రైల్వేకోడూరు: అత్యధికంగా పండ్లతోటలు ఉండే ఏకైక ప్రాంతంగా రైల్వేకోడూరు నియోజకవర్గం జిల్లాలోనే ప్రసిద్ధిగాంచింది. అయితే అరటి, మామిడి పంటలు చేతికొచ్చే సమయంలో ప్రకృతి ప్రకోపం కారణంగా పంట చేతికి వచ్చి కాయలు కోసే దశలో నేలపాలు కావడంతో రైతులు కుదేలవుతున్నారు. అయిపోతున్నాడు. బాగా దిగుబడి వచ్చింది, అప్పుల ఊబి నుంచి బయటపడతామని అనుకుంటుండగానే గత నెల 15వ తేదీ పెద్ద ఎత్తున వీచిన గాలి వానకు పుల్లంపేట, రైల్వేకోడూరు మండలాల్లో వందల ఎకరాల్లో అరటి నేల మట్టంకాగా, మామిడి కాయలు అన్ని మండలాల్లో నేల రాలిపోయాయి. అలాగే గత నెల చివరలో వచ్చిన ఈదురు గాలులకు ఒక్క పుల్లంపేట మండలంలోనే దాదాపు 120 ఎకరాల్లో అరటి నేలకొరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22న ఆదివారం సాయంత్రం గాలి వానతో పాటు వడగండ్ల వాన రావడంతో మరోసారి వందల ఎకరాల్లో అరటి నేలకొరిగింది. దీంతో రైతులు దిక్కు తోచని స్థితిలో దిగాలు పడిపోయారు.
పంట నష్టం గురించి రైతులు సమాచారం ఇచ్చినా అటు వైపు ఏ అధికారి కన్నెత్తి చూడటంలేదు. రెవెన్యూ, ఉద్యానవన అధికారులు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ కనీసం సర్వే చేసేందుకు కూడా ముందుకు రాకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. ఎట్టకేలకు తాము ప్రాధేయపడితే ఉద్యానవన అధికారులు వచ్చి తూతూ మంత్రంగా సర్వే చేసి వెళ్లారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు గట్టిగా ప్రశ్నిస్తే మీ తోటలో మీరు నిలబడి ఫొటోలు, ఆధార్‌కార్డు, పాసుపుస్తకాల జిరాక్సు కాపీలు తెమ్మని ఆదేశిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టం వాటిల్లితే తక్షణమే స్పందించి సర్వే చేయించి రైతులను ఆదుకొనేవారని రైతులు గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం కూడా రైతులకు అంతో ఇంతో సహాయం అందించిందని.. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం గత నాలుగేళ్ల కాలంలో ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన రైతులను ఆదుకున్న పాపాన పోలేదని రైతులు దుమ్మెత్తి పోస్తున్నారు.
ప్రకృతితో నష్టపోయిన రైతు తిరిగి అదే భూమిలో మరో పంట పండించుకునేందుకు అయ్యే నామమాత్రపు ఖర్చును సైతం అందజేయని ఈ ప్రభుత్వం రైతుకు మేలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం దుర్మార్గపు చర్యగా రైతులు అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకుంటే లక్షల్లో నష్టపోయిన రైతులు కోలుకోవడం కష్టమేననే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అరటి పంట నేలకొరిగిన పొలాలను జిల్లా కలెక్టర్ పరిశీలించి, రైతులకు నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.
ఉద్యానవన అధికారులకునియంత్రణ లేదా..
ప్రతి మండలంలో రైతులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఉద్యానవన అధికారులను నియమించింది. కానీ ఈ శాఖకు చెందిన మండల స్థాయి అధికారులు రైతులకు చుక్కలు చూపిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు వీరి చర్యలపై దృష్టి సారించి వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి
నేను సాగు చేసిన ఐదు ఎకరాలలోని అరటి చెట్లు గాలి దెబ్బకు పడిపోయాయి. మళ్లీ పైరు పెట్టాలంటే కష్టంగా ఉంది. ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలి.
–భీము రామచంద్రారెడ్డి, అరటిరైతు, మల్లెంవారిపల్లి, పుల్లంపేట మండలం.
Comments
Please login to add a commentAdd a comment