వైఎస్సార్ : కడపలో హోమియోపతి డాక్టర్ అన్నపూర్ణమ్మ హత్య కేసులో ఆమె భర్త దాస లక్ష్మయ్యను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నపూర్ణమ్మ హత్య విషయమై పోలీసులు లక్ష్మయ్యను విచారించగా.. కుటుంబ కలహాలతోనే భార్య తలపై సుత్తితో కొట్టి హతమార్చినట్లు లక్ష్మయ్య ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును తప్పింబోయే ప్రయత్నంలో లక్ష్మయ్య పోలీసులకు అడ్డంగా దొరికిపోయినట్లు డీఎస్పీ సునీల్ తెలిపారు.
కాగా అన్నపూర్ణమ్మ డిసెంబరు 22న ఓం శాంతి నగర్‌లోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అన్నపూర్ణమ్మ ఒక్కగానొక్క కూతురు జార్జియాలో మృతి చెందింది. అయితే కుమార్తె శవాన్ని స్వదేశానికి రప్పించేందుకు అన్నపూర్ణమ్మ లక్షల్లో అప్పు చేసింది. అయితే చేసిన అప్పులో తనకు కొంతమేర నగదు ఇవ్వాలని లక్ష్మయ్య భార్యపై ఒత్తిడి తెచ్చాడు. అయితే అన్నపూర్ణమ్మ డబ్బు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో ఆవేశంలో ఆమె తలపై సుత్తితో బలంగా బాదాడు. తీవ్ర రక్తస్రావంలో ఉన్న భార్యను తీసుకెళ్లి సమీప ఆసుపత్రిలో చేర్చాడు. డాక్టర్ల వద్ద అసలు విషయాన్ని గోప్యంగా ఉంచిన లక్ష్మయ్య కింద పడి గాయాలపాలయ్యందని.. ఆమెకు చికిత్స చేయాలని కోరాడు. డాక్టర్లు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment