సాక్షి, రైల్వేకోడూరు(కడప) : రైల్వేకోడూరు పట్టణం రంగనాయకులపేటకు చెందిన అబ్దుల్ ఖాదర్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతనికి ఈనెల 23న తన అత్త కూతురితో వివాహం జరగాల్సి ఉండింది. ఇంతలో ఈనెల 5న రంజాన్ పండుగ సందర్భంగా సొంత ఊరికి వచ్చి బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యను పలు కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు మిస్టరీని ఛేదించారు.
పెళ్లి కూతురిగా పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి తన ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించారు. ఈమేరకు సీఐ బాలయ్య విలేకరులకు వివరాలు వెల్లడించారు. అబ్దుల్ ఖాదర్‌కు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా గుమ్మడిపూడిలో ఉంటున్న తన సొంత మేనత్త కూతురు శబ్నతో ఈ నెల 23న వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. అయితే అప్పటికే శబ్న అదే గ్రామానికి చెందిన ప్రిన్స్ అనే యువకుడిని ప్రేమించింది. ఆమె తన ప్రియుడితోనే సంబంధం కొనసాగించాలని నిర్ణయించుకుంది.
ఈ నేపథ్యంలో తనకు కాబోయే భర్తను చంపమంటావా లేకుంటే నీవు చంపుతావా అని తన ప్రియుడిని ప్రశ్నించింది. దీంతో ప్రియుడు ప్రిన్స్ తన స్నేహితులైన దీనదయాల్‌కు రూ.1.50 లక్షలు, సెల్వంకు రూ.2లక్షలు, లక్ష్మణ్‌కు రూ.3 లక్షలు, బ్రిస్టన్‌కు రూ.50వేలు డబ్బులు ఇచ్చి ఎలాగైనా తన ప్రియురాలికి కాబోయే భర్త అబ్దుల్ ఖాదర్‌ను హతమార్చాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నెల 5వ తేదీన రంజాన్ పండుగ రోజున ఉదయం 5.30 గంటలకు అబ్దుల్‌ఖాదర్ రైల్వేకోడూరులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బస్సు దిగాడు.
అక్కడే పాలప్యాకెట్ తీసుకుని ఇంటికి వెళ్తుండగా సమీపంలోనే మాటు వేసి ఉన్న దుండగులు కృష్ణా హాల్ పక్క వీధిలో కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘాతుకానికి పాల్పడిన శబ్న ప్రియుడు ప్రిన్స్‌ను, అతని స్నేహితులు సెల్వం, దీనదయాల్‌ను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి మారుతి వాహనం, రూ. లక్షా 50 వేలు నగదు, వేట కొడవళ్లు, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment