హత్యాయత్నం కేసులో పదిమంది అరెస్ట్‌  | Ten arrested in murder attempt case | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం కేసులో పదిమంది అరెస్ట్‌ 

Published Mon, Mar 19 2018 7:03 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

Ten arrested in murder attempt case - Sakshi

అరెస్టు వివరాలను తెలియజేస్తున్న డీఎస్పీ మాసుంబాషా

కడప అర్బన్‌ : కడప నగరంలోని చిన్నచౌకు పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈనెల 16వ తేదీన శంకరాపురం మహేంద్ర పెట్రోలు బంకు వద్ద రౌడీషీటర్‌ వినయ్‌కుమార్‌రెడ్డి, అతని అనుచరులు కలిసి పెద్దముడియం అహ్మద్‌బాషా అనే వ్యక్తిపై హత్యాయత్నం చేశారు. ఈ కేసులో బాధితుడి ఫిర్యాదు మేరకు వినయ్‌కుమార్‌రెడ్డి, అతని అనుచరులు 21 మందిపై చిన్నచౌకు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా ఆదివారం సాయంత్రం చిన్నచౌకు సీఐ రామకృష్ణ, వన్‌టౌన్‌ సీఐ టీవీ సత్యనారాయణ, తాలూకా ఎస్‌ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి, చిన్నచౌకు ఎస్‌ఐ మోహన్‌లు తమ సిబ్బందితో పది మందిని దేవుని కడప సమీపంలోగల డాబా వద్ద అరెస్టు చేశారు.

వారిని కడప డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హాజరు పరిచారు. ఈ సందర్భంగా  డీఎస్పీ షేక్‌ మాసుంబాషా మాట్లాడుతూ అహ్మద్‌బాషాపై హత్యాయత్నానికి గల కారణాలను వివరించారు. 2017 అక్టోబరు 11న ఓం శాంతినగర్‌లో ఓ కారును కాల్చిన కేసులో వినయ్‌కుమార్‌రెడ్డి అలియాస్‌ వినయ్‌రెడ్డి, పవన్‌ అలియాస్‌ సైకో పవన్‌లు నిందితులుగా ఉన్నారన్నారు.ఈ కేసులో పెద్దముడియం అహ్మద్‌బాషా ఫిర్యాదుదారుడు మధుసూదన్‌రెడ్డికి సహాయంగా వెళ్లి ఫిర్యాదు రాయించినందుకు అతనిపై కక్షతో పథకం ప్రకారం దాడికి పాల్పడ్డారన్నారు.

అరెస్టు అయిన వారిలో బీటెక్‌ చదువుతున్న సుండుపల్లె మండలం తిమ్మసముద్రానికి చెందిన మోపూరు ప్రవీణ్, డిగ్రీ చదువుతూ రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న కడప నగరం రైల్వేస్టేషన్‌రోడ్డులో నివసిస్తున్న పెండ్లిమర్రి నవనీత్‌ అలియాస్‌ నాని, కడప కుమ్మరికుంట వీధిలో నివసిస్తున్న, రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న షేక్‌ అక్రమ్‌ నజీర్‌ అలియాస్‌ అక్రమ్, గాంధీ వీధి సమీపంలో నివసిస్తూ బీటెక్‌ చదువుతున్న దౌజీ ఫహాద్‌ఖాన్, ఇంజనీరింగ్‌ చదువుతూ అగాడికి చెందిన షేక్‌ అజాస్‌బాషా, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా ఉంటూ బళ్లారిరోడ్డులో నివసిస్తున్న షేక్‌ అబ్దుల్‌ వాహిద్, చెన్నూరులోని గాంధీనగర్‌కు చెందిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి చల్లా రఘువంశీ అలియాస్‌ కార్తీక్, వల్లూరు మండలం పెద్దపుత్తకు చెందిన డిగ్రీ విద్యార్థి పీసుగాళ్ల సాయి మధు అలియాస్‌ సన్ని, ఎంబీఏ చదువుతూ రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న కమలాపురం టౌన్‌తూర్పు గండ్లూరు కాలనీకి చెందిన దొడ్డగాళ్ల నవీన్‌కుమార్, మరో ఎంబీఏ విద్యార్థి ఎర్రముక్కపల్లెలో నివసిస్తున్న చాపల శివకిశోర్‌ అలియాస్‌ కిశోర్‌లు ఉన్నారన్నారు.

ప్రధాన నిందితుడు రౌడీషీటర్‌ వినయ్‌కుమార్‌రెడ్డి అలియాస్‌ వినయ్‌రెడ్డిలతోపాటు మరో 11 మంది కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామన్నారు. నిందితుల వద్దనుంచి ఆరు మోటారు సైకిళ్లు, రెండు కత్తులు, ఒక ఇనుపరాడ్డు, కర్ర స్వాధీనం చేసుకున్నామన్నారు.∙రౌడీయిజం, దౌర్జన్యాలకు పాల్పడే వారిపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ షేక్‌ మాసుంబాషా హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల నడవడికను గమనిస్తూ ఉండాలన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement