
విజయవాడ ధర్నా చౌక్‌లో కార్మికుల నిరసన
లేదంటే సమ్మెకు వెనుకాడబోం..
గ్రామ పంచాయతీ కార్మికుల హెచ్చరిక
విజయవాడలో కదం తొక్కిన కార్మికులు
సాక్షి, అమరావతి/గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): తమకు పీఎఫ్, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా అమలు చేయడంతో పాటు కనీస వేతనాలు వర్తింప చేయాలని, అక్రమంగా తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. నెల రోజుల్లోగా తమ న్యాయ మైన డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మెకు వెనుకాడబోమని హెచ్చరించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
గ్రామ పంచాయతీ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కె.ఉమామహేశ్వరరావు మాట్లాడు తూ 1999లో జారీ చేసిన 551 జీవోలోని గుర్తింపు కార్డులు, కనీస వేతనం, పీఎఫ్, ఇఎస్‌ఐ వంటి సౌకర్యాలు 40 వేల మంది పంచాయతీ కార్మికులకు నేటికీ అందడం లేదన్నారు. కనీసం గుర్తింపు కార్డు లు కూడా లేవన్నారు. కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారే గానీ, ప్రతి నెలా జీతాలు చెల్లించకుండా పస్తులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రస్తుతం 4 నుండి 45 నెలల జీతాలు బకాయిలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల కులు మారినప్పుడల్లా ఇష్టానుసారం పంచాయతీ కార్మికులను ఉద్యోగాల నుంచి అక్రమంగా తొలగిస్తుండటం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం తొలగించిన వారందరినీ వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కార్మికుల గోడు వినకపోవడం బాధాకరమని ఉమామహేశ్వరరావు అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
నెల రోజుల్లోగా తమ సమస్యలు పరిష్కారం కావాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని, అవసరమైతే నిరవధిక సమ్మెలోకి వెళ్లడానికి కూడా సిద్ధమేనని కె.ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకట్రామయ్య మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల శ్రమను గుర్తించకుండా పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో, విజయవాడ వరదల్లో పంచాయతీ కార్మికులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనులు చేశారని గుర్తు చేశారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ గుళ్లు, గోపురాలు తిరగడం తప్ప తన శాఖ పరిధి లోని పంచాయతీ కార్మికులు, ఇతర చిరుద్యోగుల గురించి పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
పంచాయతీ యూనియన్ రాష్ట్ర నాయకులు, వివిధ సంఘాల నేతలు జి.రామాంజనేయులు, కె.శివప్రసాద్, ఎం.పోలినాయుడు, వాకాటి రాము, ఆంజనేయులు, ఇంటి వెంకటేశ్వరరావు, కొమ్మినేని శ్రీనివాసరావు, సిహెచ్ సుబ్బారావు, రమాదేవి, ఎస్ సురేంద్ర, శారద, గౌరి, చింతల శ్రీనివాసరావు, నాగన్న, గోవిందప్ప, ధనలక్ష్మి, కె.సుబ్బరావమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment