- పంచాయతీలకు షాకిచ్చిన సర్కార్
- విద్యుత్ బిల్లుల చెల్లింపునకు ససేమిరా
- బకాయి మొత్తం రూ.4.84 కోట్లు
కడప అగ్రికల్చర్ : గ్రామ పంచాయతీలకు సంబంధించిన విద్యుత్ బిల్లుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామ పంచాయతీలపై భారం పడకుండా విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరించింది. వైఎస్ మరణానంతరం గద్దెనెక్కిన ముఖ్యమంత్రులు బిల్లుల విషయంలో దాటవేత ధోరణి అవలంబిస్తూ వచ్చారు. దీంతో ఆ బిల్లులు ఇప్పుడు తడిసి మోపెడయ్యాయి. బిల్లులు చెల్లించడానికి నిధులు లేక సర్పంచ్‌లు అల్లాడుతున్నారు. గ్రామ పంచాయతీలకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రంగా ఉండడంతో వీధి దీపాలు, వాటర్ వర్క్స్‌కు సంబంధించిన విద్యుత్ బిల్లులను చెల్లించడం కష్టమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 9 మేజర్ పంచాయతీలు, 790 మైనర్ పంచాయతీలు ఉన్నాయి. వీధి దీపాలు, వాటర్ వర్క్స్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందనే నమ్మకంతో పాలక వర్గాలు బిల్లులు చెల్లించడం లేదు. దీంతో బకాయిలు రూ. 4.84 కోట్లకు చేరుకున్నాయి. గతంలో పంచాయతీలకు పన్నుల నుంచి వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని కేటాయించి విద్యుత్ బిల్లులను పాలకవర్గాలు విద్యుత్ సంస్థకు చెల్లించేవి. ఆదాయం అంతంత మాత్రమే ఉండటం, పెరిగిన విద్యుత్‌చార్జీలకు పంచాయతీ నిధులు సరిపోక పోవడంతో బిల్లుల భారం పంచాయతీలకు గుదిబండగా మారింది.
దీన్ని గమనించిన అప్పటి వైఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సంబందించిన విద్యుత్ బిల్లులను చెల్లించే బాధ్యత తీసుకుని ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. దీంతో గ్రామ పంచాయతీలలో వసూలయ్యే పన్నులు, ఇతరత్రా వచ్చే నిధులను అభివృద్ధి పనులకు వినియోగించుకునే వారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ బిల్లులను పంచాయతీల ఆదాయం నుంచి చెల్లించాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. పన్నులు వసూలు కాకపోతే 13వ ఆర్ధిక సంఘం ద్వారా వచ్చే నిధుల నుంచి బిల్లులు చెల్లించుకోవాలని సూచించింది. మేజర్ వాటర్ వర్క్స్ బకాయి రూ. 60,22,061 ఉండగా మైనర్ వాటర్ వర్క్స్ విద్యుత్ బకాయి రూ. 3,77, 93,705 ఉంది. అలాగే మైనర్ పంచాయితీలకు వీధి దీపాల విద్యుత్ బకాయి 46, 48,596 రూపాయలు ఉంది. మూడేళ్లుగా విద్యుత్ బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో బకాయిలన్నీ పేరుకుపోయాయి.
ఆర్థిక సంఘం నిధుల నుంచి బిల్లులు చెల్లించుకోవచ్చు :
పన్నులు వసూలు కాకపోయినా, పంచాయతీలలో డబ్బులు లేకపోయినా ఆర్థిక సంఘం నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించుకోవచ్చని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. దాదాపు నాలుగైదు నెలలు వరుస ఎన్నికలు, అంతకు మునుపు ఎన్నికల ముందర ఆరునెలలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోవడంతోగ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు ఆగిపోవడంతో కొంత వరకు ఇబ్బందులు ఏర్పడిన మాట వాస్తవమే.
- అపూర్వసుందరి, డీపీఓ
మీరే చెల్లించండి
Published Sun, Aug 10 2014 3:06 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement