సాక్షి,ఆదిలాబాద్ అర్బన్: ఇంటి పన్ను వసూళ్లలో ఉమ్మడి జిల్లా కొంత మెరుగుపడింది. పన్నులు వసూలు చేయడంలో ఎప్పుడు వెనుకబడి ఉండే ఆదిలాబాద్ ఈ ఏడాది ముందు వరుసలో నిలిచేందుకు సిద్ధమవుతోంది. జిల్లాల వారీగా పన్ను వసూలు లక్ష్యాన్ని ముందుగానే చేరుకునే పరిస్థితి కనిపిస్తోంది. నాలుగు జిల్లాల పంచాయతీ అధికారులు పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చాలెంజ్‌గా తీసుకొని వసూలు చేస్తున్నారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులతోపాటు సిబ్బంది నానాఅవస్థలు పడుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా పన్ను కూడా వసూలు అవుతోంది.
గడిచిన రెండు నెలల్లో భారీగా పన్ను వసూలు అయినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. పన్ను వసూలు శాతాన్ని జిల్లాల వారీగా గమనిస్తే.. రెండు నెలల కిందట 28వ స్థానంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం 61 శాతం పన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే ఏడోస్థానం సాధించింది. మంచిర్యాల జిల్లా 58.79 శాతం, కుమురంభీం జిల్లా 57.64 శాతం పన్ను వసూలు చేసి రాష్ట్రంలో ఎనిమిది, తొమ్మిది స్థానాలను పదిలం చేసుకున్నాయి. ఇక నిర్మల్ జిల్లా 47.75 శాతం పన్ను వసూలు చేసి 20వ స్థానంలో ఉంది. అయితే అధికారులు వసూలు చేసే పన్నులో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది ఇంటి పన్ను (ట్యాక్స్) కాగా, రెండోది నాన్ ట్యాక్స్ ఉంది.
జిల్లా | లక్ష్యం | వసూలైంది | శాతం |
ఆదిలాబాద్ | రూ.5,06,50,733 | రూ.3,08,98,625 | 61 |
మంచిర్యాల | రూ.4,60,93,108 | రూ.2,70,98,771 | 58.79 |
కుమురంభీం | రూ.3,51,85,189 | రూ.2,02,82,159 | 57.64 |
నిర్మల్ | రూ.4,08,82,404 | రూ.1,95,22,580 | 47.75 |
మొత్తం | రూ.17,28,11,434 | రూ.7,82,79,555 | 56.2 |
నెల రోజుల్లో సాధ్యమేనా.?
ఆయా జిల్లాల జిల్లా పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీల వారీగా ఇంటి పన్ను వసూలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేశారు. ఈ ప్రణాళిక ప్రకారం గత రెండు నెలల నుంచి ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు. అయితే నవంబర్, డిసెంబర్‌లోనే పన్ను వసూలు చేపట్టిన సిబ్బంది అంతగా శ్రద్ధ చూపకపోవడంతో తక్కువగా వసూలైంది. దీనికి తోడు అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల సందడి కూడా తోవడంతో వసూలు లక్ష్యం మందగించింది. జనవరి మొదటి నుంచి ఇప్పటి వరకు గ్రామాల్లో జోరుగా పన్ను వసూలు జరుగుతోంది.
ఒక్కో ఇంటికి రూ.85 నుంచి రూ.350కిపైగా వసూలు చేస్తున్నారు. ఇందులో కొంత మంది ఇంటి యాజమానులు రెండేళ్ల పన్ను కట్టని సంఘటనలు ఉన్నాయి. ప్రతీ ఏటా జనవరి, ఫిబ్రవరిలో పన్ను వసూలుకు ఉరుకులు పరుగులు పెట్టే అధికారులు ఈ ఏడాది ముందుగానే లక్ష్యాన్ని చేరుకునేలా కనిపిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా ఇరవై ఏడు రోజుల సమయమే మిగిలి ఉంది. అయితే ఈ ఇరవై ఏడురోజుల్లో రూ.9,45,31,879 లను వసూలు చేయగలరా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
పన్ను వసూళ్లకు ప్రత్యేక బృందాలు..
గ్రామ పంచాయతీల్లో పన్ను వసూళ్లు చేసేందుకు జిల్లా పంచాయతీ అధికారులు ప్రత్యేక బృందా లను నియమించారు. నాలుగైదు పంచాయతీల కు ఒక బృందం చొప్పున సభ్యులు గ్రామాల్లో తిరుగుతున్నారు. ఈ బృందాలలో పంచాయతీ కార్యదర్శి, కారోబర్, వీసీవో, సాక్షరభారత్ కో–ఆర్డినేటర్లు, ఇతర అధికారులు ఉన్నారు. అయితే జిల్లాలో ఇది వరకే కొన్ని జీపీలో 100 శాతం పన్ను వసూలైంది. అయితే ఆ పంచాయతీ పరిధిలోని అధికారులు, సిబ్బంది వందశాతం చేరుకొని పంచాయతీల్లో పన్ను వసూలు చేయడంలో భాగస్వాములు అవుతున్నారు.
సిబ్బంది ఎక్కువై పన్ను వసూళ్ల లక్ష్యం త్వరగా చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనికి తోడు పంచాయతీ కార్యదర్శులు, ఏవోపీఆర్డీలకు వేర్వేరుగా వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేశారు. పన్ను వసూళ్ల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులను ఈ గ్రూపుల్లో షేర్ చేసుకుంటూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లక్ష్యం సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో జిల్లాలో పన్ను వసూలు సిబ్బంది సుమారు 220 నుంచి 250 మంది వరకు ఉన్నట్లు , బృందాలుగా పన్ను వసూలు చేస్తే పని సులువుగా ఉంటుందని చెబుతున్నారు.
నెలాఖరులోగా లక్ష్యాన్ని చేరుకుంటాం
ఇంటి పన్ను వసూలు ప్రస్తుతం జోరుగా సాగుతుంది. ఈ నెలాఖరులోగా నిర్దేశించిన లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటాం. ఈ రెండు నెలల్లో భారీగా పన్ను వసూలైంది. జిల్లాలో కొన్ని జీపీల్లో ఇప్పటికే వందశాతం ఇంటి పన్ను వసూలైంది. పన్ను వసూలుకు ప్రణాళికతో ముందుకెళ్లడంతో అన్ని జీపీల్లో వంద శాతం వసూలు చేస్తున్నాం. గడువులోగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం.
– సాయిబాబా, జిల్లా పంచాయతీ అధికారి, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment