- ప్రత్యేక నిధుల నుంచి కేటాయింపు
- ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
- జిల్లాలో రూ.64కోట్ల బకాయిలు
కరీంనగర్ సిటీ : విద్యుత్ బకాయిలతో సతమతమవుతున్న గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఎస్‌ఎఫ్‌సీ, 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు అనుమతినిస్తూ జిల్లా పంచాయతీ అధికారి లేఖ నం.ఏ4/3148/2011, తేదీ : 12.06.2014 ద్వారా ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలో 1207 గ్రామపంచాయతీలు ఉండగా... ఆయా గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకం, వీధిదీపాలకు విద్యుత్‌ను వినియోగిస్తుంటారు. విద్యుత్‌చార్జీలు సకాలంలో చెల్లించకపోవడంతో సుమారు రూ.10 కోట్ల వరకు గ్రామపంచాయతీలు ట్రాన్స్‌కోకు విద్యుత్ చార్జీలు బకాయి పడ్డాయి. ఇటీవల
గ్రామపంచాయతీలు బకాయిలు చెల్లించాలని, లేకుంటే విద్యుత్ నిలిపివేస్తామని ట్రాన్స్‌కో అధికారులు హెచ్చరికలు జారీచేశారు. దీంతో కదిలిన పంచాయతీ విభాగం ప్రత్యేక నిధుల నుంచి విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఎస్‌ఎఫ్‌సీ, 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 25శాతం ఆయా గ్రామపంచాయతీలు రెండు లేదా మూడు వాయిదాల్లో బకాయిలు చెల్లించాలని సూచించింది. విద్యుత్ బకాయిల చెల్లింపు కోసం జిల్లా పంచాయతీ అధికారి గ్రామపంచాయతీలకు పలు సూచనలు చేశారు.
ఆయా గ్రామపంచాయతీల్లో వీధిదీపాలు, నీటి సరఫరా పథకానికి అయిన విద్యుత్‌చార్జీల వివరాలను సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు సంబంధిత ట్రాన్స్‌కో అధికారులతో సమీక్షించుకోవాలి. సదరు గ్రామపంచాయతీ ట్రాన్స్‌కోకు విద్యుత్‌చార్జీలు ఎంత బకాయి ఉందో నిర్ధారించుకుని, రెండు లేదా మూడు వాయిదాల్లో ఈ నిధుల నుంచి చెల్లించాలి. ఈవోపీఆర్డీ తమ పరిధిలోని గ్రామపంచాయతీల బకాయిలను కనెక్షన్లవారీగా నిర్ధారించడానికి ట్రాన్స్‌కో, పంచాయతీ కార్యద ర్శులను సమన్వయపరుస్తూ ఎప్పటికప్పుడు సూచనలు జారీచేయాలి. గ్రామపంచాయతీల కనెక్షన్‌వారీగా వివరాలతో రికార్డును నిర్వహించాలి. నిధులకు అనుగుణంగా వాయిదాల్లో బకాయిలు చెల్లించేందుకు, బకాయిలు నిర్ధారించేందుకు ట్రాన్స్‌కో అధికారులు సహకరించాలని డీపీవో కుమారస్వామి కోరారు.
విద్యుత్ నిలిస్తే స్థానిక అధికారులదే బాధ్యత
గ్రామపంచాయతీలు విద్యుత్ బకాయిలు చె ల్లించేలా చూసే బాధ్యతను సంబంధిత పంచాయతీ కార్యదర్శి, పర్యవేక్షించాల్సిన బాధ్యతను ఈవోపీఆర్‌డీ, డివిజనల్ పంచాయతీ అధికారులదేనని డీపీవో చెప్పారు. బకాయిల చెల్లింపు ఆదేశాలను అమలు పరచని పంచాయతీ కార్యదర్శుల వివరాలు తనకు తెలియచేయాలని సూచించారు. బకాయిలు చెల్లించక ఏ గ్రామపంచాయతీలోనైనా విద్యుత్ సరఫరా నిలిపివేస్తే సంబంధిత పంచాయతీ కార్యదర్శి, విస్తరణ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు.