పవర్ ‘పంచాయితీ’ | power 'panchayat" | Sakshi
Sakshi News home page

పవర్ ‘పంచాయితీ’

Published Sun, Dec 21 2014 3:24 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

పవర్ ‘పంచాయితీ’ - Sakshi

పవర్ ‘పంచాయితీ’

సాక్షి, మంచిర్యాల : గ్రామ పంచాయతీల్లో విద్యుత్ బకాయిల చెల్లింపు వ్యవహారం ప్రభుత్వం, సర్పంచుల మధ్య అగాధాన్ని పెంచుతోంది. బకాయిపడ్డ కరెంట్ బిల్లుల చెల్లింపు బాధ్యత పం చాయతీలదేనని ఇది వరకే స్పష్టం చేసిన ప్రభుత్వం బిల్లు వసూళ్ల విషయంలోనూ కఠినంగా వ్యవహరిం చాలని పంచాయతీ, విద్యుత్ అధికారులను ఆదేశించింది. అవసరమైతే పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపేయాలని మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో విద్యుత్ శాఖాధికారులు ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో బకాయి ఉన్న 30కిపైగా గ్రామాల్లో కరెంట్ సరఫరా నిలిపేశారు.

ప్రజల ఆందోళనలతో మళ్లీ పునరుద్ధరించారు. విద్యుత్ బకాయి వసూళ్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్న సర్పంచులు ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లులు చెల్లించేది లేదంటూ స్పష్టం చేస్తున్నారు. మరోపక్క.. విద్యుత్ చార్జీల వసూళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించినా.. వసూళ్లలో పురోగతి లేకపోవడంతో పంచాయత్‌రాజ్ శాఖ రంగంలోకి దిగింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ శనివారం హైదరాబాద్‌లో అన్ని జిల్లాల డీపీవోలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఒకవేళ సమావేశంలో కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంటే.. బకాయి ఉన్న పంచాయతీలకు కరెంట్ సరఫరా నిలిపివేసే అవకాశాలూ లేకపోలేదని ఆ శాఖకు చెందిన సీనియర్ అసిస్టెంట్ ఒకరు అభిప్రాయపడ్డారు.
 
కొనసాగుతున్న కరెంట్ సరఫరా నిలిపివేత..
జిల్లాలో 866 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 27 మేజర్ పంచాయతీలుండగా.. మిగిలినవి మైన ర్ జీపీలున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. సంబంధిత శాఖాధికారులు బకాయిలు చెల్లించని పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో అంధకారం నెలకొనడంతోపాటు తాగునీటి పథకాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలు రక్షిత తాగునీటికి దూరమవుతున్నారు. పలు చోట్ల సర్పంచులు, ఎమ్మెల్యేల హామీతో విద్యుత్ అధికారులు కరెంటును పునరుద్ధరిస్తున్నారు.
 
ఏదీ స్పష్టత...?
విద్యుత్ చార్జీల చెల్లింపు విషయంలో ప్రభుత్వం, సర్పంచుల మధ్య అవగాహన లోపమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని పలువురు సర్పంచులు అభిప్రాయపడుతున్నారు. గతంలో గత ప్రభుత్వాలే గ్రామ పంచాయతీల్లో కరెంట్ బిల్లులు చెల్లించేవని, కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గ్రామాల్లో విద్యుత్ బకాయిల చెల్లింపు బాధ్యత ఆయా పంచాయతీలపై మోపడం అన్యాయమని సర్పంచులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం గతంలో కేంద్రం నుంచి వచ్చిన 13వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి కోత విధించి జిల్లాలకు పంపించామని, కోత పెట్టిన నిధులతో విద్యుత్ బకాయిలు చెల్లింపులు జరిగేవని, ప్రస్తుతం వచ్చిన నిధులు కోత లేకుండా మొత్తాన్ని పంచాయతీలకు విడుదల చేశామని చెబుతోంది. అయితే.. ఈ విషయాన్ని సర్పంచులకు వివరించడంలో ప్రభుత్వం, అధికారులు వైఫల్యం చెందడమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రామారావు రాథోడ్ అభిప్రాయపడ్డారు.
 
సర్పంచులు సహకరించడం లేదు.
 - పోచయ్య, జిల్లా పంచాయతీ అధికారి.
గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తోంది. మన జిల్లాకు మూడు విడతలుగా రూ.60 కోట్లు వస్తాయి. అందులో నుంచి 15 శాతం నిధులు మాత్రమే విద్యుత్ బకాయిల కింద చెల్లించాలని చెప్పాం. అయినా సర్పంచులెవరూ స్పందించడం లేదు. ఒక్కో పంచాయతీకి సగటున రూ.50 లక్షల నిధులొచ్చాయి. వాటిలో కొంత మేరకైనా బకాయి చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పటి వరకు రూ.55 లక్షలు మాత్రమే చెల్లించారు. విద్యుత్ శాఖకు రూ.83 కోట్ల వరకు బకాయి ఉన్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement