
కరెంట్ పంచాయితీ
- పేరుకుపోయిన గ్రామపంచాయతీల విద్యుత్ బకాయిలు
- రూ.58 కోట్లు చెల్లించాలని నోటీసులు
- కలెక్టర్ వద్దకు చేరిన పెండింగ్ లొల్లి
- బిల్లులపై కిషన్ అనుమానాలు
- రీడింగ్‌ల వారీగా సమాచారం ఇవ్వాలని సూచన
- అన్నీ ఉన్నాయంటూ.. కనెక్షన్ల తొలగింపునకు సిద్ధమైన కరెంటోళ్లు
హన్మకొండ, న్యూస్‌లైన్: గ్రామ పంచాయతీ కరెంట్ బిల్లుల వ్యవహారం రెండు శాఖల్లో ప్రచ్ఛన్న యుద్ధానికి తెర లేపింది. జిల్లాలోని గ్రామపంచాయతీలు రూ.58 కోట్ల విద్యుత్ బిల్లులు బాకీ పడ్డాయని... వెంటనే వీటిని చెల్లించాలని పంచాయతీ విభాగం అధికారులకు విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేసింది.
మూడు విడతల్లో విద్యుత్ బకాయిలు చెల్లిస్తామని పంచాయతీ విభాగం అధికారు లతోపాటు ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిందని... ఇంతవరకూ ఒక్క రూపాయి ఇవ్వలేదని మూడురోజుల క్రితం విద్యుత్ అధికారులు కలెక్టర్ కిషన్‌ను కలిసి నివేదిక అందజేశారు. అయితే.. విద్యుత్ బిల్లులపై కలెక్టర్ అనుమానాలు వ్యక్తం చేశారు. పలు అంశాలను లేఖలో పొందుపరిచి వారికి అందజేశారు.
గ్రామాల్లో వీధి దీపాలకు కనెక్షన్లు లేవని... మీటర్లు ఎక్కడా పెట్టలేదని... కొన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు లేకున్నా లక్షల రూపాయల బిల్లులు వేశారని... సగటున లెక్కలేసుకుంటూ బిల్లులు ఎలా వేస్తారంటూ అందులో ప్రశ్నించారు. దీంతో డిసెం బర్ నుంచి ఇస్తామంటూ పెండింగ్ పెట్టిన పంచాయతీ బిల్లుల లొల్లి మళ్లీ మొదలైంది.
2009 నుంచి పెండింగ్
జిల్లాలోని 944 గ్రామ పంచాయతీల్లో 2009 నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదు. పల్లెలపై భారం తగ్గించాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి జీఓ నంబర్ 80 విడుదల చేశారు. పంచాయతీలకు విద్యుత్ బిల్లులు మినహాయించాలని ఇందులో పేర్కొన్నారు. దీంతో అప్పటివరకు పంచాయతీల నిధుల నుంచి చెల్లించిన బిల్లులకు బ్రేక్ పడింది.
ఆ తర్వాత 2011లో పంచాయతీల నుంచి బిల్లులు రాకపోవడం, ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో గ్రామపంచాయతీలకు కరెంట్ సరఫరా చేయమని విద్యుత్ అధికారులు తేల్చిచెప్పారు. దీంతో అప్పటి కిరణ్ సర్కారు పాత బిల్లులిస్తామని, పంచాయతీల బిల్లులు భరిస్తామని హామీ ఇచ్చారు. కానీ... 2013 వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఫలితంగా జిల్లాలోని పంచాయతీలకు సంబంధించి విద్యుత్ బిల్లుల బకారుులు రూ.58 కోట్లకు చేరుకున్నాయి.
ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో బిల్లుల వసూళ్లకు విద్యుత్ శాఖ ఒత్తిడి పెంచింది. తాగునీటి పథకాలు, వీధిలైట్లకు సరఫరా కట్ చేసింది. అప్పుడు కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు పంచాయతీల కరెంట్ బిల్లులు భారంగా మారాయి. పంచాయతీల ఖాతాల్లో రూపాయి లేకపోవడంతో, బడ్జెట్‌లో బిల్లులు చెల్లించే అవకాశం లేకపోవడంతో కలెక్టర్ కిషన్‌కు మొరపెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో పంచాయతీలకు కరెంట్ కట్ చేయొద్దని, విడతల వారీగా విద్యుత్ బిల్లులు చెల్లించే విషయాన్ని పరిశీలిస్తామని విద్యుత్ అధికారులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖ అధికారులు దీన్ని ఆసరాగా చేసుకుని బిల్లుల వసూలుకు సంబంధించి ఇటీవల కలెక్టర్‌ను కలిసి ఒత్తిడి తీసుకొచ్చారు. విద్యుత్ బిల్లులు ఇవ్వకుంటే కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఒకింత అసహనానికి గురైన కలెక్టర్ వారితో కటువుగానే మాట్లాడినట్లు తెలిసింది.
మీటర్లే లేవు.. బిల్లు ఎట్ల వేశారు..
గ్రామాల్లో విద్యుత్ స్తంభాలకు మీటర్లు లేవని... అలాంటప్పుడు బిల్లులు ఎట్ల వేశారని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. స్తంభాలు లేని ఊళ్లకు కూడా లక్షల్లో బిల్లు వేశారని నిలదీసినట్లు సమాచారం. గ్రామాలవారీగా పంచాయతీలు వినియోగించుకున్న విద్యుత్ బిల్లులను రీడింగ్‌ల వారీగా ఇవ్వాలని లేఖ అందజేశారు. దీనికి విద్యుత్ శాఖ అధికారులు సమాధానమిచ్చారు.
ప్రతి గ్రామంలో వినియోగించిన విద్యుత్‌కు రీడింగ్ లెక్కలు ఉన్నాయని కలెక్టర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అరుుతే కలెక్టర్ కోరినట్లు రీడింగ్‌ల వారీగా మాత్రం ఇవ్వలేదు. ఈ క్రమంలో ఖజానాలో రూపాయి లేదని, విద్యుత్ బిల్లుల చెల్లింపులకు మరింత సమయం కావాలని విద్యుత్ శాఖకు పంచాయతీ రాజ్ శాఖ లేఖ రాసింది. కానీ... బిల్లుల కోసం కనెక్షన్లు తొలగించేందుకు విద్యుత్ అధికారులు సిద్ధమవుతున్నారు.