భర్త నేరం చేస్తే...భార్యకు శిక్షా?
రియాద్: ఇంట్లో తాను లేనప్పుడు భర్త పుంగవుడు పని మనిషితో నెరపుతున్న సరస శృంగారాన్ని ఓ సౌదీ మహిళ రహస్య కెమెరాతో రికార్డుచేసి దాన్ని సోషల్ మీడియా ‘యూట్యూబ్’లో పోస్ట్ చేసింది. అసలే సోషల్ మీడియాపై ఆగ్రహం వెళ్లగక్కుతున్న సౌదీ ప్రభుత్వానికి ఇది చూసి మరింత చిర్రెత్తుకొచ్చింది. వెంటనే దాన్ని తొలగించాల్సిందిగా స్థానిక అధికారులను ఆదేశించింది. భర్త పరువు తీసినందుకు ఏడాది పాటు జైలు శిక్ష లేదా దాదాపు 87 లక్షల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఓ ప్రముఖ సౌదీ న్యాయవాది ఇప్పటికే ఆ సౌదీ మహిళను హెచ్చరించారు.
సదరు సౌదీ మహిళకు భర్త ప్రవర్తనపై ఎప్పటి నుంచో అనుమానం ఉంది. తాను లేనప్పుడు పని మనిషులతో సరస సల్లాపాలు సాగిస్తాడని అనుకుంది. ఓ రోజున కిచెన్‌కు సమీపంలో రహస్యంగా ఓ వీడియో కెమెరాను ఏర్పాటు చేసింది. కిచెన్ లోపల ఓ పనిమనిషి సంచరిస్తుండగా, కిచెన్ డోర్ పక్కన మరో పనిమనిషిని భర్త దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడం, ఆ అమ్మాయి తప్పించుకోవడానికి ప్రయత్నించడం ఆ వీడియోలో రికార్డు అయింది. ‘ఈ నేరానికి కనీస శిక్ష విధించాలి’ అన్న శీర్షికతో ఆ వీడియో క్లిప్పింగ్‌ను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది భార్య. 12 గంటల్లోపే 25 వేల మంది దీన్ని షేరు చేసుకున్నారు. మొబైల్ లేదా ఇతర కెమెరాల ద్వారా ఎవరి వ్యక్తిగత అంశాలనైనా రికార్డుచేసి పదిమందిలో వారి పరువు తీయడం స్థానిక సమాచార సాంకేతిక చట్టాల ప్రకారం పెద్ద నేరమని న్యాయవాది మజీద్ ఖరూబ్ స్థానిక మీడియాతో వ్యాఖ్యానించారు.
భార్యలతో కాకుండా ఇతరులతో శారీరక సంబంధాలు పెట్టుకోవడం సౌదీ అరేబియాలో ఇంతకన్నా పెద్ద నేరం. నేరం రుజువైన పక్షంలో మరణ శిక్ష విధిస్తారు.