ఇకపై విద్యుత్ చార్జీల గురించి ఎవరికైనా చెబితే ఊరుకోం
బిల్లుల బాధితులకు కూటమి నేతలు, అధికారుల బెదిరింపులు
పింఛన్లు, రేషన్ కార్డులు తీసేస్తామని తీవ్ర హెచ్చరికలు
సాక్షి, అమరావతి: ‘‘ఏమనుకుంటున్నారు మీరంతా..? కరెంట్ గురించి, బిల్లుల గురించి ‘సాక్షి’ వాళ్లకు ఎందుకు చెప్పారు..? ఎవరు చెప్పమన్నారు..? ఇలా అయితే చాలా ఇబ్బంది పడతారు..! మరోసారి ఇలా ఎవరికైనా చెబితే సహించేది లేదు..!’’ అంటూ విద్యుత్ బిల్లుల బాధితులపై కూటమి నేతలు, అధికార యంత్రాంగం బెదిరింపులకు దిగాయి.
ఏమిటీ నిరంకుశం?
ఏలూరు జిల్లా మల్కీ మహ్మద్‌పురం (పల్లపూరు)లో విద్యుత్ బిల్లుల బాధితుల వద్దకు మంగళవారం వచ్చిన భీమడోలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(డీఈఈ) గోపాలకృష్ణ, అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) శివాజీ, లైన్‌మెన్ శేషగిరితో పాటు దాదాపు పది మంది అధికారులు, సిబ్బంది, కూటమి నేతలు వారిపై విరుచుకుపడ్డారు.
‘సాక్షి’తో ఎందుకు మాట్లాడారని గద్దించారు. పింఛన్లు, రేషన్ కార్డులు తీసేస్తామంటూ హెచ్చరించారు. ఇకపై విద్యుత్ బిల్లులు, చార్జీల గురించి ఎక్కడా నోరు విప్పవద్దని తమను బెదిరించినట్లు బాధితులు వెల్లడించారు. ఇకపై తమను వేధింపులకు గురి చేస్తారని వారంతా ఆందోళన చెందుతున్నారు. ఏమిటీ నిరంకుశత్వమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిజమే కానీ.. మీరెలా రాసేస్తారు?
దీనిపై ఏఈ శివాజీని వివరణ కోరగా.. ‘‘మావైపు తప్పు ఉన్న మాట వాస్తవం.. అయినా మీరు ఎలా రాసేస్తారు?’’ అంటూ ‘సాక్షి’ ప్రతినిధిని సైతం బెదిరించే ధోరణిలో మాట్లాడారు. లైన్ మెన్ శేషగిరికి ప్రతి నెలా విద్యుత్ బిల్లు నిమిత్తం డబ్బులిస్తున్నా తమకు రసీదు ఇవ్వడం లేదని ఎంఎంపురం వాసి పాపమ్మ ‘సాక్షి’కి తెలిపారు. దీన్ని లైన్‌మెన్ దృష్టికి తేగా రసీదు ఎక్కడో పడేశానంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.
గోడు ఆలకించకుండా బెదిరింపులా..!
పేదలకు సంక్షేమ పథకాలిచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపుతో తమ నడ్డి విరుస్తుండటంతో హాహాకారాలు చేస్తున్నారు. వారి గోడును తెలుసుకుని వాస్తవాలను ‘సాక్షి’ అందరి దృష్టికి తెస్తోంది. వారి కష్టాలను ‘గ్రౌండ్ రిపోర్ట్’ రూపంలో ప్రచురిస్తోంది. అయితే ఇదంతా ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. కరెంటు చార్జీలు పెంచినా, పేదలకు ఉచిత విద్యుత్‌ను దూరం చేసినా ఎవరూ ప్రశ్నించకూడదనే ధోరణితో పాలకులు వ్యవహరిస్తున్నారు.
అనుమతి ప్రకారమే చార్జీలు: ఇంధన శాఖ
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతితోనే ఇంధన సర్దుబాటు చార్జీలను వసూలు చేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ తెలిపింది. ‘కరెంటు కోత.. చార్జీల మోత’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనంపై ఆ శాఖ స్పందించింది. ఎం.ఎం.పురంలో పాచిపని చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తున్న వృద్ధురాలు సిగారపు పాపమ్మకు పాత బకాయిల వల్లే రూ.1,345 విద్యుత్ బిల్లు వచ్చిందని పేర్కొంది.
ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల బిల్లుల్లో కొంత, వచ్చే నెల బిల్లుల నుంచి మరికొంత మేర సర్దుబాటు చార్జీలు విధిస్తున్నట్లు వెల్లడించింది. ఏ ఒక్క ఎస్సీ, ఎస్టీ వినియోగదారుడికీ సబ్సిడీ తొలగించలేదని, ఎవరికైనా సబ్సిడీ రాకుంటే సంబంధిత ధృవపత్రాలతో మీసేవలో దరఖాస్తు చేసుకుంటే అర్హతను పరిశీలించి మంజూరు చేస్తామని తెలిపింది. రాష్ట్రంలో డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఎలాంటి లోడ్ రిలీఫ్ అమలు చేయడం లేదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment