319 ఈ-పంచాయతీలు | e- panchayth's know in gram panchayath | Sakshi
Sakshi News home page

319 ఈ-పంచాయతీలు

Published Mon, Aug 11 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM

319 ఈ-పంచాయతీలు

319 ఈ-పంచాయతీలు

 గ్రామాల్లో ఆన్‌లైన్ పాలన
- పనులు వేగవంతం... పారదర్శకత
- ఇప్పటికే 26 పంచాయతీల్లో అమలవుతున్న ఆన్‌లైన్
- 173 మంది డేటా ఆపరేటర్లకు శిక్షణ
- పల్లెలకు చేరిన కంప్యూటర్లు

 కరీంనగర్ సిటీ : గ్రామపంచాయతీల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పరిపాలనకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి గ్రామ స్వరూపాలను మార్చేందుకు నడుం కట్టింది. అవినీతి నిర్మూలన, వేగవంతమైన పాలన అందించేందుకు ఇంటర్నెట్‌తో అనుసంధానం చేస్తూ ఈ-పంచాయతీలకు రూపకల్పన చేసిన ప్రభుత్వం ఈ-సేవలను మరింత విస్తరించనుంది. పరిమిత సంఖ్యలో ఉన్న ఈ-పంచాయతీలను పూర్తిస్థాయి విస్తరించేందుకు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా
 ప్రకటించింది.
 
ఈ-పంచాయతీ అంటే...
ఆన్‌లైన్ విధానంలో పరిపాలనను కొనసాగించే పద్ధతినే ఈ-పంచాయతీ అంటారు. గ్రామానికి సంబంధించిన అన్ని విభాగాలను ఆన్‌లైన్‌లోకి  తీసుకువచ్చి, పారదర్శకపాలనను అందించడం ప్రధాన లక్ష్యం. పన్నులు, వేలం తదితర మార్గాల ద్వారా గ్రామాలకు వచ్చే ఆదాయం, రోడ్లు, తాగునీటి సరఫరా, వీధిదీపాలు తదితర ప్రజల అవసరాల కోసం వెచ్చించిన ఖర్చు వివరాలు, వివిధ రకాల పింఛన్ల చెల్లింపు, ధ్రువీకరణ పత్రాలు ఇలా మొత్తం వివరాలను ఆన్‌లైన్‌లో సమగ్రంగా పొందుపరుస్తారు.

ఒక్క క్లిక్‌తో గ్రామపంచాయతీ ఆదాయం, వ్యయం, పనుల వివరాలు కంప్యూటర్‌లో ప్రత్యక్షమవుతాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతోపాటు మీసేవలో లభించే సేవలను కూడా త్వరలోనే ఈ-పంచాయతీల ద్వారా అందించనున్నారు. ఎంపిక చేసిన క్లస్టర్ గ్రామపంచాయతీలను ఈ-పంచాయతీలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘కార్వీ’ డేటా మేనేజ్‌మెంట్‌కు బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వం, కార్వీ కంపెనీలు కలిపి ఈ-పంచాయతీల నిర్వహణను చేపట్టనున్నాయి. పంచాయతీలవారీగా ప్రత్యేక ‘ఐడీ’ ‘పాస్‌వర్డ్’ రూపొందిస్తారు.

ప్రస్తుతానికి కంపెనీ 173 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించగా, ఎంపిక చేసిన గ్రామాల్లో వారు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దీనికోసం డేటా ఎంట్రీ ఆపరేటర్లకు తిమ్మాపూర్ మండలంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. లోకల్ గవర్నమెంట్ డెరైక్టరీ, ఏరియా చా ప్రొఫైలర్, నేషనల్ పంచాయతీ పోర్టల్ అప్లికేషన్స్, ప్రియా సాఫ్ట్, ప్లాన్‌ప్లస్, యాక్షన్ సాఫ్ట్, యూనిఫైడ్ బర్త్, డెత్ అప్లికేషన్స్‌తోపాటు ఇతర అప్లికేషన్స్‌పై ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు.
 
ఇప్పటికే చేరిన కంప్యూటర్లు
ఈ-పంచాయతీలను క్లస్టర్ల వారీగా ఏర్పాటుచేయనున్నారు. జనాభా ఆధారంగా ఒకటి, రెండు లేదా మూడు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తారు. జిల్లాలో 1207 గ్రామపంచాయతీలు ఉండగా, జిల్లా అధికారులు 621 క్లస్టర్ పంచాయతీలను గుర్తించారు. డివిజన్, మండలాలవారీగా క్లస్టర్ గ్రామపంచాయతీల వివరాలను అధికారులు ఇప్పటికే వెల్లడించారు. వీటిలోంచి 319 క్లస్టర్  గ్రామాలను ఈ-పంచాయతీలుగా ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో ఈ-పంచాయతీ విధానం అమలులోకి తీసకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

చందుర్తి, కాటారం, మహదేవపూర్, సారంగాపూర్ లలో ఒక్కోటిగా మండల కేంద్రాలనే ఎంపిక చేయగా, మానకొండూరు మండలంలో అత్యధికంగా 13 క్లస్టర్ గ్రామాలను ఎంపిక చేశారు. జిల్లాలో ఇప్పటికే 26 గ్రామపంచాయతీల్లో ఈ-పంచాయతీ సేవలు అందుతున్నాయి. ముల్కనూరు, చొప్పదండి, ధర్మపురి, గంభీరావుపేట, గంగాధర, హుస్నాబాద్, హుజూరాబాద్, ఇబ్రహీంపట్నం, బండలింగాపూర్, జమ్మికుంట, కమలాపూర్, ఉప్పల్, కొత్తపల్లి, కొడిమ్యాల, కోరుట్ల, మల్లాపూర్, మల్యాల, మంథని, మెట్‌పల్లి, ముస్తాబాద్, పెద్దపల్లి, రాయికల్, పాలకుర్తి, సుల్తానాబాద్, వేములవాడ, ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీల్లో ఇప్పటికే ఈ-పంచాయతీ విధానం అమలులో ఉంది.

పాతవి 26, కొత్తవి 319 కలిపి మొత్తం 345 గ్రామపంచాయతీలు ప్రస్తుతానికి ఈ-పంచాయతీ పరిధిలోకి రానున్నాయి. ఇందుకు అవసరమైన కంప్యూటర్లు ఇప్పటికే జిల్లాకు చేరాయి. 319 గ్రామాలకు 319 కంప్యూటర్లు రాగా, జిల్లా ప్రజాపరిషత్‌కు రెండు, 57 మండల పరిషత్ కార్యాలయాలకు, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ డీఎల్పీవోలకు ఒక్కోటి చొప్పున  మూడు, జిల్లా పంచాయతీ కార్యాలయానికి రెండు కంప్యూటర్లను కార్వీ కంపెనీ అందజేసింది.
 
వేగవంతం... పారదర్శకత
రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారకరామారావు పదిరోజుల క్రితం జెడ్పీ హాల్‌లో నిర్వహించిన కరీంనగర్ మండల ప్రణాళికలో ఈ పంచాయతీలను విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఆయన ప్రకటించడంతో ఇప్పుడు విస్తరించిన సేవలతోపాటు మరికొన్ని రోజుల్లోనే జిల్లా మొత్తం ఈ పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. ఈ-పంచాయతీలతో ఆయా గ్రామాల్లో ప్రజలకు పరిపాలనాపరంగా మెరుగైన సేవలు అందనున్నాయి. ఆన్‌లైన్ తో పనులు వేగంగా సాగడంతోపాటు అవినీతికి తావులేని పారదర్శక పాలన అందనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement