banana garden
-
అమ్మా నన్ను ఎందు‘కని’ పడేశారు..?
‘‘అమ్మా నన్ను ఎందుకని పడేశారు..? ఆడపిల్లగా పుట్టినందుకా.? లేక ఆర్థికంగా భారమవుతున్నందుకా.? నీ ఒడిలో ఉండాల్సిన నేను.. ఇలా అరటితోటలో పడిఉన్నానే.. నా ఈ దుస్థితికి కారణం ఎవరమ్మా..? ఏంటమ్మా?’’అని ప్రశ్నించలేని పసి మనసు తనది. రైల్వేకోడూరు రూరల్: అరటి తోటలో పడిఉన్న పసికందును ఐసీడీఎస్ అధికారులు అక్కున చేర్చుకున్నారు. ఈ సంఘటన రైల్వేకోడూరు మండలంలోని వీవీ కండ్రిక దళితవాడ సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, ఐసీడీస్ సీడీపీఓ రాజమ్మ వివరాల మేరకు.. వీవీ కండ్రిక దళితవాడ సమీపంలో శనివారం తెల్లవారుజామున అరటి తోటలో చిన్నారి ఏడుపులు వినిపించాయి. దీంతో కౌలు రైతు చంద్ర పరుగున వెళ్లి చూడగా పసికందు కనిపించింది. చంద్ర స్థానిక అంగన్వాడీ వర్కరు లక్ష్మీదేవికి, గ్రామస్తులకు సమాచారం అందించాడు. వారు ఆ బిడ్డను తీసుకెళ్లి రైల్వేకోడూరు పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో వైద్యం చేయించారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎస్ఐ పెద్ద ఓబన్నకు విషయం తెలిపారు. ఈ ఘటనపై ఎస్ఐ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డగా ఉందని, ఆడబిడ్డ కావడంతో ఎవరైనా పడేసి ఉంటారా? మరేమైనా జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తామన్నారు. శిశువును కడప రిమ్స్‌కు తీసుకెళ్లి మెరుగైన వైద్యం చేయించి, ఐసీడీఎస్ తరుఫున శిశు గృహలో చేర్పిస్తామని ఎస్ఐ తెలిపారు. చదవండి: ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్ష తీరానికి కొట్టుకొచ్చిన భారీ తాబేలు.. -
20 ఎకరాల అరటితోట దగ్ధం
వైఎస్ఆర్ జిల్లా, ఎస్ఆర్పురం(రాజంపేట రూరల్) : మండల పరిధిలోని ఎస్ఆర్ పురంలో 20 ఎకరాల భూమిలో ఉన్న అరటితోట అగ్నికి ఆహుతి అయింది. గురువారం మధ్యాహ్నం సమయంలో విద్యుత్ తీగల మధ్య రాపిడికి నిప్పులు పడి మంటలు చెలరేగడంతో నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో పోకల ప్రభాకర్ కుటుంబానికి చెందిన 15 ఎకరాలు, గుర్రకొండ ఈశ్వర జయప్రకాష్‌కు చెందిన ఐదు ఎకరాల పొలం బూడిద పాలైంది. ఒక్కసారిగా ఎగిసిపడటంతో ఆర్పేందుకు రైతులు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న ఫైర్ ఆఫీసర్ టి. టిబన్ సిబ్బందితో కలిసి ఎగిసిపడుతున్న మంటలు ఆర్పివేశారు. ఆ సమయానికే 20 ఎకరాలలోని అరటి తోటలో ఉన్న దాదాపు వేలాది అరటి చెట్లు దగ్ధమయ్యాయి. అలాగే డ్రిప్ పరికరాలు, లేటర్లు కూడా కాలిపోయాయి. చేతికి వచ్చిన పంటతో పాటు, డ్రిప్ పైపులు, లేటర్లు కాలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. రూ.5 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. కాగా ఈ మంటల ధాటికి పక్కనే ఉన్న అడవి కూడా అంటుకుంది. -
మాటలకందని విషాదం
