పన్ను వసూళ్లలో పులివెందుల ఫస్ట్
పులివెందుల టౌన్ : ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి 99.68 శాతం ఇంటి పన్ను వసూళ్లతో రాష్ట్రంలో పులివెందుల మున్సిపాలిటీ ప్రథమ స్థానం సాధించింది. ఈ సందర్భంగా శనివారం మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ సమావేశం నిర్వహించి అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఆమె మాట్లాడుతూ.. పన్నులు చెల్లించడంలో ప్రజలు సహకరించినందున, వారి సమస్యలు సత్వరమే పరిష్కరించడానికి మున్సిపల్ ఉద్యోగులు చొరవ చూపాలన్నారు.
మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద చెట్లు పెంచి స్మార్ట్ వార్డులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించామన్నారు. వ్యాపారపరమైన కొళాయి కనెక్షన్‌లకు మీటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
వార్డుల్లో అపరిశుభ్రత లేకుండా కౌన్సిలర్లు దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చెర్మైన్ చిన్నప్ప, మాజీ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, కౌన్సిలర్లు, ఆర్‌ఓ రంగారావు, డీఈలు శేఖర్, ఓంప్రకాష్, ఏఈలు రామకృష్ణారెడ్డి, సుమన్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రాముడు, మేనేజర్ మురళి తదితరులు పాల్గొన్నారు.