punishment to wife
-
తప్పు చేసిందని భార్యకు దారుణ శిక్ష
ఝాబువా : గ్రామాలలో కుల, తెగ పెద్దల పంచాయితీలు విధించే దారుణ శిక్షలు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ గిరిజన మహిళకు భర్తను మోసుకుని పరిగెత్తాలంటూ శిక్ష విధించగా.. అందుకు కారణమైన వారిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. భిల్లా తెగ ఎక్కువగా నివసించే ఝాబువా జిల్లా ఖేడి గ్రామంలో పది రోజుల క్రితం వివాహిత అయిన ఆ గిరిజన మహిళ మరో గిరిజన వ్యక్తితో వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆమె వెనక్కి రాగా.. పంచాయితీ పెద్దలు కలుగజేసుకుని ఆ భర్తకు సర్దిచెప్పి పంపారు. అయితే ఆమె చేసిన తప్పు కోసం కఠిన శిక్ష విధించాల్సిందేనంటూ భర్త, అతని తరపు బంధువులు ఆమెను అందరి సమక్షంలో చితకబాదారు. ఆపై పంచాయితీ పెద్దలు రెండు కిలో మీటర్లు భర్తను మోస్తూ పరిగెత్తాలంటూ ఆ మహిళకు శిక్ష విధించారు. ఆమె అలా పరిగెడుతున్న సమయంలో భుజాలపై ఉన్న భర్తతోపాటు గ్రామస్తులు కూడా ఆమెను కొట్టడం వీడియోలో చూడొచ్చు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మరిది, మామయ్యతోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి.. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. -
భర్త నేరం చేస్తే...భార్యకు శిక్షా?
రియాద్: ఇంట్లో తాను లేనప్పుడు భర్త పుంగవుడు పని మనిషితో నెరపుతున్న సరస శృంగారాన్ని ఓ సౌదీ మహిళ రహస్య కెమెరాతో రికార్డుచేసి దాన్ని సోషల్ మీడియా ‘యూట్యూబ్’లో పోస్ట్ చేసింది. అసలే సోషల్ మీడియాపై ఆగ్రహం వెళ్లగక్కుతున్న సౌదీ ప్రభుత్వానికి ఇది చూసి మరింత చిర్రెత్తుకొచ్చింది. వెంటనే దాన్ని తొలగించాల్సిందిగా స్థానిక అధికారులను ఆదేశించింది. భర్త పరువు తీసినందుకు ఏడాది పాటు జైలు శిక్ష లేదా దాదాపు 87 లక్షల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఓ ప్రముఖ సౌదీ న్యాయవాది ఇప్పటికే ఆ సౌదీ మహిళను హెచ్చరించారు. సదరు సౌదీ మహిళకు భర్త ప్రవర్తనపై ఎప్పటి నుంచో అనుమానం ఉంది. తాను లేనప్పుడు పని మనిషులతో సరస సల్లాపాలు సాగిస్తాడని అనుకుంది. ఓ రోజున కిచెన్‌కు సమీపంలో రహస్యంగా ఓ వీడియో కెమెరాను ఏర్పాటు చేసింది. కిచెన్ లోపల ఓ పనిమనిషి సంచరిస్తుండగా, కిచెన్ డోర్ పక్కన మరో పనిమనిషిని భర్త దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడం, ఆ అమ్మాయి తప్పించుకోవడానికి ప్రయత్నించడం ఆ వీడియోలో రికార్డు అయింది. ‘ఈ నేరానికి కనీస శిక్ష విధించాలి’ అన్న శీర్షికతో ఆ వీడియో క్లిప్పింగ్‌ను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది భార్య. 12 గంటల్లోపే 25 వేల మంది దీన్ని షేరు చేసుకున్నారు. మొబైల్ లేదా ఇతర కెమెరాల ద్వారా ఎవరి వ్యక్తిగత అంశాలనైనా రికార్డుచేసి పదిమందిలో వారి పరువు తీయడం స్థానిక సమాచార సాంకేతిక చట్టాల ప్రకారం పెద్ద నేరమని న్యాయవాది మజీద్ ఖరూబ్ స్థానిక మీడియాతో వ్యాఖ్యానించారు. భార్యలతో కాకుండా ఇతరులతో శారీరక సంబంధాలు పెట్టుకోవడం సౌదీ అరేబియాలో ఇంతకన్నా పెద్ద నేరం. నేరం రుజువైన పక్షంలో మరణ శిక్ష విధిస్తారు.