అరటి తోటలో కాపు కాసిన మృత్యువు నలుగురిని మింగేసింది. పెళ్లి పనులతో సందడిగా ఉన్న ఇంటిలో భయానక నిశ్శబ్దాన్ని నింపింది. ప్రశాంతంగా ఉన్న రెండు పల్లెల గుండెల్లో విషాదపు కుంపటి రాజేసింది. భవిష్యత్ కోసం కోటి కలలు కంటున్న వధూవరుల కళ్లల్లో కన్నీళ్లు కుమ్మరించింది. విద్యుత్ శాఖ నిర్లక్ష్యాన్ని మరీ కర్కశంగా చూపిస్తూ మూడు కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. లావేరు మండలంలోని కొత్తరౌతుపేటలో ఆదివారం విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందిన సంఘటన జిల్లావ్యాప్తంగా మాటలకందని విషాదాన్ని నింపింది. మృతులంతా బంధువులే కావడం గమనార్హం. శ్రీకాకుళం, లావేరు: లావేరు మండలంలోని తామాడ పంచాయతీ కొత్తరౌతుపేట గ్రామంలో ఆదివారం విద్యుత్ షాక్ తగిలి కొమ్ము వెంకన్న(48), ఆబోతుల రాముడు(60), అతని భార్య ఆబోతుల పుణ్యవతి(50), రౌతు బంగారమ్మ(45) అనే నలుగురు మృతి చెందారు. పెళ్లి పనులు ప్రారంభించడం కోసం తోటలోఅరటి గెలలు కోస్తుండగా విద్యుదాఘాతంతో మృతి చెందారు. మృతులు కొత్తరౌతుపేట, పాతరౌతుపేట గ్రామాలకు చెందిన వారు. వీరి మృతి వార్త తెలియడంతో రెండు గ్రామాల్లో విషాదం అలముకుంది. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతరౌతుపేట గ్రామానికి చెందిన కొమ్ము వెంకన్న కుమారుడు శ్రీనుకు మార్చి 27వ తేదీన వివాహం చేయాలని ముహూర్తం నిర్ణయించారు. పెళ్లి పనుల ప్రారంభానికి సూచికగా ఈ నెల 6వ తేదీన పసుపు దంచాలని నిశ్చయించారు. ఈ వేడుకకు అరటి గెలలు అవసరం కావడంతో కొత్తరౌతుపేటలో ఉంటున్న తన బావ ఆబోతుల వెంకన్న అరటి తోటకు ఇద్దరూ కలిసే వెళ్లారు. అరటి గెలలు కోస్తుండగా కిందకు వేలాడి ఉన్న విద్యుత్ తీగ తలిగి ఇద్దరూ షాక్‌తో అక్కడే మృతి చెందారు. మధ్యాహ్నం ఒంటి గంట అయినా వీరిద్దరూ తోట నుంచి తిరిగి రాకపోవడంతో ఆ పక్కనే మరో తోటలో గొప్పు తవ్వుతున్న రాముడు భార్య పుణ్యవతి, కొత్తరౌతుపేటకు చెందిన మరో మహిళ రౌతు బంగారమ్మలు వెంకన్న తోటలోనికి వెళ్లారు. అక్కడ కిందపడి ఉన్న వీరిని చూసి వారిని పైకి లేపడానికి ప్రయత్నించగా వారికీ విద్యుత్ షాక్ తగిలింది. దీంతో వారు అక్కడే ప్రాణాలు వదిలేశారు. షాక్ తీవ్రతకు వీరి శరీర భాగాలు బాగా కాలిపోయాయి. తోటలో ఘటన జరగడంతో వీరు చనిపోయిన విషయం చాలాసేపటి వరకు బయటకు తెలియలేదు.కొద్ది సేపటి తర్వాత వెంకన్న కుమారుడు శ్రీను, మరోవ్యక్తి చిరంజీవి ఇంకో వ్యక్తితో కలిసి తోటకు వచ్చి చూడగా నలుగురూ విగతజీవులై పడి ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూసి వారు తట్టుకోలేకపోయారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వెంటనే శ్రీకాకుళం ఆర్డీవో ఎంవీ రమణ, డీఎస్పీ వి.బీమారావు, రణస్థలం సీఐ విశ్వేశ్వరరావు, లావేరు తహసీల్దార్ పి.సుధాసాగర్, ఆర్ఐ జి.రత్నకుమార్, వీఆర్వో ఎల్.అప్పారావు, ఎస్ఐ చిరంజీవిలు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. మృతులకు రూ.10 లక్షల వరకు పరిహారం చెల్లిస్తామని ఆర్డీవో తెలిపారు. ప్రమాదంపై విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని మృతుల కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపించారు. గ్రామాల్లో విషాద ఛాయలు కొత్తరౌతుపేట, పాతరౌతుపేట గ్రామాలు మునుపెన్నడూ చూడని విషాదం చూడడంతో ఆయా గ్రామాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. మృతుడు వెంకన్నకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా, రాముడుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, బంగారమ్మకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండు గ్రామాలకు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని తీవ్రంగా రోదించారు. రాయిలింగాలపేటకు చెందిన పెళ్లి కుమార్తె కూడా ఘటనా స్థలానికి వచ్చి కంటికిమింటికి ఏకధారగా రోదించారు.-భోరున విలపించిన పెళ్లి కుమార్తె ప్రమాదంలో పాతరౌతుపేట గ్రామానికి చెందిన వెంకన్న మృతి చెందడంతో పెళ్లి కుమార్తె అయిన గొర్లె కల్యాణి భోరున విలపించింది. పాతరౌతుపేట గ్రామానికి చెందిన కొమ్ము వెంకన్న కుమారుడు శ్రీను, మండలంలోని రాయిలింగారిపేట గ్రామానికి చెందిన గొర్లె పాపినాయుడు కుమార్తె కల్యాణితో మార్చి నెల 27వ తేదీన పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈనెల6వతేదీన పెళ్లి పనులు ప్రారంభం కోసం పసుపు దంచడం కోసం ముహూర్తం పెట్టి దాని కోసం అరటి పళ్లు గెలలు తేవడానికి వెళ్లి వెంకన్న మృత్యువాడ పడిన విషయం తెలుసుకున్న పెళ్లి కుమార్తె కల్యాణి సంఘటనా స్ధలానికి తల్లితో కలిసి వచ్చి విలపించింది. నిర్లక్ష్యమే కారణం.. విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యం వల్లనే నలుగురి ప్రాణాలు పోయాయని మృతులు కుటుంబ సభ్యులు వాపోయారు. కొత్తరౌతుపేట గ్రామంలో పొలాల్లోను, అరటితోటల్లోనూ ఎక్కడిపడితే అక్కడ విద్యుత్ వైర్లు వేలాడి ప్రమాదకరంగా ఉన్నాయని.. వాటిని సరిచేయాలని, పనికిరాని లైన్లకు ఉండే విద్యుత్ వైర్లు తీసివేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినలేదని వారంటున్నారు. లైన్మెన్ విద్యుత్ వైర్లు తీసివేసి ఉంటే ఇప్పుడు నలుగురు మృతి చెంది ఉండేవారు కాదని, అతనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దురదృష్టకర సంఘటన అరసవల్లి: లావేరు మండలం రౌతుపేట వద్ద ఆదివారం జరిగిన ఘటన దురదృష్టకరమని విద్యుత్‌శాఖ శ్రీకాకుళం డివిజనల్ ఇంజినీర్ కె.చలపతిరావు వ్యాఖ్యానించారు. ‘సాక్షి’తో మాట్లాడారు. కొమ్ము వెంకన్న, రౌతు బంగారమ్మ, ఆబోతుల రాములు, పుణ్యవతి అనే నలుగురు ఒకే చోట విద్యుత్ షాక్‌తో మృతి చెందారని, వీరి కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున శాఖాపరంగా నష్టపరిహారం ఇచ్చేలా ఉన్నతాధికారులు నిర్ణయించారన్నారు. విద్యుత్ శాఖ పరంగా ఘటన స్థలంలో ఎటువంటి నిర్లక్ష్యం లేదని, ఆ గ్రామం వద్ద గత కొంతకాలం క్రితమే విద్యుత్ ఎల్టీ లైన్ సరఫరాను పూర్తిగా నిలిపివేశామని (డెడ్ ఎండ్ లైన్) వివరించారు. రౌతుపేటకు చెందిన కొమ్ము వెంకన్న, రౌతు బంగారమ్మ అనే ఇద్దరు కలిసి..డెడ్ ఎండ్ లైన్ వద్ద ఉన్న ఓ అరటి గెలను కొడుతుండగా, అప్పటికే డెడ్ అయిన ఎల్టీ విద్యుత్ లైన్‌పై ఆ గెల తెగిపడిందని, చెట్టుతో కూడిన ఆ అరటి గెల బరువుగా ఒక్కసారిగా ఆ లైన్‌పై పడటంతో, ఆ ఎల్టీ లైన్ చివరి భాగం పైకి తేలి, దగ్గరల్లోనే ఉన్న 11 కేవీ లైన్‌ను తాకిందని వివరించారు. దీంతో సరఫరా ఉన్న 11 కేవీ లైన్ కనెక్ట్ కావడంతో అరటి చెట్టును తాకి ఉన్న ఈ ఇద్దరూ అక్కడికక్కడే విద్యుత్ షాక్‌తో మృతి చెందారని, అయితే వీరిద్దరినీ రక్షించేందుకు వెళ్లి వారిని పట్టుకున్న ఆబోతుల రాములు, పుణ్యవతిలు కూడా అక్కడికక్కడే విద్యుత్ షాక్‌కు గురై మృత్యువాత పడ్డారని తన పరిశీలనలో తేలిందని స్పష్టం చేశారు. -
