యథా రాజా.. తథా ప్రజా.. అన్నట్లు.. ఇంటి వాతావరణం ఆధ్యాత్మిక భావాలతో నిండి ఉంటే, ఆ ఇంట పుట్టిన యువతరం కూడా ఆ దారినే అనుసరిస్తారు. అందుకు చక్కటి ఉదాహరణే కొమాండూరు ప్రజ్ఞ రాఘవన్. తమిళ వైష్ణవులైన ఐటీ ఉద్యోగి కోమాండూరు రాఘవన్, భార్గవి దంపతుల మొదటి సంతానం ప్రజ్ఞ రాఘవన్. ఈమె పల్లవి మోడల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది.
13 ఏళ్ల చిన్నారి మూడేళ్ల ప్రాయం నుంచే నాయనమ్మ కొమాండూరు నళిని శ్రీనివాసన్ ప్రోత్సాహంతో భక్తి శ్లోకాలను చక్కటి ఉచ్ఛరణతో అలవోకగా పాడడం నేర్చుకుంది. తమిళులకు అతి పవిత్రమైన ధనుర్మాసంలో ప్రతిరోజూ తిరుప్పావై పాశురాలు పాడడం ఆనవాయితీ. నాయనమ్మ, తల్లిదండ్రులు క్రమం తప్పకుండా పాటించే ఈ తిరుప్పావై పారాయణం..ఆ అండాళ్ తల్లి అనుగ్రహంతో పుట్టిందని భావించే ప్రజ్ఞకు సహజంగానే అలవడింది.
జన్మతః తమిళులైనా, ప్రాంతీయ భాష అయిన తెలుగుపై ఉన్న గౌరవంతో, నాయనమ్మ నేర్పిన తెలుగు పాఠాలు, ప్రజ్ఞ తెలుగు ఉచ్ఛరణకు మరింత మెరుగులు దిద్దేలా చేశాయి. ఇది గమనించిన తండ్రి రాఘవన్ ప్రజ్ఞ చేత తిరుప్పావై పాశురాలను పాడించి, తన పేరుతో ప్రారంభించిన ‘యువర్స్ ప్రజ్ఞ’ అనే యూట్యూబ్ ఛానల్‌లో మూడు సంవత్సరాలుగా ధనుర్మాసం 30 రోజులు ప్రసారం చేస్తూ వస్తున్నారు. తిరుప్పావైకి సంబంధించి తండ్రి సేకరించి పొందుపరిచిన వ్యాఖ్యానాన్ని భావయుక్తంగా, స్వచ్ఛమైన పదోచ్ఛారణతో ప్రవచన శైలిలో అందిస్తోంది.
పేరుకు తగ్గ ‘ప్రజ్ఞ’..
ప్రజ్ఞ ప్రవచన తీరు చూస్తే పేరుకు తగ్గ ప్రజ్ఞా పాటవాలు చూపుతోంది అని ఎందరో పెద్దల కొనియాడారు. ఈ ఏడాది రాఘవన్ తమిళ పాశురాలను తెలుగులో పాట శైలిలో చేసిన అనువాదాన్ని తన వాక్పటిమతో, పాశుర భావానికి తగినట్లు అందరికీ అర్థమయ్యేలా వ్యాఖ్యానించి తెలుగు భాషాభిమానులు, ఆధ్యాత్మికవేత్తల నుంచి రెట్టింపు ప్రశంసలు పొంది శభాష్ అనిపించుకుంది.
ప్రతిభను గుర్తించిన సుబ్బు మ్యూజికల్ అకాడమీ అధ్యక్షులు శ్రీధరం రామ సుబ్రహ్మణ్యం ఈ నెల 12న నిర్వహించిన సంగీత విభావరిలో గౌరవ అతిథి కొమరవోలు శ్రీనివాసరావు, నరేష్‌కుమార్ ప్రజ్ఞను జ్ఞాపికతో సత్కరించారు. ప్రజ్ఞ సంగీత విభావరులలో గాయకుడైన తండ్రి రాఘవన్‌తో పలు కార్యక్రమాల్లో, సినీ సంగీతంలోనూ శ్రోతలను ఆకట్టుకోవడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment