Tax collected
-
దేశ చరిత్రలో ఇదే తొలిసారి! కరోనా ఉన్నా..అదరగొట్టిన పన్నువసూళ్లు, ఏకంగా!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్–2022 మార్చి) రెండు కరోనా వేవ్‌లను తట్టుకుని పటిష్ట రికవరీ బాటన పయనించిందనడానికి సంకేతంగా పటిష్ట పన్ను వసూళ్ల గణాంకాలు వెలువడ్డాయి. అధికారిక గణాంకాల ప్రకారం మార్చి 15వ తేదీ వరకూ ప్రత్యక్ష పన్ను వసూళ్లు 48 శాతంపైగా పెరిగితే, అడ్వాన్స్ పన్ను చెల్లింపులు 41 శాతం ఎగశాయి. ఈ స్థాయి వసూళ్లు భారత్ చరిత్రలో ఇదే తొలిసారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2020–21 ఆర్థిక సంవత్సరం కోవిడ్–19 సవాళ్ల నుంచి బయటపడుతున్న సమయంలోనే 2021 ఏప్రిల్, మేలలో రెండవవేవ్ దేశాన్ని కుదిపివేసింది. 2021 ప్రారంభంలో వచ్చిన థర్డ్ వేవ్ తీవ్ర ప్రాణనష్టాన్ని కలిగించకపోయినా, స్థానిక ఆంక్షల వల్ల బిజినెస్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. అయినప్పటికీ పన్ను వసూళ్లు చరిత్ర సృష్టించిన పన్ను వసూళ్ల గణాంకాలను పరిశీలిస్తే... ►2022 మార్చి 16 వరకూ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు (వ్యక్తులు, కార్పొరేట్ల నుంచి) గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చిచూస్తే 48 శాతం పెరిగి రూ.9,18,431 కోట్ల నుంచి 13,63,038 కోట్లకు ఎగశాయి. దేశంలోకి కరోనా సమస్య ప్రవేశించకముందు పరిస్థితితో పోల్చినా (2019–20లో రూ.9.56 లక్షల కోట్లు) తాజాగా వసూళ్లు 42 శాతం పెరిగాయి. ► రిఫండ్స్ రూ.1.87 లక్షల కోట్లు మినహాయించగా, నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లలో కార్పొరేట్ ఆదాయపు పన్ను పరిమాణం రూ.7,19,035 కోట్లుకాగా, ఎస్‌టీటీసహా వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు రూ.6,40,588 కోట్లు. రిఫండ్స్‌ను కూడా కలుపుకుంటే, మొత్తం వసూళ్లు రూ.11,20,639 కోట్ల నుంచి రూ.15,50,364 కోట్లకు చేరింది. ► ఇక మార్చి 15వ తేదీతో ముగిసిన నాల్గవ విడత ముందస్తు (అడ్వాన్స్) ట్యాక్స్ చెల్లింపుల గడువును పరిశీలిస్తే, సమీక్షా కాలంలో ఈ పరిమాణం 40.75 శాతం పెరిగి రూ.6.62 లక్షల కోట్లకు ఎగసింది. 2020–21 ఇదే కాలంలో ఈ వసూళ్లు రూ.4,70,984.4 కోట్లు. మొత్తం అడ్వాన్స్ పన్నులు రూ.6,62,896.3 కోట్లలో రూ.4,84,451.8 కోట్లు కార్పొరేట్ల నుంచి రాగా, వ్యక్తిగత పన్నుల పరిమాణం రూ.1,78,441.1 కోట్లుగా ఉంది. అయితే ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఈ విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. ► మొత్తం వసూళ్లలో అడ్వాన్స్ ట్యాక్స్ రూ.6,62,896.3 కోట్లుకాగా, 6,86,798.7 కోట్లు మూలం వద్ద పన్ను మినహాయింపునకు సంబంధించినది. రూ. 1,34,391.1 కోట్ల స్వీయ–అసెస్మెంట్ పన్ను, సాధారణ మదింపు పన్ను రూ. 55,249.5 కోట్లు, డివిడెండ్ పంపిణీ పన్ను రూ. 7,486.6 కోట్లు. ఇతర మైనర్ హెడ్ల కింద వసూళ్లు రూ. 3,542.1 కోట్లు. ► మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్లలో దాదాపు 53 శాతం కార్పొరేట్ పన్ను నుండి వచ్చింది. 47 శాతం షేర్లపై సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్టీటీ) సహా వ్యక్తిగత ఆదాయ పన్ను నుండి లభించింది. ► 2021–22లో ప్రత్యక్ష పన్ను వసూళ్ల బడ్జెట్ అంచనా రూ.11.08 లక్షల కోట్లు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో దీనిని రూ.12.50 లక్షల కోట్లకు సవరించారు. ఈ అంచనాలకన్నా అధికంగా నికర పన్ను వసూళ్లు అధికంగా ఉండడం గమనార్హం. 6.63 కోట్ల ఐటీఆర్‌లు గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2020–21) సంబంధించి ఈ నెల 15 నాటికి 6.63 కోట్ల ఐటీఆర్‌లు ఈ ఫైలింగ్ పోర్టల్‌పై దాఖలయ్యాయి. గతేడాదితో పోలిస్తే 16.7 లక్షల రిటర్నులు అధికంగా దాఖలైనట్టు ఆదాయపన్ను శాఖ (ఐటీ) ప్రకటించింది. కార్పొరేట్లు, ఆడిట్ రిపోర్ట్లు దాఖలు చేయాల్సిన ఇతర పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్‌లు దాఖలు చేసేందుకు గడువు మార్చి 15తో ముగిసింది. ఒక్క చివరి తేదీనే 5.43 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ఈ మేరకు రిటర్నుల గణాంకాలను ఐటీ శాఖ బుధవారం విడుదల చేసింది. ఐటీఆర్–1 (3.03 కోట్లు), ఐటీఆర్–2 (57.6లక్షలు), ఐటీఆర్–3 (1.02 కోట్లు), ఐటీఆర్–4 (1.75 కోట్లు), ఐటీఆర్–5 (15.1లక్షలు), ఐటీఆర్–6 (9.3లక్షలు), ఐటీఆర్–7 (2.18లక్షల) చొప్పున ఉన్నాయి. -
పన్ను వసూళ్లు @ 17.28 కోట్లు
సాక్షి,ఆదిలాబాద్ అర్బన్: ఇంటి పన్ను వసూళ్లలో ఉమ్మడి జిల్లా కొంత మెరుగుపడింది. పన్నులు వసూలు చేయడంలో ఎప్పుడు వెనుకబడి ఉండే ఆదిలాబాద్ ఈ ఏడాది ముందు వరుసలో నిలిచేందుకు సిద్ధమవుతోంది. జిల్లాల వారీగా పన్ను వసూలు లక్ష్యాన్ని ముందుగానే చేరుకునే పరిస్థితి కనిపిస్తోంది. నాలుగు జిల్లాల పంచాయతీ అధికారులు పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చాలెంజ్‌గా తీసుకొని వసూలు చేస్తున్నారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులతోపాటు సిబ్బంది నానాఅవస్థలు పడుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా పన్ను కూడా వసూలు అవుతోంది. గడిచిన రెండు నెలల్లో భారీగా పన్ను వసూలు అయినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. పన్ను వసూలు శాతాన్ని జిల్లాల వారీగా గమనిస్తే.. రెండు నెలల కిందట 28వ స్థానంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం 61 శాతం పన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే ఏడోస్థానం సాధించింది. మంచిర్యాల జిల్లా 58.79 శాతం, కుమురంభీం జిల్లా 57.64 శాతం పన్ను వసూలు చేసి రాష్ట్రంలో ఎనిమిది, తొమ్మిది స్థానాలను పదిలం చేసుకున్నాయి. ఇక నిర్మల్ జిల్లా 47.75 శాతం పన్ను వసూలు చేసి 20వ స్థానంలో ఉంది. అయితే అధికారులు వసూలు చేసే పన్నులో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది ఇంటి పన్ను (ట్యాక్స్) కాగా, రెండోది నాన్ ట్యాక్స్ ఉంది. జిల్లా లక్ష్యం వసూలైంది శాతం ఆదిలాబాద్ రూ.5,06,50,733 రూ.3,08,98,625 61 మంచిర్యాల రూ.4,60,93,108 రూ.2,70,98,771 58.79 కుమురంభీం రూ.3,51,85,189 రూ.2,02,82,159 57.64 నిర్మల్ రూ.4,08,82,404 రూ.1,95,22,580 47.75 మొత్తం రూ.17,28,11,434 రూ.7,82,79,555 56.2 నెల రోజుల్లో సాధ్యమేనా.? ఆయా జిల్లాల జిల్లా పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీల వారీగా ఇంటి పన్ను వసూలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేశారు. ఈ ప్రణాళిక ప్రకారం గత రెండు నెలల నుంచి ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు. అయితే నవంబర్, డిసెంబర్లోనే పన్ను వసూలు చేపట్టిన సిబ్బంది అంతగా శ్రద్ధ చూపకపోవడంతో తక్కువగా వసూలైంది. దీనికి తోడు అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల సందడి కూడా తోవడంతో వసూలు లక్ష్యం మందగించింది. జనవరి మొదటి నుంచి ఇప్పటి వరకు గ్రామాల్లో జోరుగా పన్ను వసూలు జరుగుతోంది. ఒక్కో ఇంటికి రూ.85 నుంచి రూ.350కిపైగా వసూలు చేస్తున్నారు. ఇందులో కొంత మంది ఇంటి యాజమానులు రెండేళ్ల పన్ను కట్టని సంఘటనలు ఉన్నాయి. ప్రతీ ఏటా జనవరి, ఫిబ్రవరిలో పన్ను వసూలుకు ఉరుకులు పరుగులు పెట్టే అధికారులు ఈ ఏడాది ముందుగానే లక్ష్యాన్ని చేరుకునేలా కనిపిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా ఇరవై ఏడు రోజుల సమయమే మిగిలి ఉంది. అయితే ఈ ఇరవై ఏడురోజుల్లో రూ.9,45,31,879 లను వసూలు చేయగలరా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పన్ను వసూళ్లకు ప్రత్యేక బృందాలు.. గ్రామ పంచాయతీల్లో పన్ను వసూళ్లు చేసేందుకు జిల్లా పంచాయతీ అధికారులు ప్రత్యేక బృందా లను నియమించారు. నాలుగైదు పంచాయతీల కు ఒక బృందం చొప్పున సభ్యులు గ్రామాల్లో తిరుగుతున్నారు. ఈ బృందాలలో పంచాయతీ కార్యదర్శి, కారోబర్, వీసీవో, సాక్షరభారత్ కో–ఆర్డినేటర్లు, ఇతర అధికారులు ఉన్నారు. అయితే జిల్లాలో ఇది వరకే కొన్ని జీపీలో 100 శాతం పన్ను వసూలైంది. అయితే ఆ పంచాయతీ పరిధిలోని అధికారులు, సిబ్బంది వందశాతం చేరుకొని పంచాయతీల్లో పన్ను వసూలు చేయడంలో భాగస్వాములు అవుతున్నారు. సిబ్బంది ఎక్కువై పన్ను వసూళ్ల లక్ష్యం త్వరగా చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనికి తోడు పంచాయతీ కార్యదర్శులు, ఏవోపీఆర్డీలకు వేర్వేరుగా వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేశారు. పన్ను వసూళ్ల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులను ఈ గ్రూపుల్లో షేర్ చేసుకుంటూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లక్ష్యం సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో జిల్లాలో పన్ను వసూలు సిబ్బంది సుమారు 220 నుంచి 250 మంది వరకు ఉన్నట్లు , బృందాలుగా పన్ను వసూలు చేస్తే పని సులువుగా ఉంటుందని చెబుతున్నారు. నెలాఖరులోగా లక్ష్యాన్ని చేరుకుంటాం ఇంటి పన్ను వసూలు ప్రస్తుతం జోరుగా సాగుతుంది. ఈ నెలాఖరులోగా నిర్దేశించిన లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటాం. ఈ రెండు నెలల్లో భారీగా పన్ను వసూలైంది. జిల్లాలో కొన్ని జీపీల్లో ఇప్పటికే వందశాతం ఇంటి పన్ను వసూలైంది. పన్ను వసూలుకు ప్రణాళికతో ముందుకెళ్లడంతో అన్ని జీపీల్లో వంద శాతం వసూలు చేస్తున్నాం. గడువులోగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం. – సాయిబాబా, జిల్లా పంచాయతీ అధికారి, ఆదిలాబాద్ -
పన్ను వసూళ్లలో పులివెందుల ఫస్ట్
పులివెందుల టౌన్ : ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి 99.68 శాతం ఇంటి పన్ను వసూళ్లతో రాష్ట్రంలో పులివెందుల మున్సిపాలిటీ ప్రథమ స్థానం సాధించింది. ఈ సందర్భంగా శనివారం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ సమావేశం నిర్వహించి అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఆమె మాట్లాడుతూ.. పన్నులు చెల్లించడంలో ప్రజలు సహకరించినందున, వారి సమస్యలు సత్వరమే పరిష్కరించడానికి మున్సిపల్ ఉద్యోగులు చొరవ చూపాలన్నారు. మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద చెట్లు పెంచి స్మార్ట్ వార్డులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించామన్నారు. వ్యాపారపరమైన కొళాయి కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వార్డుల్లో అపరిశుభ్రత లేకుండా కౌన్సిలర్లు దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చెర్మైన్ చిన్నప్ప, మాజీ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, కౌన్సిలర్లు, ఆర్ఓ రంగారావు, డీఈలు శేఖర్, ఓంప్రకాష్, ఏఈలు రామకృష్ణారెడ్డి, సుమన్‌రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ రాముడు, మేనేజర్ మురళి తదితరులు పాల్గొన్నారు.