మాటలకందని విషాదం | Farmers Died in Electrick Shock in Banana Garden Srikakulam | Sakshi
Sakshi News home page

మాటలకందని విషాదం

Published Mon, Feb 4 2019 10:21 AM | Last Updated on Mon, Feb 4 2019 10:21 AM

Farmers Died in Electrick Shock in Banana Garden Srikakulam - Sakshi

మహిళల మతదేహాల వద్ద రోదిస్తున్న బంధువులు

అరటి తోటలో కాపు కాసిన మృత్యువు నలుగురిని మింగేసింది. పెళ్లి పనులతో సందడిగా ఉన్న ఇంటిలో భయానక నిశ్శబ్దాన్ని నింపింది. ప్రశాంతంగా ఉన్న రెండు పల్లెల గుండెల్లో విషాదపు కుంపటి రాజేసింది. భవిష్యత్‌ కోసం కోటి కలలు కంటున్న వధూవరుల కళ్లల్లో కన్నీళ్లు కుమ్మరించింది. విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యాన్ని మరీ కర్కశంగా చూపిస్తూ మూడు కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. లావేరు మండలంలోని కొత్తరౌతుపేటలో ఆదివారం విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందిన సంఘటన జిల్లావ్యాప్తంగా మాటలకందని విషాదాన్ని నింపింది. మృతులంతా బంధువులే కావడం గమనార్హం.

శ్రీకాకుళం, లావేరు: లావేరు మండలంలోని తామాడ పంచాయతీ కొత్తరౌతుపేట గ్రామంలో ఆదివారం విద్యుత్‌ షాక్‌ తగిలి కొమ్ము వెంకన్న(48), ఆబోతుల రాముడు(60), అతని భార్య ఆబోతుల పుణ్యవతి(50), రౌతు బంగారమ్మ(45) అనే నలుగురు  మృతి చెందారు. పెళ్లి పనులు ప్రారంభించడం కోసం తోటలోఅరటి గెలలు కోస్తుండగా విద్యుదాఘాతంతో మృతి చెందారు. మృతులు కొత్తరౌతుపేట, పాతరౌతుపేట గ్రామాలకు చెందిన వారు. వీరి మృతి వార్త తెలియడంతో రెండు గ్రామాల్లో విషాదం అలముకుంది. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..  పాతరౌతుపేట గ్రామానికి చెందిన కొమ్ము వెంకన్న కుమారుడు శ్రీనుకు మార్చి 27వ తేదీన వివాహం చేయాలని ముహూర్తం నిర్ణయించారు. పెళ్లి పనుల ప్రారంభానికి సూచికగా ఈ నెల 6వ తేదీన పసుపు దంచాలని నిశ్చయించారు. ఈ వేడుకకు అరటి గెలలు అవసరం కావడంతో కొత్తరౌతుపేటలో ఉంటున్న తన బావ ఆబోతుల వెంకన్న అరటి తోటకు ఇద్దరూ కలిసే వెళ్లారు.

అరటి గెలలు కోస్తుండగా కిందకు వేలాడి ఉన్న విద్యుత్‌ తీగ తలిగి ఇద్దరూ షాక్‌తో అక్కడే మృతి చెందారు. మధ్యాహ్నం ఒంటి గంట అయినా వీరిద్దరూ తోట నుంచి తిరిగి రాకపోవడంతో ఆ పక్కనే మరో తోటలో గొప్పు తవ్వుతున్న రాముడు భార్య పుణ్యవతి, కొత్తరౌతుపేటకు చెందిన మరో మహిళ రౌతు బంగారమ్మలు వెంకన్న తోటలోనికి వెళ్లారు. అక్కడ కిందపడి ఉన్న వీరిని చూసి వారిని పైకి లేపడానికి ప్రయత్నించగా వారికీ విద్యుత్‌ షాక్‌ తగిలింది. దీంతో వారు అక్కడే ప్రాణాలు వదిలేశారు. షాక్‌ తీవ్రతకు వీరి శరీర భాగాలు బాగా కాలిపోయాయి. తోటలో ఘటన జరగడంతో వీరు చనిపోయిన విషయం చాలాసేపటి వరకు బయటకు తెలియలేదు.కొద్ది సేపటి తర్వాత వెంకన్న కుమారుడు శ్రీను, మరోవ్యక్తి చిరంజీవి ఇంకో వ్యక్తితో కలిసి తోటకు వచ్చి చూడగా నలుగురూ విగతజీవులై పడి ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూసి వారు తట్టుకోలేకపోయారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న వెంటనే శ్రీకాకుళం ఆర్డీవో ఎంవీ రమణ, డీఎస్పీ వి.బీమారావు, రణస్థలం సీఐ విశ్వేశ్వరరావు, లావేరు తహసీల్దార్‌ పి.సుధాసాగర్, ఆర్‌ఐ జి.రత్నకుమార్, వీఆర్వో ఎల్‌.అప్పారావు, ఎస్‌ఐ చిరంజీవిలు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. మృతులకు రూ.10 లక్షల వరకు పరిహారం చెల్లిస్తామని ఆర్డీవో తెలిపారు. ప్రమాదంపై విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని మృతుల కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపించారు. 

