ఝాబువా : గ్రామాలలో కుల, తెగ పెద్దల పంచాయితీలు విధించే దారుణ శిక్షలు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ గిరిజన మహిళకు భర్తను మోసుకుని పరిగెత్తాలంటూ శిక్ష విధించగా.. అందుకు కారణమైన వారిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.
భిల్లా తెగ ఎక్కువగా నివసించే ఝాబువా జిల్లా ఖేడి గ్రామంలో పది రోజుల క్రితం వివాహిత అయిన ఆ గిరిజన మహిళ మరో గిరిజన వ్యక్తితో వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆమె వెనక్కి రాగా.. పంచాయితీ పెద్దలు కలుగజేసుకుని ఆ భర్తకు సర్దిచెప్పి పంపారు. అయితే ఆమె చేసిన తప్పు కోసం కఠిన శిక్ష విధించాల్సిందేనంటూ భర్త, అతని తరపు బంధువులు ఆమెను అందరి సమక్షంలో చితకబాదారు. ఆపై పంచాయితీ పెద్దలు రెండు కిలో మీటర్లు భర్తను మోస్తూ పరిగెత్తాలంటూ ఆ మహిళకు శిక్ష విధించారు.
ఆమె అలా పరిగెడుతున్న సమయంలో భుజాలపై ఉన్న భర్తతోపాటు గ్రామస్తులు కూడా ఆమెను కొట్టడం వీడియోలో చూడొచ్చు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మరిది, మామయ్యతోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి.. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment