
జాబితా.. జంఝాటం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పింఛన్ల ప్రహసనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇన్నాళ్లూ జాబితా తయారు కాలేదని.. జాబితాలు అధికారికంగా వచ్చే దాకా లబ్ధిదారులెవరూ ఆందోళన చెందవద్దని ప్రభుత్వ యంత్రాంగం చెబుతూ వచ్చింది. కానీ గురువారం జిల్లావ్యాప్తంగా విడుదలైన పింఛన్ల జాబితాలు ఆసరా లబ్ధిదారుల్లో మరింత గందరగోళాన్ని నింపాయి. ముఖ్యంగా ఈ జాబితాల ప్రకటనలో ఒక పద్ధతి లేకపోవడం, కొన్ని మండలాల్లో, మరికొన్ని గ్రామాల్లో జాబితాలు ప్రదర్శించకపోవడం, ప్రకటించిన జాబితాలను సాయంత్రానికి తీసేయడం లాంటి ఘటనలు లబ్ధిదారుల్లో అనేక ఆందోళనలు కలిగిస్తున్నాయి. మరోవైపు అర్హులైన చాలామందికి పింఛన్లు కోత పెట్టారని, అనర్హులకు పింఛన్లు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
చాలామంది గ్రామపంచాయతీ కార్యాలయాల ఎదు ట, మండల కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించిన సంఘటనలూ తొలి రోజు జరిగాయి. వీటికి తోడు సమగ్ర సర్వే వివరాలు అందుబాటులో లేనివారి పేర్లు జాబితాల్లో లేకపోవడంతో తమ పేర్లు వస్తాయో రావోననే ఆందోళన వారిలో నెలకొంది. అయితే, పింఛన్ల జాబితాలో పేర్లు లేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నా.. ఈ ప్రక్రియలో తమకు న్యాయం జరిగే అవకాశం లేదనే అభిప్రాయం, తమ ఆశలు గందరగోళంలోనికి నెట్టివేయబడ్డాయనే ఆందోళన జిల్లాలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర వర్గాల్లో వ్యక్తమవుతోంది. తుది పరిశీలన అనంతరం జాబితాలు అన్నిచోట్ల ప్రదర్శిస్తే మరింత ఆందోళన నెలకొనే అవకాశం ఉంది. నియోజకవర్గాల వారీగా పింఛన్ల జాబితా ప్రదర్శన వివరాలివి...
ఆలేరు పరిధిలో జాబితాలో అర్హుల పేర్లు లేకపోవడంతో వృద్ధులు, వికలాంగులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని గ్రామాల్లో అనర్హులకు పెన్షన్ వచ్చిందని అర్హులు వాపోతున్నారు. సుమారు 38శాతం మందిని అనర్హులుగా చేశారు. జాబితాలో పేరు లేని వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని, విచారించి మంజూరు చేయిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఆలేరు మండలంలో 8730 మంది దరఖాస్తు చేసుకోగా 4737 పరిశీలనకు రాగా 4525మందికి మంజూరు చేశారు. యాదగిరిగుట్టలో 7850మంది దరఖాస్తు చేసుకోగా 5450 పరిశీలనకు రాగా 4893 మందికి మంజూరయ్యాయి.
భువనగిరి నియోజకవర్గంలో డేటా ఎంట్రీ, ఎస్‌కెఎస్ ఫారాల ఎంట్రీ లేకపోవడంతో పలు దరఖాస్తులను పరిశీలించలేదని సమాచారం. భువనగిరి పట్టణంలో రాత్రి వరకు ఆసరా పథకానికి సంబంధించి పింఛన్ల జాబితాను ఏ వార్డులోనూ ప్రదర్శించలేదు. లబ్ధిదారులను ఎంతమందిని ఎంపిక చేయాలనే విషయంలో మున్సిపాలిటీలో లెక్క తేలలేదు. భువనగిరి, వలిగొండ మండలాల్లోని అన్ని గ్రామాల్లో పింఛన్ల జాబితాను ప్రదర్శించారు. బీబీనగర్, పోచంపల్లి మండలాల్లో గ్రామాల్లో సాయంత్రం జాబితాలను ప్రదర్శించలేదు. డేటాఎంట్రీలో జరిగిన పొరపాట్లతోపాటు, ప్రభుత్వం ఇచ్చిన కోత ప్రకా రం అధికారులు వ్యవహరించినట్లు తెలుస్తోంది. కాగా అర్హులైన వారు తమ పేర్లు జాబితాలో లేవని సంబంధిత అధికారులకు ఫోన్లు చేశారు.
మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మండలంలో సగానికి పైగా గ్రామాలలో గురువారం రాత్రివరకు కూడా పింఛన్‌దారుల జాబితాలను గ్రామపంచాయతీల వద్ద పెట్టలేదు. ఎస్.లింగోటం గ్రామపంచాయతీ వద్దకు పలువురు లబ్ధిదారులు వచ్చి, జాబితాలో పేరులేకపోవడంతో ఊసూరుమన్నారు. మునుగోడు మం డలం సోలిపురంలో అర్హులకు పింఛన్లు రాలేదని ఆహార భద్రత కార్డుల సర్వేకు వెళ్లిన అధికారులను గ్రామస్తులను అడ్డుకున్నారు. నారాయణపురం మండలంలో ఎక్కడా రాత్రి వరకు జాబి తాలు పెట్టలేదు. చండూరులోను ఇదే పరిస్థితి. మర్రిగూడ మండలానికి సంబంధించిన జాబి తాకు జిల్లా కే ంద్రం నుంచి అనుమతి రాలేదు.
మిర్యాలగూడ నియోజకవర్గంలోని మిర్యాలగూడ, దామరచర్ల మండలాల్లో మాత్రమే ఆసరా పింఛన్ల జాబితాలను ప్రకటించారు. కాగా దామరచర్ల మండలంలోని ప్రతి గ్రామం నుంచి పింఛన్ల జాబితాలో పేర్లు రాలేదని అధికారులను అడుగుతుండగా 5, 6 తేదీల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని చెబుతున్నారు. మిర్యాలగూడ మండలంలోనూ ఇదే పరిస్థితి. వేములపల్లి మండలంలో రాత్రి వరకు ప్రకటిస్తామని అధికారులు చెబుతున్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో వార్డులలో పింఛన్ల జాబితాలను ప్రకటించలేదు. శుక్రవారం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఆసరా పింఛన్ జాబితా ప్రదర్శించలేదు. తిరుమలగిరి, నూతనకల్ మండలాల్లో పింఛన్ జాబితాను ప్రదర్శించారు. అర్హులైన వారి పేర్లు జాబితాలో లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. జాబితాలో తమ పేర్లు లేవని స్థానిక ప్రజప్రతినిధులకు మొర పెట్టుకుంటున్నారు.
నకిరేకల్ నియోజకవర్గంలోని నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూర్, రామన్నపేట, చిట్యాల, నార్కట్‌పల్లి మండలాలలో జాబితా విడుదల చేశారు. అర్హులైన వారి పేర్లు జాబితాలో లేవని కేతేపల్లి మండలం కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు బాధితులు నిరసన వ్యక్తం చేశారు. నకిరేకల్‌లోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు జాబితాలో తమ పేరు చూసుకునేందుకు పింఛన్‌దారులు పోటీ పడడంతో అధికారులు వారిని శాంతపరిచి పేర్లను చదివి వినిపించారు. సూర్యాపేట పట్టణంలో సాయంత్రం వరకు ఆసరా పథకానికి సంబంధించి పింఛన్ల జాబితాను ఏ వార్డులోనూ ప్రదర్శించలేదు.
మండలంలోని దాసాయిగూడెం, కేసారం గ్రామాల్లో మధ్యాహ్నం తర్వాత జాబితా ప్రదర్శించారు. మిగతా గ్రామాల్లో ఉదయాన్నే గ్రామపంచాయతీ కార్యాలయాల్లో జాబితా ప్రదర్శించారు. చివ్వెంల గ్రామంలో అర్హులైన వారి పేర్లు జాబితాలో లేవంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. చందుపట్ల గ్రామంలో ఆసరా లిస్టు బయట పెట్టలేదంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పెన్‌పహాడ్ మండలంలోని అన్ని గ్రామాల్లో పింఛన్ల జాబితాను ప్రదర్శించారు. నల్లగొండ మున్సిపాలిటీలో వికలాంగుల కేటగిరీలో పెన్షన్ దారులకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేశారు. వికలత్వం 95 శాతం ఉన్న వారి పేర్లు జాబితాలో పొందుపర్చలేదు. వారంతా దరఖాస్తు చేసుకున్నారు. అర్హులకు కాకుండా అనర్హులకు పెన్షన్ మంజూరు చేశారని జాబితాను పరిశీలించిన లబ్ధిదారులు వాపోయారు. తిప్పర్తి మండలం సర్వారంలో అనర్హులకు పెన్షన్ మంజూరైనట్లు స్థానికలు పే ర్కొన్నారు.
దేవరకొండ నియోజకవర్గంలో ఒక్క దేవరకొండ పట్టణం మినహా ఎక్కడా జాబితాలు ప్రదర్శించలేదు. తమ పేర్లు జాబితాలో ఉంటాయో ఉండవేమోననే ఆందోళన ఇక్కడి ప్రజల్లో వ్యక్తమవుతోంది. అయితే, నియోజకవర్గంలో అనర్హులకు కూడా పింఛన్ జాబితాలో చోటు కల్పించారనే ఆరోపణలు వస్తున్నాయి. కోదాడ నియోజకవర్గంలో ఆసరా పథకం సంబంధించి సాయత్రం 3:30 గంటల వరకు లబ్ధిదారులు జాబితాలను ప్రకటించలేదు. అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో తుది పరిశీలన జరుపుతున్నారు. జాబితాలను శుక్రవారం గ్రామపంచాయితీలలో వెల్లడిస్తామని కొందరు కార్యదర్శులు చెబుతున్నారు.
మొన్న పింఛన్ ఇచ్చారు..
నేడు పేరే లేకుండా చేశారు తిరుమలగిరి : గత నెల 8వ తేదీన ఎంపిక
చేసిన లబ్ధిదారులకు ఆసరా పింఛన్ అందజేసిన విషయం తెలిసిందే. వారిలో తిరుమలగిరి మండలం ఫణిగిరికి చెందిన వికలాంగుడు రమేష్ కూడా ఉన్నాడు. ఆ రోజున స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ చేతుల మీదుగా రూ.1500 పింఛన్ కూడా అందుకున్నాడు. కానీ గురువారం ప్రకటించిన జాబితాలో రమేష్ పేరు మాయమైంది. దీంతో కంగుతినడం రమేష్ వంతయ్యింది. ఇదే గ్రామానికి చెందిన అందె చంద్రమ్మ కూడా ఎమ్మెల్యే చేతుల మీదుగా వృద్ధాప్య పింఛన్ అందుకుంది. తీరా ఇప్పుడు ఆమె పేరు కూడా జాబితాలో లేదు. ఇలాంటి వారు జిల్లావ్యాప్తంగా
ఎంతమంది ఉన్నారో అధికారులకే
తెలియాలి.