గ్రామాల్లో విషాద ఛాయలు
కొత్తరౌతుపేట, పాతరౌతుపేట గ్రామాలు మునుపెన్నడూ చూడని విషాదం చూడడంతో ఆయా గ్రామాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. మృతుడు వెంకన్నకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా, రాముడుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, బంగారమ్మకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండు గ్రామాలకు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని తీవ్రంగా రోదించారు. రాయిలింగాలపేటకు చెందిన పెళ్లి కుమార్తె కూడా ఘటనా స్థలానికి వచ్చి కంటికిమింటికి ఏకధారగా రోదించారు.-భోరున విలపించిన పెళ్లి కుమార్తె 

ప్రమాదంలో పాతరౌతుపేట గ్రామానికి చెందిన వెంకన్న మృతి చెందడంతో పెళ్లి కుమార్తె అయిన గొర్లె కల్యాణి భోరున విలపించింది. పాతరౌతుపేట గ్రామానికి చెందిన కొమ్ము వెంకన్న కుమారుడు శ్రీను, మండలంలోని రాయిలింగారిపేట గ్రామానికి చెందిన గొర్లె పాపినాయుడు కుమార్తె కల్యాణితో మార్చి నెల 27వ తేదీన పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈనెల6వతేదీన పెళ్లి పనులు ప్రారంభం కోసం పసుపు దంచడం కోసం ముహూర్తం పెట్టి దాని కోసం అరటి పళ్లు గెలలు తేవడానికి వెళ్లి వెంకన్న మృత్యువాడ పడిన  విషయం తెలుసుకున్న  పెళ్లి కుమార్తె కల్యాణి సంఘటనా స్ధలానికి తల్లితో కలిసి  వచ్చి విలపించింది. 

నిర్లక్ష్యమే కారణం..
విద్యుత్‌ శాఖాధికారుల నిర్లక్ష్యం వల్లనే నలుగురి ప్రాణాలు పోయాయని మృతులు కుటుంబ సభ్యులు వాపోయారు. కొత్తరౌతుపేట గ్రామంలో పొలాల్లోను, అరటితోటల్లోనూ ఎక్కడిపడితే అక్కడ విద్యుత్‌ వైర్లు వేలాడి ప్రమాదకరంగా ఉన్నాయని.. వాటిని సరిచేయాలని, పనికిరాని లైన్లకు ఉండే విద్యుత్‌ వైర్లు తీసివేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినలేదని వారంటున్నారు. లైన్‌మెన్‌ విద్యుత్‌ వైర్లు తీసివేసి ఉంటే ఇప్పుడు నలుగురు మృతి చెంది ఉండేవారు కాదని, అతనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

దురదృష్టకర సంఘటన
అరసవల్లి: లావేరు మండలం రౌతుపేట వద్ద ఆదివారం జరిగిన ఘటన దురదృష్టకరమని విద్యుత్‌శాఖ శ్రీకాకుళం డివిజనల్‌ ఇంజినీర్‌ కె.చలపతిరావు వ్యాఖ్యానించారు. ‘సాక్షి’తో మాట్లాడారు.  కొమ్ము వెంకన్న, రౌతు బంగారమ్మ, ఆబోతుల రాములు, పుణ్యవతి అనే నలుగురు ఒకే చోట విద్యుత్‌ షాక్‌తో మృతి చెందారని, వీరి కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున శాఖాపరంగా నష్టపరిహారం ఇచ్చేలా ఉన్నతాధికారులు నిర్ణయించారన్నారు. విద్యుత్‌ శాఖ పరంగా ఘటన స్థలంలో ఎటువంటి నిర్లక్ష్యం లేదని, ఆ గ్రామం వద్ద గత కొంతకాలం క్రితమే విద్యుత్‌ ఎల్‌టీ లైన్‌ సరఫరాను పూర్తిగా నిలిపివేశామని (డెడ్‌ ఎండ్‌ లైన్‌) వివరించారు. రౌతుపేటకు చెందిన కొమ్ము వెంకన్న, రౌతు బంగారమ్మ అనే ఇద్దరు కలిసి..డెడ్‌ ఎండ్‌ లైన్‌ వద్ద ఉన్న ఓ అరటి గెలను కొడుతుండగా, అప్పటికే డెడ్‌ అయిన ఎల్‌టీ విద్యుత్‌ లైన్‌పై ఆ గెల తెగిపడిందని, చెట్టుతో కూడిన ఆ అరటి గెల బరువుగా ఒక్కసారిగా ఆ లైన్‌పై పడటంతో, ఆ ఎల్‌టీ లైన్‌ చివరి భాగం పైకి తేలి, దగ్గరల్లోనే ఉన్న 11 కేవీ లైన్‌ను తాకిందని వివరించారు. దీంతో సరఫరా ఉన్న 11 కేవీ లైన్‌ కనెక్ట్‌ కావడంతో అరటి చెట్టును తాకి ఉన్న ఈ ఇద్దరూ అక్కడికక్కడే విద్యుత్‌ షాక్‌తో మృతి చెందారని, అయితే వీరిద్దరినీ రక్షించేందుకు వెళ్లి వారిని పట్టుకున్న ఆబోతుల రాములు, పుణ్యవతిలు కూడా అక్కడికక్కడే విద్యుత్‌ షాక్‌కు గురై మృత్యువాత పడ్డారని తన పరిశీలనలో తేలిందని స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement