా 300 మందికి తగ్గకుండా జనాభా ఉన్న గ్రామాల్లో ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేస్తారు.
గ్రామపంచాయతీ నిర్మాణం కింది విధంగా ఉంటుంది.
గ్రామసభ
వార్డు సభ్యులు
కోఆప్టెడ్ సభ్యులు
శాశ్వత ఆహ్వానితులు
సర్పంచ్, ఉప సర్పంచ్
పంచాయతీ కార్యనిర్వహణాధికారి/సెక్రటరీ.
గ్రామసభ
గ్రామసభను పంచాయతీ వ్యవస్థకు ఆత్మగా, హృదయంగా, స్థానిక శాసనసభగా వర్ణిస్తారు.
ప్రతి పంచాయతీలో గ్రామసభ ఉంటుంది.
గ్రామంలోని ఓటర్లందరూ దీనిలో సభ్యులుగా ఉంటారు.
గ్రామసభ సంవత్సరానికి కనీసం రెండు పర్యాయాలు సమావేశం కావాలి. గరిష్ట సమావేశాలకు పరిమితి లేదు.
ఏటా ఏప్రిల్ 14న, అక్టోబర్ 3న తప్పకుండా సమావేశం నిర్వహించాలి. అదేవిధంగా జనవరి 2, జూలై 4న కూడా జరపాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నాలుగు సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
గ్రామ సభకు సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. రెండు పర్యాయాలు గ్రామసభ సమావేశాలు నిర్వహించకపోతే సర్పంచ్ తన పదవిని కోల్పోతారు. తిరిగి సంవత్సరం వరకు ఎన్నికకు అర్హులు కాదు.
ఓటు హక్కు కలిగిన వారిలో 50 మంది లేదా 10 శాతం మంది ప్రజలు కోరితే గ్రామసభ సమావేశం నిర్వహించాలి.
గ్రామసభకు సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు.
గ్రామసభ విధులు
గ్రామ పంచాయతీకి సంబంధించిన పరిపాలన, ఆడిట్ నివేదికలను ఆమోదించడం.
గ్రామ పంచాయతీ అభివృద్ధి; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు.
బడ్జెట్‌లో ఆమోదించాల్సిన అంశాలను సూచించడం.
పన్ను బకాయిదారుల జాబితా రూపొందించడం.
సమాజాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో ద్రవ్య, వస్తు సంబంధమైన విరాళాలు సేకరించడం, అన్ని వర్గాల మధ్య శాంతి ఐక్యతా భావాలను పెంపొందించేందుకు కృషి చేయడం.
వార్డు సభ్యులు/ పంచాయతీ సభ్యులు
గ్రామాన్ని జనాభా ప్రాతిపదికపై వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డు నుంచి ఒక సభ్యుడు ఎన్నికవుతాడు. వీరిని ఓటర్లు ఐదేళ్ల కాలానికి ఎన్నుకుంటారు. పార్టీ రహితంగా ఎన్నికలను నిర్వహిస్తారు. ఒక సభ్యుడు ఒకటి కంటే ఎక్కువ వార్డుల నుంచి పోటీ చేయడానికి వీల్లేదు. ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్‌తో కలిపి కనిష్టంగా 5, గరిష్టంగా 21 మంది వరకు సభ్యులు ఉంటారు.
వార్డుల విభజన గ్రామ జనాభాను బట్టి కింది విధంగా ఉంటుంది.
300 వరకు జనాభా ఉంటే 5 వార్డులు
300–500 వరకు 7 వార్డులు
500–1500 వరకు 9 వార్డులు
1500–3000 వరకు 11 వార్డులు
3000–5000 వరకు 13 వార్డులు
5000–10,000 వరకు 15 వార్డులు
10,000–15,000 వరకు 17 వార్డులు
15,000 పైన 19 నుంచి 21 వార్డులు
కోఆప్టెడ్ సభ్యులు
గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి స్వయం సహాయక బృందం నుంచి ఒక ప్రతినిధిని కోఆప్టెడ్ సభ్యుడిగా ఎంపిక చేసుకోవచ్చు. వీరు సమావేశాల్లో పాల్గొనవచ్చు. అయితే వీరికి తీర్మానాలపై ఓటు చేసే అధికారం ఉండదు.
శాశ్వత ఆహ్వానితులు
మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు (ఎంపీటీసీ) శాశ్వత ఆహ్వానితుడిగా చర్చలో పాల్గొనవచ్చు. కానీ తీర్మానాలపై ఓటు వేసే అధికారం ఉండదు.
గ్రామ పంచాయతీ సమావేశం – కోరం
సర్పంచ్ కనీసం నెలకొకసారి అయినా పంచాయతీ సమావేశం నిర్వహించాలి. అవసరం అనుకుంటే ఎన్ని సమావేశాలైనా నిర్వహించవచ్చు.
90 రోజుల లోపు తిరిగి సమావేశం నిర్వహించకపోతే పంచాయతీ కార్యదర్శిపై క్రమశిక్షణ చర్య తీసుకుంటారు.
సర్పంచ్ 90 రోజుల లోపు తిరిగి సమావేశం నిర్వహించడానికి అనుమతి ఇవ్వకపోతే పంచాయతీ కార్యదర్శే స్వయంగా సమావేశం ఏర్పాటు చేయొచ్చు.
గ్రామ పంచాయతీ సమావేశాల కోరం 1/3వ వంతుగా నిర్ణయించారు. అయితే కోరం లేకున్నా సమావేశం నిర్వహించవచ్చు.
గ్రామ పంచాయతీ సమావేశాలకు సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. సర్పంచ్ అందుబాటులో లేకపోతే ఉప సర్పంచ్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. ఒకవేళ ఇద్దరూ హాజరు కాకపోతే ఒక సభ్యుడిని సభకు అధ్యక్షుడిగా నియమించవచ్చు.
గ్రామ పంచాయతీ సమావేశాల్లో కింది సభ్యులు పాల్గొంటారు.
గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు
గ్రామ పంచాయతీ కోఆప్టెడ్ సభ్యుడు
మండల పరిషత్ కోఆప్టెడ్ సభ్యుడు.
గ్రామ సర్పంచ్
గ్రామ పంచాయతీ అధిపతిని సర్పంచ్ లేదా అధ్యక్షుడు అంటారు. సర్పంచ్‌ను ప్రత్యక్ష పద్ధతిలో ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు. సర్పంచ్ పదవీ కాలం ఐదేళ్లు. సర్పంచ్‌గా పోటీ చేయడానికి కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి.
రాజీనామా, తొలగింపు, పదవిలో ఖాళీలు
సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. అయితే అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడిన సర్పంచ్‌ను జిల్లా కలెక్టర్ తొలగిస్తారు.
గ్రామసభ సమావేశాలను ఏడాదిలో కనీసం రెండు పర్యాయాలు నిర్వహించకపోతే సర్పంచ్ తన పదవిని కోల్పోతారు.
గ్రామ పంచాయతీ ఆడిట్ పూర్తి చేయనప్పుడు కూడా పదవిని కోల్పోతారు.
సర్పంచ్ తన రాజీనామా విషయంలో గ్రామ పంచాయతీకి నోటీసు ఇచ్చి పదవికి రాజీనామా చేయవచ్చు. అయితే గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించడానికి వీలు లేనప్పుడు జిల్లా పంచాయతీ అధికారికి తన రాజీనామా పత్రాన్ని సమర్పించవచ్చు.
ఏదైనా కారణం వల్ల సర్పంచ్ పదవి ఖాళీ అయితే నాలుగు నెలల లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.
సర్పంచ్ విధులు
పంచాయతీ, గ్రామసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. పంచాయతీ ఆమోదించిన తీర్మానాల విషయంలో నియంత్రణాధికారం ఉంటుంది.
ఉప సర్పంచ్ పదవికి ఎన్నిక నిర్వహిస్తారు.
ఉప సర్పంచ్ పదవి ఖాళీ అయితే 30 రోజుల లోపు ఉప ఎన్నిక ఏర్పాటు చేస్తారు.
గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేయవచ్చు.
గ్రామ పంచాయతీ సిబ్బందిపై పర్యవేక్షణ అధికారం కలిగి ఉంటారు.
గ్రామ పంచాయతీ ఆహార కమిటీ, విద్యా కమిటీ, పారిశుధ్య కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
స్వయం సహాయక సంఘాల సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు.
గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాల మేరకే సర్పంచ్ వ్యవహరించాల్సి ఉంటుంది.
గ్రామ పంచాయతీ సభ్యుల అనర్హతకు సంబంధించిన విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తెస్తారు.
ఉప సర్పంచ్
గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఐదేళ్ల వ్యవధికి ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు. జిల్లా పంచాయతీ అధికారి లేదా ఆయన తరఫున సంబంధిత అధికారి ఈ ఎన్నికను నిర్వహిస్తారు. సర్పంచ్ కూడా ఈ ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. ఉప సర్పంచ్‌గా ఎన్నికవ్వాలంటే వార్డు సభ్యులై ఉండాలి. ఉప సర్పంచ్‌ను అవిశ్వాస తీర్మానం ద్వారా వార్డు సభ్యులు తొలగించవచ్చు.
రాజీనామా, తొలగింపు, పదవిలో ఖాళీలు: ఉప సర్పంచ్ తన రాజీనామా పత్రాన్ని మండల పరిషత్తు అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)కి సమర్పిస్తారు.
అవిశ్వాస తీర్మానం: ఉప సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. అయితే పదవి చేపట్టిన నాలుగేళ్ల వరకు ఎటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి వీల్లేదు. అవిశ్వాస తీర్మాన నోటీసుపై సగానికి తక్కువ కాకుండా సభ్యులు సంతకాలు చేసి రెవెన్యూ డివిజన్ అధికారికి సమర్పించాలి. 15 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలి. మొత్తం సభ్యుల్లో 2/3 వంతు తక్కువ కాకుండా ఆమోదిస్తే ఉపసర్పంచ్‌ను తొలగి స్తారు. సస్పెండ్ అయిన సభ్యులకు కూడా ఈ సమయంలో ఓటు హక్కు ఉంటుంది.
అధికారాలు: సర్పంచ్ లేని సమయంలో ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీకి అధ్యక్షత వహిస్తారు. ఆ సమయంలో సర్పంచ్‌కి ఉన్న అన్ని అధికార విధులు ఉప సర్పంచ్‌కు ఉంటాయి.