అరటి రైతు విలవిల
రైల్వేకోడూరు: అత్యధికంగా పండ్లతోటలు ఉండే ఏకైక ప్రాంతంగా రైల్వేకోడూరు నియోజకవర్గం జిల్లాలోనే ప్రసిద్ధిగాంచింది. అయితే అరటి, మామిడి పంటలు చేతికొచ్చే సమయంలో ప్రకృతి ప్రకోపం కారణంగా పంట చేతికి వచ్చి కాయలు కోసే దశలో నేలపాలు కావడంతో రైతులు కుదేలవుతున్నారు. అయిపోతున్నాడు. బాగా దిగుబడి వచ్చింది, అప్పుల ఊబి నుంచి బయటపడతామని అనుకుంటుండగానే గత నెల 15వ తేదీ పెద్ద ఎత్తున వీచిన గాలి వానకు పుల్లంపేట, రైల్వేకోడూరు మండలాల్లో వందల ఎకరాల్లో అరటి నేల మట్టంకాగా, మామిడి కాయలు అన్ని మండలాల్లో నేల రాలిపోయాయి. అలాగే గత నెల చివరలో వచ్చిన ఈదురు గాలులకు ఒక్క పుల్లంపేట మండలంలోనే దాదాపు 120 ఎకరాల్లో అరటి నేలకొరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22న ఆదివారం సాయంత్రం గాలి వానతో పాటు వడగండ్ల వాన రావడంతో మరోసారి వందల ఎకరాల్లో అరటి నేలకొరిగింది. దీంతో రైతులు దిక్కు తోచని స్థితిలో దిగాలు పడిపోయారు. పంట నష్టం గురించి రైతులు సమాచారం ఇచ్చినా అటు వైపు ఏ అధికారి కన్నెత్తి చూడటంలేదు. రెవెన్యూ, ఉద్యానవన అధికారులు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ కనీసం సర్వే చేసేందుకు కూడా ముందుకు రాకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. ఎట్టకేలకు తాము ప్రాధేయపడితే ఉద్యానవన అధికారులు వచ్చి తూతూ మంత్రంగా సర్వే చేసి వెళ్లారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు గట్టిగా ప్రశ్నిస్తే మీ తోటలో మీరు నిలబడి ఫొటోలు, ఆధార్‌కార్డు, పాసుపుస్తకాల జిరాక్సు కాపీలు తెమ్మని ఆదేశిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టం వాటిల్లితే తక్షణమే స్పందించి సర్వే చేయించి రైతులను ఆదుకొనేవారని రైతులు గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం కూడా రైతులకు అంతో ఇంతో సహాయం అందించిందని.. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం గత నాలుగేళ్ల కాలంలో ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన రైతులను ఆదుకున్న పాపాన పోలేదని రైతులు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రకృతితో నష్టపోయిన రైతు తిరిగి అదే భూమిలో మరో పంట పండించుకునేందుకు అయ్యే నామమాత్రపు ఖర్చును సైతం అందజేయని ఈ ప్రభుత్వం రైతుకు మేలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం దుర్మార్గపు చర్యగా రైతులు అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకుంటే లక్షల్లో నష్టపోయిన రైతులు కోలుకోవడం కష్టమేననే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అరటి పంట నేలకొరిగిన పొలాలను జిల్లా కలెక్టర్ పరిశీలించి, రైతులకు నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఉద్యానవన అధికారులకునియంత్రణ లేదా.. ప్రతి మండలంలో రైతులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఉద్యానవన అధికారులను నియమించింది. కానీ ఈ శాఖకు చెందిన మండల స్థాయి అధికారులు రైతులకు చుక్కలు చూపిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు వీరి చర్యలపై దృష్టి సారించి వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి నేను సాగు చేసిన ఐదు ఎకరాలలోని అరటి చెట్లు గాలి దెబ్బకు పడిపోయాయి. మళ్లీ పైరు పెట్టాలంటే కష్టంగా ఉంది. ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలి. –భీము రామచంద్రారెడ్డి, అరటిరైతు, మల్లెంవారిపల్లి, పుల్లంపేట మండలం. -
కాటేసిన కరెంటు తీగలు
వేసవి కాలం వచ్చేసింది... అగ్నిప్రమాదాలు అధికమయ్యాయి... జిల్లాలో రోజూ ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి.. ముఖ్యంగా విద్యుదాఘాతాలు సంభవిస్తున్నాయి... కొన్ని చోట్ల ఎండిన గడ్డికి ఆకతాయిలు నిప్పు పెట్టడంతో మంటలు పంట పొలాలకు వ్యాపిస్తున్నాయి... శుక్రవారం ఒక్క రోజే మూడు ప్రాంతాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి అగ్నిప్రమాదాలు జరిగాయి... దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాశినాయన : మండలంలోని సావిశెట్టిపల్లెకు చెందిన కె.రామసుబ్బమ్మ, కె.చైతన్య, కె.కుళ్లాయమ్మ, చెన్నకేశవరెడ్డికి చెందిన 8 ఎకరాల్లోని అరటి పంట దగ్ధమైంది. గ్రామస్తులు, ఆర్ఐ మోహన్‌రాజు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాత్రి విద్యుదాఘాతం సంభవించడంతో అరటి పంటతోపాటు డ్రిప్ వైర్లు కాలిపోయాయి. రూ.8 లక్షల మేర నష్టం వాటిల్లింది. అప్పు చేసి పంటను సాగు చేశామని, తీరా కోతకు వచ్చే సమయంలో కాలిపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ, ఉద్యానవన శాఖల అధికారులు నష్టపరిహారం అందజేయాలని వారు కోరారు. గడ్డంవారిపల్లెలో నిమ్మ చెట్లు... చక్రాయపేట : ఎర్రబొమ్మనపల్లె గ్రామ పంచాయతీలోని గడ్డంవారిపల్లెలో శుక్రవారం విద్యుదాఘాతంతో నిమ్మ చెట్లు కాలిపోయాయి. వివరాలలోకి వెళితే.. గడ్డంవారిపల్లెకు చెందిన చిట్టెం రాజారెడ్డి పొలంలో 30 నిమ్మ చెట్లపై విద్యుత్ వైర్లు తెగి పడి కాలిపోయాయి. సుమారు రూ.3 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా నిమ్మ చెట్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రాజుపాళెం : రాజుపాళెంలోని ఎస్సీ కాలనీలో విద్యుదాఘాతం సంభవించడంతో శుక్రవారం బోదకొట్టం, గడ్డివామి దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన పెద్దకాటిగాళ్ల నరసింహుడు పది ట్రిప్పులు చొప్ప తోలుకొని పశువులకు వామి వేసుకుం టున్నాడు. పక్కనే గోవాకు నరసింహుడు చిన్న బోద కొట్టంలో నివసిస్తున్నాడు. ఆయన అతుకులు వేసిన విద్యుత్ వైరును కొట్టానికి వేసుకున్నాడు. ఆ అతుకుల వద్ద షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు వచ్చాయి. ఆ సమయంలో 12 మంది కూలీలు వామి వేస్తున్నారు. వారందరూ కిందికి దూకారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలే దు. సమాచారం అందుకున్న ప్రొద్దుటూరు అగ్నిమాపక అధికారి రామన్న, సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే వామి, కొట్టం కాలిపోయాయి. ఈ ఘటనలో పెద్దకాటిగాళ్ల నరసింహుడుకు రూ.50 వేలు, గోవాకు నరసింహుడుకు రూ.60 వేల ఆస్తి నష్టం, బాలయ్యకు చెందిన దూడ చనిపోవడంతో రూ.6 వేల నష్టం వాటిల్లింది. తహసీల్దార్ కేవీ ప్రభాకరరెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్, వీఆర్ఓలు సుబ్బారెడ్డి, రామయ్య, లక్ష్మీనారాయణరెడ్డి పరిశీలించారు. నష్ట పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదిస్తామని తహసీల్దార్ తెలిపారు. -
పంట పాడుచేసిన హెలికాప్టర్
తాడేపల్లి రూరల్(మంగళగిరి): ఉండవల్లిలోని అమరావతి కరకట్ట వెంట నివసించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి సోమవారం ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్వామీజీ రవిశంకర్ విచ్చేశారు. ఆయన హెలికాప్టర్ దెబ్బకు పక్క పొలంలో అరటితోట నేలకూలింది. సదరు రైతుకు రూ.25 వేలు ఆస్తి నష్టం సంభవించింది. బాధితుడైన రైతు దంటు రఘు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం సీఎం నివాసానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ స్వామీజీ విచ్చేశారు. ఆయన వచ్చిన హెలికాప్టర్ రఘు పొలానికి అతి సమీపం నుంచి ప్రయాణించడంతో తోటలో ఉన్న అరటిచెట్లన్నీ నేల ఒరిగాయి. మొత్తం 80 చెట్ల వరకు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం గెల రూ.210లకు పంట పొలంలోనే అమ్ముతున్నామని, దాదాపు రూ.25 వేల నష్టం సంభవించిందని రైతు వాపోయాడు. హెలికాప్టర్ వచ్చిన సమయంలో పొలంలో పనిచేస్తున్నామని, కళ్ల ముందే చెట్లన్నీ నేలకొరుగుతున్నాయని, వెంటనే తోటలో ఉన్న ముగ్గురు కూలీలతో కలిసి నాలుగు చెట్లు పట్టుకోగా అవి మాత్రమే ఆగాయని తెలిపారు. మిగతావన్నీ కూలిపోయాయని ఆవేదనతో చెప్పారు. గడబొంగులు సైతం విరిగాయన్నారు. సీఎం భేటీ అనంతరం స్వామీజీ విజయవాడ వెళ్తుండగా, వారి బృందానికి జరిగిన విషయం చెప్పానని, అయితే విజయవాడ వెళ్లి వచ్చిన తర్వాత నష్టపరిహారం గురించి మాట్లాడతామని చెప్పారని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల వరకు చేలోనే కూర్చుని తిరిగి మళ్లీ కలిశానని, అయితే సీఎం సెక్యూరిటీ నష్టపరిహారం అందజేస్తారని సదరు స్వామీజీ భక్తులు తెలియజేశారని రఘు చెప్పారు. -
శాశ్వత సౌందర్యం
ఆత్మీయం పూర్వం ఒక ధనికుడు నూతన భవనం నిర్మించాలని అనుకున్నాడు. భవన నిర్మాణం కోసం.. ‘గరుకుతనం లేకుండా, నున్నగా ఉన్న కొన్ని కొయ్య స్తంభాలు తీసుకురమ్మ’ ని తన సేవకులను ఆదేశించాడు. యజమాని ఆజ్ఞ ప్రకారం సేవకులు ఊరూరా గాలించారు. ఎక్కడ చూసినా.. కొయ్యలు కాస్త గరుగ్గానే ఉండటంతో.. అవి పనికిరావని భావించారు. ఈ క్రమంలో టేకు కొయ్యలను కూడా వద్దనుకున్నారు. ఇలా వెళ్తుండగా.. ఒక ఊరి చివరన ఉన్న అరటితోటపై సేవకుల దృష్టి పడింది. అక్కడ అరటి బోదెలను చూసి ఎంత నునుపుగా ఉన్నాయో అని ముచ్చటపడి, భారీ ధర చెల్లించి వందలాది అరటి బోదెలను కొన్నారు. వాటన్నింటినీ బళ్లలో వేసుకుని ఇంటికి చేరుకున్నారు. ‘మీరు ఎన్నడూ చూడని నునుపైన, అందమైన కొయ్యలను తెచ్చాం. చూడండి’ అని యజమానితో అన్నారు గొప్పగా. అరటి బోదెలను చూసిన యజమాని కోపంతో ‘ఎంత పని చేశార్రా! పైపై సౌందర్యం చూసి మోసపోయారు. ఇవి అరటి బోదెలు. పైకి అందంగా కనిపించినా.. వీటిలో సత్తువ ఉండదు. ఇవి ఇల్లు కట్టుకోవడానికి పనికి రావు. అనవసరంగా డబ్బు తగలేశారు’ అని చీవాట్లు పెట్టి, తానే స్వయంగా వెళ్లి మంచి టేకు కొయ్యలను కొనుగోలు చేశాడు. ప్రాపంచిక విషయాలు కూడా ఇలా అందంగా కనిపిస్తాయి. కానీ, అవి తాత్కాలికమైనవి. శాశ్వతమైనదే సుందరమైనది. అంటే భగవంతుడొక్కడే అందమైన వాడు. శాశ్వతమైనవాడు. అలాగే పైకి అందంగా కనిపించిన వారందరూ మంచివాళ్లు కాకపోవచ్చు. అలాగే అందవికారంగా కనిపించిన వారందరూ చెడ్డవాళ్లు కారు, కాబోరు. -
మచ్చతెగులుతో జాగ్రత్త
– ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ మాధవి - అరటి రైతులకు శిక్షణ అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో అరటి తోటల్లో మచ్చతెగులు ఆశించే అవకాశం ఉన్నందున రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్త డాక్టర్ త్రికలా మాధవి తెలిపారు. మంగళవారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రంలో ప్రిన్సిపల్ ఎస్.చంద్రశేఖరగుప్తా ఆధ్వర్యంలో అరటిసాగుపై రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో సాగు పద్ధతుల గురించి డాక్టర్ మాధవి, సేంద్రియ పద్ధతుల అంశంపై రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ విజయశంకరబాబు హాజరై అవగాహన కల్పించారు. గ్రాండ్–9 రకం బెస్ట్ ఇపుడున్న పరిస్థితుల్లో టిష్యూ కల్చర్ అరటిలో గ్రాండ్–9 రకం సాగు చేయడం శ్రేయస్కరం. కొన్ని రకాల తెగుళ్లు, చీడపీడలను అధిగమించే సత్తా ఈ రకానికి ఉంది. ప్రస్తుత వాతావరణంలో అరటిలో సిగటోకమచ్చ తెగులు ఆశించే అవకాశం ఎక్కువ. నివారణకు 1 గ్రాము కార్బండిజమ్ లీటర్ నీటికి కలిపి గెల బాగా తడిచేలా పిచికారి చేసుకోవాలి. అలాగే అరటి హస్తాలు బాగా అభివృద్ధి చెందడానికి 10 గ్రాములు 13–0–45 + 5 గ్రాముల యూరియా లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. గెల వేయగానే ఆరోగ్యంగా ఎదగడానికి పాలిథీన్కవర్లతో కప్పిపెట్టాలి. పాలిథీన్ కవర్లు వేసే ముందు 5 గ్రాములు 13–0–45 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకుంటే మేలు. గెల వేయగానే కిందనున్న మగపువ్వును కోసివేస్తే గెల మొత్తం హస్తాలు బాగా వృద్ధి చెందుతాయి. మొక్కలు నాటే సమయంలో మాత్రమే సూపర్‌పాస్ఫేట్ వేయాలి. గెల సమయంలో అసలు వాడకూడదు. గెల వేసిన తర్వాత పొటాష్, నత్రజని ఎరువులతో పాటు ఐరన్, జింక్ సల్ఫేట్ వాడితే దిగుబడులు పెరుగుతాయి. రసాయన ఎరువులతో పాటు ఆవుపేడ, వర్మీ కంపోస్టు లాంటి సేంద్రియ ఎరువులు వాడటం వల్ల అరటి ఉత్పత్తులు నాణ్యంగానూ, అధిక దిగుబడులు వస్తాయి. ఈ రకం అరటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. -
అరటి చెట్ల నరికి వేత
వేముల: రాచకుంటపల్లెలోని రైతు ఎర్రగోర్ల శేఖర్‌కు చెందిన అరటి తోటను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి నరికివేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ నరేంద్రకుమార్ రాచకుంటపల్లెకి వెళ్లి అరటి తోటను పరిశీలించారు. అరటి చెట్లను నరికిన ప్రాంతంలో దుండగుల ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయా అని నిశితంగా పరిశీలించారు. అనంతరం బాధితుడిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తనకున్న 2.50 ఎకరాల్లో నాలుగు నెలల క్రితం అరటి సాగు చేశానని శేఖర్ తెలిపారు. సుమారు 250 చెట్లను నరికివేశారని ఆయన పేర్కొన్నారు. ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు తోటలోకి ప్రవేశించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి అరటి తోటను సాగు చేస్తే నడి వయస్సు వచ్చిన తర్వాత నరికివేయడంతో బాధితుడు లబోదిబోమంటున్నారు. గ్రామంలో ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు జరగలేదని గ్రామస్తులు అంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
అడవి పంది దాడిలో రైతుకు గాయాలు
వై.కోట(ఓబులవారిపల్లె): మండలంలోని వై.కోట గ్రామంలో సోమవారం బాజరు నాగభూషణం అనే రైతుపై అడవి పంది దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి కథనం మేరకు.. గ్రామ సమీపంలోని అరటి తోటలో ఆకులు కోసేందుకు వెళ్లగా పెద్ద అడవి పంది ఒక్కసారిగా దాడిచేసింది. ఈ దాడిలో కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రైతుకు స్థానికులు రైల్వేకోడూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఎంపీపీ వెంకటేశ్వరరాజు గాయపడిన రైతును మంగళవారం పరామర్శించారు. -
అరటి తోట బుగ్గిపాలు
పులివెందుల రూరల్ : పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లెలో ఆరు ఎకరాల్లో అరటి తోట అగ్నికి ఆహుతైంది. బాధితుల కథనం మేరకు.. బ్రాహ్మణపల్లె మాజీ సర్పంచ్ మల్రెడ్డి ఆరు ఎకరాల్లో అరటి సాగు చేశారు. ఇంకో నెలలో కోతకు సిద్ధమవుతున్న తరుణంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఉన్నట్లుండి మంటలు వ్యాపించడాన్ని సమీపంలోని తోటల రైతులు గమనించారు. మల్రెడ్డి, అగ్నిమాక శాఖ అధికారులకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. ఫైర్‌స్టేషన్ అధికారి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. పక్క తోటలకు మంటలు వ్యాపించకుండా పొలం గట్లను నీటితో తడిపారు. దీంతో పక్క తోటల రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో డ్రిప్ పరికరాలు కాలి బూడిదయ్యాయని, పంట పూర్తిగా పోయిందని బాధిత రైతు మల్రెడ్డి తెలిపారు. రూ.10 లక్షలు నష్టం సంభవించిందన్నారు. తోటలో ఎండిన ఆకులు అధికంగా ఉండటంతో మంటలు చెలరేగాయి. ఎండిన అరటి ఆకులు తొలగించాలని అగ్ని మాపక శాఖాధికారులు సూచిస్తున్నా, తేమ ఆరిపోకూడదని రైతులు ఆ పని చేయడం లేదు. కాగా ఇది ప్రమాదమా, లేక ఆకతాయిల పనా అన్నది స్పష్టం కాలేదు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన వైఎస్ మనోహర్‌రెడ్డి అగ్ని ప్రమాదంలో కాలిపోయిన అరటి తోటను వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మున్సిపల్ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చెర్మైన్ చిన్నప్పలు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్లు వరప్రసాద్, చెన్నారెడ్డి, రామనాథ్, రమాదేవి, వైఎస్ఆర్ సీపీ నాయకులు రామచంద్రారెడ్డి, శివకుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాసులరెడ్డి తదితరులు ఘటనా స్థలిని పరిశీలించారు.