నాలుగేసి పంచాయతీలకు ‘ఒకే ఒక్కడు’ | Secretaries Posts Empty in Gram Panchayat! | Sakshi
Sakshi News home page

నాలుగేసి పంచాయతీలకు ‘ఒకే ఒక్కడు’

Published Mon, Dec 28 2015 4:11 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 PM

నాలుగేసి పంచాయతీలకు ‘ఒకే ఒక్కడు’

నాలుగేసి పంచాయతీలకు ‘ఒకే ఒక్కడు’

* రాష్ట్రంలో మూడు వేలకు పైగా కార్యదర్శుల పోస్టులు ఖాళీ
* ఇన్‌చార్జి అధికారులతో కుంటుపడుతున్న గ్రామాల అభివృద్ధి

సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో పరిపాలన కుంటుపడుతోంది. అభివృద్ధి ప్రణాళికలు అటకెక్కుతున్నాయి. గ్రామాభివృద్ధి పనుల గురించి ఒకప్పుడు గ్రామ సర్పంచ్ చుట్టూ ఆ గ్రామానికి చెందిన అధికారులు (కార్యదర్శి, వీఆర్వో..తదితరులు) తిరిగేవారు. అయితే.. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. గ్రామ కార్యదర్శి ఎక్కడున్నాడోనని సర్పంచులు వెదుక్కొని ఫైళ్లపై సంతకాల కోసం వారి వద్దకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.

రాష్ట్రవ్యాప్తంగా 8,685 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో 3,600 గ్రామ పంచాయతీల్లో కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఆయా గ్రామాలకు పక్కన ఉన్న గ్రామ పంచాయతీల కార్యదర్శులకు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించింది. దీంతో ఒక్కో పంచాయతీ కార్యదర్శి కనిష్టంగా నాలుగేసి గ్రామాలకు, గరిష్టంగా ఏడు గ్రామాలకు పనిచేస్తున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో గ్రామ పంచాయతీలను కార్యదర్శుల కొరత వేధిస్తోంది. ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన గ్రామజ్యోతి పథకం అమలుపైనా ఈ ప్రభావం పడుతోంది.
 
ఏరోజు ఎక్కడుంటారో తెలియదు..
గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఏ రోజు ఏగ్రామంలో ఉంటారో ఎవరికీ అంతుపట్టని పరిస్థితి ఉంది. వారంలో ఏడు రోజులకు గాను ఒక్కోరోజు ఒకో గ్రామంలో పనిచేయాల్సి వస్తోంది. ఒకేరోజు ఆయా గ్రామాల సర్పంచులు సమావేశాలు ఏర్పాటు చేసిన పక్షంలో ఏగ్రామానికి వెళ్లాలో అర్థం కాక పంచాయతీ కార్యదర్శులకు కూడా దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. అంతేకాక. ఉన్నతాధికారులు పిలిచిన పక్షంలో మండల కేంద్రానికో, డివిజన్, జిల్లా కేంద్రాలకో పరుగులు పెట్టాల్సి వస్తోంది.

పలు గ్రామాలకు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించిన ప్రభుత్వం, పంచాయతీ కార్యదర్శులకు ఎటువంటి అలవెన్స్ ఇవ్వడం లేదు. కనీసం టీఏ, డీఏలను కూడా సర్కారు ఇవ్వడం లేదని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే ఖాళీగా ఉన్న కార్యదర్శుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయకపోవడంపై గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  
 
పదోన్నతుల్లోనూ ప్రతిష్టంభన
పంచాయతీరాజ్ విభాగంలో నాలుగు స్థాయి ల్లో(గ్రేడ్ 1,2,3,4) పంచాయతీ కార్యదర్శులుం టారు. ఆయా గ్రామ పంచాయతీల ఆదాయా న్ని బట్టి గ్రేడ్‌లవారీగా కార్యదర్శులను ప్రభుత్వం నియమిస్తోంది. గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులకు ఎక్స్‌టెన్షన్ అధికారులు(ఈవో పీఆర్డీ)గా పదోన్నతులు ఇచ్చే విషయంలో ఎంతోకాలంగా ప్రతిష్టంభన నెలకొంది. 20 ఏళ్లుగా ఎంపీడీవోలకు పదోన్నతులు లేకపోవడంతో ఈవోపీఆర్డీలకూ పదోన్నతులు లభించడం లేదు.

ఫలితంగా అన్ని స్థాయిల్లోనూ పంచాయతీ కార్యదర్శులకు కూడా పదోన్నతులు అందని ద్రాక్షగా మారా యి. గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శులకు ఈవోపీఆర్డీలుగా పదోన్నతులను కల్పిస్తే మరిన్ని పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఇటీవల సర్పంచులు కొందరు.. ఆ విభాగం డెరైక్టర్‌కు విజ్ఞప్తి చేయగా, కార్యదర్శుల నియామకాన్ని ప్రభుత్వం ఆర్థిక భారంగా చూస్తోందని చెప్పినట్లు తెలిసింది.
 
గ్రామజ్యోతి పైనా ప్రభావం!
గ్రామాభివృద్ధి ప్రణాళికలను పంచాయతీ స్థాయిలోనే రూపొందించడం, గ్రామా ల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములుగా చేయడమే లక్ష్యంగా గ్రామజ్యోతి కార్యక్రమాన్ని సర్కారు ప్రారంభించింది. ఆయా రంగాల్లో సమగ్రమైన అభివృద్ధిని సాధించేం దుకు అవసరమైన ప్రణాళికలను గ్రామస్థాయిలోనే రూపొందించాల్సి ఉంది.

ఈ ప్రక్రియంతా పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలోనే జరగాల్సి ఉంది. అయితే కార్యదర్శుల కొరత కారణంగా అభివృద్ధి కమిటీల సమావేశాలు జరగడం లేదు. ఒకవేళ జరిగి నా ప్రణాళికలను ప్రభుత్వానికి పంపడంలోనూ విపరీతమైన జాప్యం జరుగుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement