భువనగిరి: ‘మీ వెంచర్ మీద ఫిర్యాదులు వచ్చాయి.. కలెక్టర్ సీరియస్‌గా ఉండు.. నేను రిపోర్టు పంపానో మీ వెంచర్ మూసుకోవాల్సిందే.. వెంటనే వచ్చి కలుస్తావా లేదా నీ ఇష్టం..’ ఓ వెంచర్‌యజమానికి గ్రామస్థాయి అధికారి ఫోన్‌లో హెచ్చరిక...‘మీ గ్రామంలో వెంచర్ అయ్యింది.. అతను సర్పంచ్‌నే కలిశాడు.. వార్డు సభ్యులను కలువలేదు.. మీరు వెంటనే అతనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయండి.. ఆపై అంతా నేను చూసుకుంటా..’ ఓ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు ఆ గ్రామ అధికారి ఉద్బోధ... ఇదీ భువనగిరి డివిజన్‌లో ప్రస్తుతం నెలకొన్న రియల్ దందా తీరు. సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఎంతో శ్రమిస్తున్న విషయం తెలిసిందే.
ఇదే అదనుగా యాదగిరిగుట్ట, తుర్కపల్లి,భువనగిరి, ఆలేరు, బీబీనగర్ మండలాల్లో అత్యధికంగా నూతన వెంచర్లు వెలిశాయి. యాదగిరిగుట్ట అభివృద్ధిని బూచిగా చూపి ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు వెలుస్తున్నా యి. కనీసం గ్రామ పంచాయతీ దరఖాస్తు కూడా చేసుకోకుండా వెంచర్ల యజ మానులు అక్రమాలకు పాల్పడుతున్నారు. జిల్లా కలెక్టర్ డీపీఓ వంటి అధికారులు ఎప్పటికప్పుడు అక్రమాలపై వేసిన నిఘా క్షేత్రస్థాయి ఉద్యోగులకు కాసుల వర్షం కురిపిస్తోంది. అక్రమ వెంచర్ల వివరాలను సేకరించాలని చెబితే కొందరు ఉద్యోగులు రియల్టర్‌లతో బేరసారాలు పెట్టారు.ఫలితంగా ఉన్నతాధికారుల పేరు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని సమాచారం.
పంచాయతీ కార్యదర్శులపై కలెక్టర్ ఆగ్రహం
భువనగిరిలో డి విజన్‌స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సమయంలో కలెక్టర్ సత్యనారాయణరెడ్డి కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ వెంచర్ల వివరాలు సేకరించి వాటిని తొలగించాలని చెబితే తన పేరు చెప్పి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారట ఈ విషయాన్ని తాను తీవ్రంగా పరిగణిస్తానని కలెక్టర్ హెచ్చరించారు. తన పేరుతో అక్రమాలకు పాల్పడితే ఊపేక్షించేది లేదని హెచ్చరించారు.
గ్రామాల్లో చిచ్చు పెడుతున్న వెంచర్లు
గ్రామ పంచాయతీ పరిధిలో విచ్చల విడిగా ఏర్పాటవుతున్న వెంచర్లలో అధికారుల పాత్ర క్రియాశీలకంగా మారింది. కొన్ని గ్రామాల్లో సర్పంచ్- వార్డు సభ్యుల మధ్యన వెంచర్ల విషయంలో తీవ్ర స్థాయిలో విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు వార్డు సభ్యులకు అక్రమ వెంచర్ల వివరాలను గ్రామ స్థాయి అధికారులు అందించడంతో వివాదాలను మధ్యవర్తులుగా ఉండి సర్దుబాటు చేస్తున్నారు. అక్రమ వెంచర్ల విషయంలో సర్పంచ్, వార్డు సభ్యుల మధ్యవివాదాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసే వరకు వెళ్తున్నాయి. భువనగిరి మండలం రాయిగిరిలో వెలిసిన 400 ఎకరాల వెంచర్‌కు అనుమతి విషయంలో గ్రామ పంచాయతీ సర్పంచ్- వార్డు సభ్యుల మధ్య వివాదం తలెత్తి పరస్పరం దాడులు చేసుకున్నారు.
నూతన వెంచర్లు వెలిసిన చోటే..
నూతన వెంచర్లు వెలిసినచోటే ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఉన్నతాధికారులుఎన్ని నిబంధనలు జారీ చేసినా టాస్క్‌పోర్స్ అధికారులు అక్రమ వెంచర్లు గుర్తించి నోటీస్‌లు జారీ చేసినా అక్రమాలు మాత్రం ఆగడం లేదు. క్షేత్రస్థాయిలో అధికారుల అండదండలతో పేర్లు మార్చి కొత్త వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. యాదగిరిగుట్ట, రాయగిరి, వడాయిగూడెం, సైదాపురం, వంగపల్లి, పెద్ద కందుకూరు వంటి గ్రామాల్లో రియల్ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. గ్రామాల్లో పలు వివాదాలకు కారణం అవుతున్నాయి.
అలాంటి వారిని ఊపేక్షించం, ఎన్. మధుసూదన్, ఆర్డీఓ, భువనగిరి
రియల్ వ్యాపారుల మోసాలకు ఆసరాగా నిలిచే ఉద్యోగులను ఊపేక్షించం. ఉన్నతాధికారుల పేరు చెప్పి కొందరు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అలాంటి వారిపై నిఘాపెట్టాం. వారిపై శాఖాపరమైన చర్యలకు వెనుకాడబోం. అన్ని అనుమతులు తీసుకునే విషయంలో స్థానికంగా అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుమతులు లేని వెంచర్లను తొలగించాలి.
అధికారుల పేరుతో వసూళ్లు
Published Sun, Aug 23 2015 12:43 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement