సాక్షి, బెంగళూరు : మరుగుదొడ్డి నిర్మాణాన్ని ప్రభుత్వాధికారులు నిలిపివేయడంతో ఒక మహిళ ఆత్మహత్యాయత్నానికి దిగింది. ఈ ఘటన కర్నాటకలో సంచలనం సృష్టిస్తోంది. కర్నాటకలోని దావణగెరె జిల్లాలోని ఒక మారుమూల పల్లెటూరులో.. ఒక కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకుంటోంది. ఇందుకు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా నిధులు కూడా విడుదలయ్యాయి. మొదట్లో నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిన గ్రామ పంచాయితీ తరువాత.. సరైన పత్రాలు లేవని నిర్మాణాన్ని నిలిపివేసింది.
టాయిలెట్ నిర్మాణాన్ని గ్రామపంచాయితీ అధికారులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన మహిళ ఒంటిమీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అనూహ్య ఘటనతో గ్రామపంచాయితీ అధికారులు అక్కడనుంచి పరారయ్యారు. చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.
ఈ ఘటనపై దావణగెరె జిల్లా ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ప్రభుత్వం చెబుతుంటే.. నిర్మాణంలో ఉన్న టాయిలెట్‌ని ఆపడమేంటని జిల్లా అధికారులు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనకు కారణమైన 14 మంది గ్రామ పంచాయితీ అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment