పులివెందుల రూరల్ : పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లెలో ఆరు ఎకరాల్లో అరటి తోట అగ్నికి ఆహుతైంది. బాధితుల కథనం మేరకు.. బ్రాహ్మణపల్లె మాజీ సర్పంచ్ మల్‌రెడ్డి ఆరు ఎకరాల్లో అరటి సాగు చేశారు. ఇంకో నెలలో కోతకు సిద్ధమవుతున్న తరుణంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఉన్నట్లుండి మంటలు వ్యాపించడాన్ని సమీపంలోని తోటల రైతులు గమనించారు. మల్‌రెడ్డి, అగ్నిమాక శాఖ అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. ఫైర్‌స్టేషన్ అధికారి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు.
పక్క తోటలకు మంటలు వ్యాపించకుండా పొలం గట్లను నీటితో తడిపారు. దీంతో పక్క తోటల రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో డ్రిప్ పరికరాలు కాలి బూడిదయ్యాయని, పంట పూర్తిగా పోయిందని బాధిత రైతు మల్‌రెడ్డి తెలిపారు. రూ.10 లక్షలు నష్టం సంభవించిందన్నారు. తోటలో ఎండిన ఆకులు అధికంగా ఉండటంతో మంటలు చెలరేగాయి. ఎండిన అరటి ఆకులు తొలగించాలని అగ్ని మాపక శాఖాధికారులు సూచిస్తున్నా, తేమ ఆరిపోకూడదని రైతులు ఆ పని చేయడం లేదు. కాగా ఇది ప్రమాదమా, లేక ఆకతాయిల పనా అన్నది స్పష్టం కాలేదు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన వైఎస్ మనోహర్‌రెడ్డి
అగ్ని ప్రమాదంలో కాలిపోయిన అరటి తోటను వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ మున్సిపల్ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చెర్మైన్ చిన్నప్పలు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్లు వరప్రసాద్, చెన్నారెడ్డి, రామనాథ్, రమాదేవి, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు రామచంద్రారెడ్డి, శివకుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనివాసులరెడ్డి తదితరులు ఘటనా స్థలిని పరిశీలించారు.
అరటి తోట బుగ్గిపాలు
Published Tue, Mar 17 2015 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM
Advertisement